స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఈక్విటీలు, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ అనే మార్గాలు ఉంటాయని గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం కదా...
ఇందులో ఫ్యూచర్స్ & ఆప్షన్స్... దానిలో ఇండెక్స్ ట్రేడ్ ల గురించి ఇప్పుడు చూద్దాం.
వాస్తవానికి ఫ్యూచర్స్ కి, ఈక్విటీల్లో ట్రేడింగ్ కి పెద్దగా తేడా ఉండదు. ఈక్విటీ ల్లో షేర్లు గా వ్యవహరిస్తే... ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (ఎఫ్ & ఓ ) లో కాంట్రాక్టులు గా పేర్కొంటారు. ఈక్విటీల్లో మనం కొనే షేర్లు ఎన్ని సంవత్సరాలైనా అట్టేపెట్టుకోవచ్చు. షేర్లు అనేవి మన ఆస్తిగా భావించవచ్చు. కాంట్రాక్టులను మాత్రం ఆవిధంగా పరిగణించలేం. ఎఫ్ & ఓ లో కాంట్రాక్టులు కొన్నప్పుడు కేవలం ఒక నెల రోజుల వ్యవధికే పరిమితమవుతాయి.
ఒకవేళ మనం కొన్న కాంట్రాక్టు మంచి లాభాల్లో ఉంటే ఆ నెల రోజుల్లో ఎప్పుడైనా ఆ లాభాన్ని బుక్ చేసుకుని బయటకు వచ్చేయొచ్చు.
అదే నష్టాల్లో ఉంటే నెల రోజుల వరకు ఆగొచ్చు. అప్పటికీ నష్టాల్లోంచి బయట పడకపోతే కచ్చితంగా నెలాఖరున బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. ఆ కాట్రాక్టు రాబోయే రోజుల్లో పెరుగుతుందనే నమ్మకం ఉంటే... ప్రస్తుతం చేతిలో ఉన్న కాంట్రాక్టు ను నెలాఖరున అమ్మేసి తదుపరి నెల కాంట్రాక్టు ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈక్విటీల్లో ఒక్క షేర్ మొదలుకొని మన చేతిలో ఉన్న డబ్బుల్ని బట్టి ఎన్ని షేర్లు అయినా కొనుక్కోవచ్చు. ఎఫ్ & ఓ లో తప్పనిసరిగా లాట్స్ లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. షేరును బట్టి, ఇండెక్స్ ను బట్టి లాట్ సైజు ను నిర్ణయిస్తారు.
ఉదా: రిలయన్స్ షేర్ ధర రూ. 1250 ఉంది. దీన్ని ఎఫ్ & ఓ లో కొనుగోలు చేయాలంటే 500 షేర్లు (1 లాట్) తీసుకోవాలి. అదే జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ 5625 (ఒక లాట్) షేర్లు కొనాలి. ఐటీసీ అయితే.. 1600 (ఒక లాట్) తీసుకోవాలి.
ఎఫ్ & ఓ లో ట్రేడ్ చేయాలంటే కేవలం లాట్స్ లో అది కూడా పరిమిత కాలానికి మాత్రమే కొనగలం అన్న విషయం అర్ధం అయింది కదా... ఇప్పుడు ఇండెక్స్ ల గురించి మాట్లాడుకుందాం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి కి సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి కి నిఫ్టీ ప్రాతినిధ్యం వహిస్తాయి అన్న విషయం మనకు తెలుసు కదా...
ఈ సెన్సెక్స్, నిఫ్టీ లతో పాటు నిఫ్టీ నెక్స్ట్ 50, బీఎస్ఈ బ్యాంకెక్స్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ. బ్యాంకు నిఫ్టీ ల్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇవి కాక ఆటో, ఫార్మా, ఐటీ.... ఇలా వివిధ రంగాలకు కూడా ఆయా ఇండెక్స్ లు ఉంటాయి. కానీ వీటిలో ట్రేడింగ్ చేయలేం.
గత నవంబర్ 20 వ తేదీ వరకు మిడ్ నిఫ్టీ కి సోమవారం, ఫిన్ నిఫ్టీ కి మంగళవారం, బ్యాంకు నిఫ్టీ కి బుధవారం, నిఫ్టీ కి గురువారం, సెన్సెక్స్ కు శుక్రవారం... ఇలా వీక్లీ కాంట్రాక్టు లు ఉండేవి. అంటే ఆ వారాంతానికి ముగిసిపోయే కాంట్రాక్టు లన్న మాట. ఇలా ట్రేడింగ్ జరిగే ప్రతి రోజూ ఏదో ఒక ఎక్సపైరీ ఉండటం వల్ల రిటైల్ ట్రేడర్లు భారీగా నష్టపోతున్నారన్న ఉద్దేశంతో సెబీ... సెన్సెక్స్, నిఫ్టీ లకు తప్ప మిగతా ఇండెక్స్ లకు వీక్లీ కాంట్రాక్టు లు తీసేసింది.
బీ ఎస్ ఈ కి సెన్సెక్స్, ఎన్ ఎస్ ఈ కి నిఫ్టీ లు ప్రామాణిక సూచీలు కాబట్టి వీటిలో మాత్రం వీక్లీ, మంత్లీ కాంట్రాక్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా సెన్సెక్స్ వీక్లీ, మంత్లీ ఎక్సపైరీ శుక్రవారం ఉండగా వచ్చే వారం నుంచి మంగళవారం (జనవరి 7,14, 21, 28... ఇలా ) కి మారబోతోంది. నిఫ్టీ కి మాత్రం గురువారమే కొనసాగుతుంది. అలాగే లాట్ సైజు లను కూడా సెబీ మార్చింది. వాటి వివరాలు.
ఇండెక్స్ | లాట్ సైజు ప్రస్తుతం | మార్చాక | అమల్లోకి వచ్చే/వచ్చిన తేదీ |
నిఫ్టీ | 25 | 75 | జనవరి 2, 2025 |
బ్యాంకు నిఫ్టీ | 15 | 30 | ఫిబ్రవరి 2025 |
ఫిన్ నిఫ్టీ | 25 | 65 | ఫిబ్రవరి 2025 |
మిడ్ నిఫ్టీ | 50 | 120 | ఫిబ్రవరి 2025 |
సెన్సెక్స్ | 10 | 20 | జనవరి 7, 2025 |
నిఫ్టీ నెక్స్ట్ 50 | 10 | 25 | నవంబర్ 20, 2024 |
బీఎస్ఈ బ్యాంకెక్స్ | 15 | 30 | నవంబర్ 20, 2024 |
మిడ్, ఫిన్, బ్యాంకు నిఫ్టీ ల్లో ట్రేడ్ చేయాలంటే తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి చాల ఖరీదు ఉంటాయి. అదే సమయంలో లాట్ సైజు లను కూడా పెంచడం వల్ల రిటైల్ ట్రేడర్లు గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారి ప్రమేయం తగ్గుతుందని, తద్వారా వారి నష్టాల స్థాయిని తగ్గించవచ్చనేది సెబీ ఉద్దేశం.
ఉదా: గతంలో ఒక ట్రేడర్ రూ. 100 ఖరీదు చేసే నిఫ్టీ 50 ఆప్షన్ ఒక లాట్ కొనడానికి రూ. 100 X 25 (లాట్ సైజు) = రూ.2,500 వెచ్చిస్తే సరిపోయేది. మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు అదే లాట్ కొనాలంటే రూ. 7,500 పెట్టాలి. అంటే చేతిలో రూ.25,000 ఉన్న వ్యక్తి 10 లాట్లు కొనగలిగేవాడు కాస్తా తాజాగా రూ.75,000 పెట్టాల్సి ఉంటుంది కాబట్టి... ట్రేడింగ్ లో రిటైలర్ల ప్రమేయం తగ్గిపోతుంది. తద్వారా వారికొచ్చే నష్టాలు కూడా పరిమితం గానే ఉంట్టాయన్న ఉద్దేశంతో సెబీ ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇండెక్స్ ల్లో ట్రేడ్ చేసేవారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
-బెహరా శ్రీనివాస రావు
స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment