ఏది కొంటే ఎంత లాభం..? | At the money options are where the strike price is equal to the current market price of the underlying security | Sakshi
Sakshi News home page

ఏది కొంటే ఎంత లాభం..?

Published Sat, Jan 11 2025 1:44 PM | Last Updated on Sat, Jan 11 2025 1:46 PM

At the money options are where the strike price is equal to the current market price of the underlying security

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్(Trading) అనేది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. గత సెప్టెంబర్ నాటికి దేశంలో 17.5 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. ఇక 2023-24 గణాంకాల ప్రకారం 96 లక్షల మంది ట్రేడింగ్ పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో ట్రేడర్లు 51  లక్షల మందే. 96 లక్షల మందిలో 86 లక్షల  మంది కేవలం ఆప్షన్స్‌(Options)లోనే ట్రేడింగ్‌ చేస్తున్నారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆప్షన్స్ ట్రేడర్ల సంఖ్య 42 లక్షలు ఉంది. అంటే ఏడాది వ్యవధిలోనే ఆప్షన్స్ ట్రేడింగ్‌లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య రెట్టింపుపైనే పెరిగిందన్న మాట.

తొందరగా లాభాలు సంపాదించాలని..

స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, టెక్నాలజీ విస్తృతం కావడం, ఆన్‌లైన్‌లో వివిధ మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండటం, తొందరగా లాభాలు సంపాదించేయవచ్చన్న అభిప్రాయం జనాల్లో పెరిగిపోవడం, ఆర్థిక సంబంధమైన అంశాల్లో గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరగడం వంటివి స్టాక్‌ మార్కెట్ వైపు అడుగులు వేయడానికి కారణాలుగా ఉన్నాయి. గత ఆర్టికల్‌లో మనం ఆప్షన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రేడింగ్‌లో వాటికి ఎంత ప్రాధాన్యం ఉంది.. అవి ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాం.

కాల్‌, పుట్‌ తీసుకోవడం తెలియాలి..

తాజా నిబంధనల ప్రకారం ఇకపై సెన్సెక్స్, నిఫ్టీ(Nifty)లకు మాత్రమే వారాంతపు ఎక్సపైరీలు ఉంటాయి. బ్యాంకు నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీలకు నెలవారీ ఎక్సపైరీలు ఉంటాయి. ఈ ఎక్సపైరీల్లో ఆప్షన్స్ గ్రీక్స్ (డెల్టా, గామా, తీటా, వెగాలు) కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని బట్టే ఒక ఆప్షన్ ధర ఏ స్థాయిలో పెరుగుతుంది.. ఏ స్థాయిలో పడిపోతుంది అన్న విషయం తెలుస్తుంది. వీటి కంటే ముందు అసలు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలంటే ఏ కాల్ కొనాలి, ఏ పుట్ తీసుకోవాలో తెలిసి ఉండాలి. ఆప్షన్స్‌లో మనం నేరుగా షేర్లు కొనం. ఆ షేర్ల తాలూకు కాల్స్, పుట్స్(Puts) మాత్రమే తీసుకుంటాం. వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి మూడు మార్గాలు ఉంటాయి.

  • ఎట్ ది మనీ (ఏటీఎం)

  • ఇన్ ది మనీ (ఐటీఎమ్)

  • అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం)

ఎస్‌బీఐ షేరును ఉదాహరణగా తీసుకొని ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం  ఎస్‌బీఐ షేరు ధర రూ.744 వద్ద ఉంది. దీని స్ట్రైక్ ప్రైస్‌లు రూ 700, 710, 720, 730, 740, 750, 760, 770, 780, 790, 800.. ఇలా ఉంటాయి. ఎస్‌బీఐ షేర్ ధర ప్రస్తుతం ఎంత ఉందో దానికి దరిదాపుల్లో ఉండే స్ట్రైక్ ప్రైస్‌(Strike Price)ను తీసుకుంటే అది ఏటీఎం అవుతుంది. అంటే రూ.740 అన్న మాట. ఆ షేరు భవిష్యత్‌లో పెరుగుతుందనుకుంటే 740 రూపాయల కాల్, పడుతుంది అనుకుంటే 740 రూపాయల పుట్ కొనుగోలు చేయాలి. ఇవి ఏటీఎం కాంట్రాక్టులు అవుతాయి.

షేర్లలో నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే ఉంటాయి. దీని లాట్ సైజు 750. రూ.740 కాల్ ధర ప్రస్తుతం రూ.21గా ఉంది. పుట్ ధర రూ.14 ఉంది. షేర్ పెరుగుతుంది అని భావించిన A అనే వ్యక్తి జనవరి నెలకు సంబంధించి 740 కాల్‌ను రూ.21 పెట్టి కొన్నాడు. అంటే అతని పెట్టుబడి (21X750 లాట్‌) = రూ.15,750 అన్నమాట.

B అనే వ్యక్తి  షేరు పడిపోవచ్చు అన్న ఉద్దేశంతో జనవరి నెల 740 పుట్ కొన్నాడు. దీని ధర రూ.14గా ఉంది. అంటే అతను పెట్టిన పెట్టుబడి (14X750) = రూ.10,500.

షేరు ధర నెల మధ్యలో ఎప్పుడైనా అటూ ఇటూ ఊగిసలాడుతూ మొత్తం మీద జనవరి నెలాఖరుకు రూ.780 దరిదాపుల్లోకి వెళ్లింది అనుకుందాం. అప్పుడు 740 కాల్ సుమారు 45-50 దాకా పెరగొచ్చు. అంటే 15,750 పెట్టుబడి రెట్టింపు అవుతుంది. లాట్‌ పెరిగి సుమారు రూ.18,000 నుంచి రూ.22,000 దాకా ప్రాఫిట్  వస్తుంది. అదే సమయంలో పుట్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అతను కొన్న స్ట్రైక్ ప్రైస్ తాలూకు పుట్ నెలాఖరుకు సున్నా అయిపోతుంది.

ఇదీ చదవండి: సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్‌’ మేళా!

పైన తెలిపిన దానికి రివర్స్‌లో జరిగితే.. పుట్ పెరుగుతుంది. కాల్ పడిపోతుంది. పుట్ కొన్న వ్యక్తి మంచి లాభం సంపాదిస్తే, కాల్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అలాకాకుండా వచ్చిన ప్రాఫిట్ చాలు అనుకునే వ్యక్తి నెలాఖరు దాకానే వేచి ఉండక్కర్లేదు. మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాఫిట్‌ బుక్‌ చేసి బయటకు రావొచ్చు. సగటు ట్రేడర్ ఈ మార్గాన్ని అనుసరిస్తూ, ఎప్పటికప్పుడు లాభాలు బుక్ చేసుకుంటూ ఉంటే అతని ప్రయాణం సవ్యంగా సాగుతుంది. లేదంటే నష్టాలు తప్పవు.

పైన తెలిపిన ఉదాహరణ బేసిక్ వివరాలు తెలిపేందుకే. టెక్నికల్‌గా ఒక షేరుకు ఎక్కడ సపోర్ట్ దొరుకుతోంది.. ఎక్కడ రెసిస్టన్స్ ఎదురవుతోంది.. ఆప్షన్ గ్రీక్స్ వల్ల ఏం తెలుసుకోవచ్చు.. టైం డికే ప్రాధాన్యం ఏమిటో.. ఐటీఎమ్, ఓటీఎంల గురించి తదుపరి ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement