‘మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025)’ కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే క్రమంలో ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాయి. దేశంలోని భక్తులు మాత్రమే కాదు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సీఈఓలు.. ఇలా విభిన్న రంగాలకు చెందినవారు హాజరవుతారు. ఈ తరుణంలో కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంతకంటే మెరుగైన అవకాశం మరొకటి ఉండదని భావిస్తున్నాయి. దాంతో విభిన్న ప్రచారపంథాను అనుసరిస్తున్నాయి.
భారీగా భక్తుల తాకిడి..
పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను గంగా, యమునా, సరస్వతి నదులు ఒకేచోట కలిసే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్నారు. జనవరి 14న మొదలై ఫిబ్రవరి 26తో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో స్నానాలు ఆచరిస్తే పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈసారి దాదాపు 40 కోట్ల మంది మంది ఈ మహా కుంభమేళాకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ కంపెనీలు దీన్ని అవకాశం మలుచుకుని తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని చూస్తున్నాయి. అందుకోసం విభిన్న మార్గాలను అనుసరిస్తున్నాయి.
బ్రాండ్ ప్రచారం
కొన్ని కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రచారం చేసుకునేందుకు దుస్తులు మార్చుకునే గదులు, ఛార్జింగ్ పాయింట్లు, విశ్రాంతి గదులు, సెల్ఫీ జోన్ల(Selfie Zones)ను ఏర్పాటు చేస్తున్నాయి. ఉదాహరణకు, డాబర్ ఆమ్లా, వాటికా స్నానాల ఘాట్ల వద్ద మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశాయి. డాబర్ లాల్ తేల్ ప్రత్యేక శిశు సంరక్షణ గదులను ఏర్పాటు చేసింది.
ప్రకటనలకు భారీగా ఖర్చు
భక్తులు నివసించే ప్రదేశాలు, షాపింగ్ చేసే ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, ఫ్లెక్స్ బోర్డులు, ఎల్‌ఈడీ స్క్రీన్(LED Screens)లు వంటి విభిన్న ప్రకటన మాధ్యమాలను ఉపయోగిస్తున్నాయి. 45 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో భక్తులకు తమ బ్రాండ్ల విజిబిలిటీ కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. హోర్డింగ్‌లు/ ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రదర్శించాలని ఆసక్తి ఉన్నవారు కనీసం రూ.10 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై 10 సెకన్ల యాడ్ కోసం కనిష్టంగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు.
సాంస్కృతిక సమైక్యత
కంపెనీలు తమ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసే వ్యూహాల్లో సంప్రదాయం, సంస్కృతిని మిళితం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐటీసీ బ్రాండ్ బింగో.. లోకల్ సాంగ్స్‌పై రీల్స్ చేయాలని నిర్ణయించింది. కుకు ఎఫ్‌ఎం తన ఓటీటీ యాప్ ‘భక్తి’ని లాంచ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై లీగల్ చర్యలు?
సామాజిక బాధ్యత
కార్పొరేట్ కంపెనీలకు వచ్చే లాభాల్లో నిబంధనల ప్రకారం ‘కార్పొరేట్ సమాజిక బాధ్యత(CSR)’ కింద కొన్ని నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అది ఈ కుంభమేళాలో వెచ్చించనున్నారు. దాంతో కంపెనీలకు పబ్లిసిటీతో పాటు, సీఎస్‌ఆర్ నిధులు ఖర్చు అవుతాయి. అందులో భాగంగా హెల్ప్ డెస్క్‌లు, పోలీసు బారికేడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అత్యవసర సేవలను అందించడం ద్వారా సంస్థలు ఈ కార్యక్రమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిసింది. మహా కుంభమేళా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. వివిధ దేశాల నుంచి సందర్శకులు, భక్తులు పెద్ద సంఖ్యలో రాబోతున్నారు. అంతర్జాతీయంగా తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలనుకునేవారికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment