ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు జొమాటో, స్విగ్గీలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) సన్నద్ధమవుతోంది. ఈ కంపెనీలు అనుసరిస్తున్న పద్ధతుల ద్వారా మార్కెట్ తటస్థతకు భంగం వాటిల్లుతున్నట్లు తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా వేలాది రెస్టారెంట్ల మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఎన్ఆర్‌ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది.
ఎన్‌ఆర్‌ఏఐ ఆందోళనకు కారణాలు
ప్రైవేట్ లేబులింగ్: ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేయడానికి జొమాటో, స్విగ్గీలు బ్లింకిట్ బిస్ట్రో(Blinkit Bistro), స్విగ్గీ స్నాక్(Swiggy Snacc) వంటి ప్రత్యేక యాప్‌లను ప్రారంభించాయి. దీనివల్ల మార్కెట్‌పై గుత్తాధిపత్యాన్ని చలాయించాలని భావిస్తున్నాయి. ఇది న్యాయబద్ధమైన పోటీకి వ్యతిరేకం అని విమర్శలున్నాయి.
డేటా మానిటైజేషన్: సంబంధిత వినియోగదారుల డేటాను రెస్టారెంట్లతో పంచుకోకుండా పోటీ ఉత్పత్తులను సృష్టించడానికి జొమాటో(Zomato), స్విగ్గీ పకడ్బందీ విధానలు అనుసరిస్తున్నాయి. రెస్టారెంట్ డేటాను మాత్రం తమకు అనుకూలంగా వినియోగిస్తున్నాయని ఎన్ఆర్ఏఐ పేర్కొంది.
ఎన్ఆర్ఏఐ స్పందన..
రెస్టారెంట్ పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించడానికి అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను అనుసరించడానికి కట్టుబడి ఉన్నామని ఎన్ఆర్ఏఐ పేర్కొంది. జొమాటో, స్విగ్గీలు మార్కెట్‌పై గుత్తాధిపత్యం సాధించకుండా నిరోధించడానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివి చేస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: స్పెక్ట్రమ్‌ను సమానంగా కేటాయించాలని డిమాండ్
జొమాటో బ్లింకిట్ బిస్ట్రో
జొమాటో, స్విగ్గీ తమ వినియోగదారులకు భోజనంతోపాటు ఇతర ప్రత్యేక సేవలందించేందుకు కొన్ని యాప్‌లను ఇటీవల ప్రారంభించాయి. జొమాటో బ్లింకిట్ బిస్ట్రో పేరుతో జనవరి 10, 2025 కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. భోజనం, స్నాక్స్, పానీయాలను 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో డెలివరీ చేస్తామని తెలిపింది. ప్రిజర్వేటివ్స్, ఫుడ్ ప్రాసెసర్లు, మైక్రోవేవ్ ప్రాసెసింగ్ లేకుండా ఆహారాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చింది.
స్విగ్గీ స్నాక్
స్విగ్గీ స్నాక్ యాప్‌ను జనవరి 7, 2025న లాంచ్ చేశారు. స్నాక్స్, పానీయాలు, భోజనాలను 10-15 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు. తొలుత బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించి క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment