బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (BIF) ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశంలోని టెక్ సంస్థలు(Tech firms) 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను సమానంగా కేటాయించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్పెక్ట్రమ్(Spectrum) 5జీ సేవలు, వై-ఫై రెండింటికీ ఈ బ్యాండ్ కీలకం కావడంతో దీని కేటాయింపుపై చర్చ తీవ్రమైంది.
టెలికాం ఆపరేటర్లకు ప్రత్యేకంగా 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్ (6425-7125 మెగాహెర్ట్జ్)లో ఎగువ భాగాన్ని కేటాయించేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై మెటా, అమెజాన్, గూగుల్‌తో సహా ఇతర టెక్ కంపెనీల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ విధానం వల్ల తమ వినియోగదారులకు పేలవమైన కనెక్టివిటీ ఉంటుందని ఆయా సంస్థలు వాదిస్తున్నాయి.
టెక్ సంస్థల వాదనలు
ఇండోర్ కనెక్టివిటీ: ప్రస్తుతం 80% కంటే ఎక్కువ డేటా వినియోగం ఇండోర్(ఇంటి లోపల)లో ఉండే కస్టమర్ల ద్వారానే జరుగుతుంది. టెలికాం ఆపరేటర్లకు ఎక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల అధిక ఫ్రీక్వెన్సీ కారణంగా తమ సేవలు సమర్థంగా ఉండవని టెక్ కంపెనీలు చెబుతున్నాయి.
ప్రపంచ దేశాల మాదిరగానే..: వై-ఫై, ఇన్నోవేషన్ కోసం అమెరికా సహా 84 దేశాలు 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 500 మెగాహెర్ట్జ్ లైసెన్స్ పొందాయి. వై-ఫై, మెరుగైన కనెక్టివిటీని అందించడానికి ఇండియాలోనూ ప్రపంచ దేశాల మాదిరిగానే వ్యవహరించాలని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి.
నేషనల్ డిజిటల్ ఎకానమీ: కేవలం టెలికాం ఆపరేటర్లకే అధిక బ్యాండ్(Band) కేటాయించడం సరికాదని అంటున్నాయి. విశ్వసనీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే జాతీయ లక్ష్యానికి ఇది విరుద్ధమని టెక్ సంస్థలు భావిస్తున్నాయి.
టెలికాం ఆపరేటర్ల వాదనలు
స్పెక్ట్రమ్ కొరత: అంతరాయం లేని 5జీ సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ కొరత ఉంది. దాన్ని పరిష్కరించడానికి 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అవసరమని టెలికాం ఆపరేటర్లు అంటున్నారు.
మౌలిక సదుపాయాలకు ఖర్చులు: వై-ఫై కోసం తక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల మౌలిక సదుపాయాల ఖర్చులు పెరుగుతాయి. సర్వీస్ క్వాలిటీ నిలిపేందుకు తక్కువ దూరాల్లో ఎక్కువ టవర్లు అవసరమవుతాయి.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ అంచనాలకు డేటా ఆధారిత విధానం
ప్రభుత్వ వైఖరి..
టెలికాం శాఖ తన నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ కార్యదర్శుల కమిటీ వివరాల ప్రకారం బ్యాండ్‌లో ఎక్కువ విభాగాన్ని 5జీ, 6జీ వంటి అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (IMT) సేవల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విభాగంలో మరింత సమర్థంగా సేవలందేలా ఉపగ్రహ కార్యకలాపాలను అధిక కెయు-బ్యాండ్ (12 గిగాహెర్ట్జ్)కు మార్చాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment