ద్రవ్యోల్బణం, వృద్ధిని అంచనా వేసే సాధనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమగ్ర సమీక్షను ప్రారంభించారు. గత నెలలో బాధ్యతలు స్వీకరించిన మల్హోత్రా కొత్త డేటా పాయింట్లు, విశ్లేషణలు, అంచనా ప్రక్రియలను చేర్చడం ద్వారా ఆర్‌బీఐ నివేదికలను మరింత స్పష్టతతో ముందుంచాలని నిర్దేశించారు. సమీక్షలో భాగంగా మల్హోత్రా(Sanjay Malhotra) అనుసరిస్తున్న కొన్ని విధానాల గురించి తెలుసుకుందాం.
డేటాసెట్లను చేర్చడం..
ఆర్‌బీఐ నివేదికలను మరింత లోతుగా అంచనా వేయడానికి ఉపయోగించే డేటాసెట్లను విస్తరించడంపై మల్హోత్రా దృష్టి సారించారు. ఇందులో స్మాల్ టికెట్ డిజిటల్ చెల్లింపులు, ఫుడ్ డెలివరీ యాప్‌ల డేటా, ఆన్‌లైన్ ట్యాక్సీ అగ్రిగేటర్ల నుంచి డేటా సేకరించడం వంటి అంశాలున్నాయి. ఈ కొత్త డేటా పాయింట్లు ఆదాయం, వ్యయ ధోరణుల స్పష్టమైన వైఖరిని తెలియజేస్తాయని నమ్ముతున్నారు.
మెషిన్ లెర్నింగ్ టూల్స్
ద్రవ్యోల్బణ అంచనాలను మెరుగుపరచడానికి, ఆహారం వంటి అస్థిర వస్తువులలో ధరల హెచ్చుతగ్గులను ముందుగానే అంచనా వేయడానికి ఆర్‌బీఐ మెషిన్ లెర్నింగ్ సాధనాలను ఉపయోగిస్తుంది. ఈ విధానం ద్రవ్యోల్బణ(inflation) అంచనాలను మరింత ఖచ్చితత్వంతో తెలియజేస్తుంది.
మరింత సమాచార సేకరణ
భారతదేశ అనధికారిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరింత సమగ్ర డేటాను సేకరించడానికి ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. అసంఘటిత రంగాల నుంచి సమకూరే ఆదాయంపై ఖచ్చితమైన డేటా పాయింట్లు లేవు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అందుకోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అధికారిక డేటా వనరుల నుంచి సంగ్రహించబడని ఆర్థిక కార్యకలాపాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు జరగాలి.
ఇదీ చదవండి: కొన్నేళ్లలోనే రూ.8.6 లక్షల కోట్లకు చేరే ఎగుమతులు
సవాళ్లు.. అంచనాలు
ప్రస్తుత అంచనా లోపాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు దేశ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనా(growth forecasting)లపై ఆర్‌బీఐ అంచనాలు విడుదల చేసింది. ఉదాహరణకు, ఆర్‌బీఐ దేశ ఆర్థిక వృద్ధి అంచనాను 2024-25 సంవత్సరానికి 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించాల్సి వచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను మాత్రం 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది. రెండు డేటా పాయింట్లు విభిన్నంగా ఉండడం కొంత చర్చకు దారి తీసింది.
కొత్త మార్పుల ప్రభావం: కొత్తగా తీసుకురాబోయే మార్పులు, డేటాసెట్ల చేర్పులు ఆర్థిక వృద్ధికి సంబంధించి ఖచ్చితమైన అంచనాలకు హామీ ఇవ్వనప్పటికీ, గతంలో కంటే మెరుగైన ఫలితాలు తెలుసుకునేందుకు దోహదం చేస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ మార్పుల ప్రభావం ఫిబ్రవరి పాలసీ అంచనాల్లో కనిపిస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment