![India set target to boost its food, beverage, and marine product exports](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/11/food%20exports01.jpg.webp?itok=ZcxFs5KE)
ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తులకు డిమాండ్
వచ్చే నాలుగైదేళ్లలో ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.6 లక్షల కోట్లు)కు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఇండస్‌ఫుడ్ 2025 ఎగ్జిబిషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘భారతీయ ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉంది. ఉత్పత్తిలో నాణ్యత, పౌష్టికాహారం, సుస్థిరతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఉత్పత్తుల నాణ్యతను పెంచడానికి, దేశవ్యాప్తంగా టెస్టింగ్ ప్రయోగశాలలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నాలుగైదేళ్లలో ఈ విభాగాల నుంచి ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.6 లక్షల కోట్లు)కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఆహారం, పానీయాల రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతించింది. ఈ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు, యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తోంది’ అన్నారు.
ఇదీ చదవండి: రూపాయి ఢమాల్.. నేల చూపులకు కారణాలు
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇన్నోవేషన్, మెరుగైన ప్యాకేజింగ్, యాంత్రీకరణలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని సాధించడం భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగంలో ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment