అమెరికా డాలర్(Dollar)తో పోలిస్తే భారత రూపాయి తాజాగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. శుక్రవారం సెషన్‌లో సుమారు రూ.86.04కు దిగజారింది. రూపాయి విలువ ఇంత భారీగా పడిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఇలా రూపాయి పడిపోవడానికి గల కారణాల్లో కొన్నింటిని కింద తెలుసుకుందాం.
బలపడుతున్న డాలర్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాల కారణంగా అమెరికా డాలర్ బలపడుతోంది. ఈ నిర్ణయం వల్ల డాలర్‌కు డిమాండ్ అధికమవుతుంది. రూపాయి(Rupee)తో సహా ఇతర కరెన్సీలతో పోలిస్తే ఇది మరింత ఖరీదైనదిగా మారింది.
ఎఫ్‌పీఐల విక్రయాలు
రెండు-మూడు నెలల కొందట ఇండియన్ మార్కెట్ జీవితకాల గరిష్టాలను తాకింది. దాంతో దాదాపు అన్ని స్టాక్‌ల వాల్యుయేషన్ పెరిగింది. అప్పటికే ఇన్వెస్ట్ చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. దాంతోపాటు సురక్షితమైన అమెరికా ట్రెజరీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల(Equity Market) నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఇది గణనీయమైన మూలధన ప్రవాహానికి దారితీసింది. దాంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది.
పెరుగుతున్న ముడిచమురు ధరలు
భారతదేశం ముడి చమురు ప్రధాన దిగుమతిదారు. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు దిగుమతుల ఖర్చును పెంచాయి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రూపాయి విలువ మరింత తగ్గుతుంది.
వాణిజ్య లోటు
భారతదేశ వాణిజ్య లోటు పెరుగుతోంది. అంటే దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతులు పెరుగుతున్నాయి. ఈ అసమతుల్యత వల్ల దిగుమతులకు చెల్లించడానికి ఎక్కువ డాలర్లు అవసరం అవుతుంది.
దేశీయ ఆర్థిక కారకాలు
వృద్ధి మందగించడం, లిక్విడిటీ లోటు వంటి సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. ఫారెక్స్(Forex) మార్కెట్లో దూకుడుగా జోక్యం చేసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సామర్థ్యానికి ఇవి అడ్డంకిగా మారాయి.
ఆర్‌బీఐ జోక్యం
ఫారెక్స్ మార్కెట్లో అధిక అస్థిరతను అరికట్టడానికి, రూపాయికి మద్దతు ఇవ్వడానికి ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటోంది. అయితే రూపాయి స్థిరమైన పడిపోతున్న తరుణంలో ఆర్‌బీఐ మరింత చాకచక్యంగా వ్యహహరించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపు ఎలాగంటే..
రూపాయి బలహీనతతో కలిగే ప్రభావాలు
అధిక దిగుమతి ఖర్చులు: దిగుమతులకు పెరిగిన ఖర్చులు, ముఖ్యంగా ముడి చమురు దేశీయ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి.
కార్పొరేట్ మార్జిన్లు: డాలర్ డినామినేషన్ అప్పులు చెల్లించే కంపెనీలపై భారం పడుతుంది. ఇది లాభాల మార్జిన్లను తగ్గిస్తుంది.
ఇన్వెస్టర్ల సెంటిమెంట్: నిరంతర కరెన్సీ బలహీనత విదేశీ ఇన్వెస్టర్లను పెట్టుబడులు పెట్టకుండా నిరోధిస్తుంది. మూలధనం రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.
ఆర్థిక ఒత్తిడి: దిగుమతులకు పెరుగుతున్న ఖర్చులు, విదేశీ రుణ సేవలు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment