beverage
-
ఐపీఎల్ స్పాన్సర్షిప్ డీల్ దక్కించుకున్న రిలయన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 పానీయాల విభాగంలో స్పాన్సర్షిప్ డీల్‌ను ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) దక్కించుకుంది. అందుకోసం రిలయన్స్ దాదాపు రూ.200 కోట్లు వెచ్చించింది. గతేడాది ఈ స్పాన్సర్షిప్ హక్కులను కోకాకోలా సొంతం చేసుకుంది. పానీయాల విభాగంలో ఈ డీల్‌ను దక్కించుకోవడంతో రిలయన్స్‌కు చెందిన కంపాకోలా విక్రయాలు పెరిగి, దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని కంపెనీ భావిస్తుంది.వేసవిలో సేల్స్ పెంచుకోవాలని సాఫ్ట్‌డ్రింక్స్ కంపెనీలు ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాయి. సరిగ్గా ఐపీఎల్ అదే సమయంలో ప్రారంభం కానుండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని మరింత ముందుకుసాగాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే రిలయన్స్ ఈ స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కంపా కోలాతో పాటు ఆర్సీపీఎల్ తన స్పోర్ట్స్ డ్రింక్ స్పిన్నర్, రాస్కిక్ గ్లూకో ఎనర్జీని టీ20 లీగ్ సందర్భంగా ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ వడ్డీరేటుపై త్వరలో నిర్ణయంశ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి రూపొందించిన ‘స్పిన్నర్’ ప్రమోషన్స్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అనే ఐదు ఐపీఎల్ జట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. రూ.10 ధర కలిగిన రాస్కిక్ గ్లూకో ఎనర్జీ కూడా ఈ టోర్నమెంట్‌లోనే అరంగేట్రం చేస్తోంది. ఐపీఎల్ 2025 కోసం టెలివిజన్, ఓటిటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి మొత్తం ప్రకటనల ఆదాయం గత సంవత్సరం కంటే 8-10% పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది సుమారు రూ.4,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. -
కొన్నేళ్లలోనే రూ.8.6 లక్షల కోట్లకు చేరే ఎగుమతులు
వచ్చే నాలుగైదేళ్లలో ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.6 లక్షల కోట్లు)కు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఇండస్‌ఫుడ్ 2025 ఎగ్జిబిషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘భారతీయ ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉంది. ఉత్పత్తిలో నాణ్యత, పౌష్టికాహారం, సుస్థిరతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఉత్పత్తుల నాణ్యతను పెంచడానికి, దేశవ్యాప్తంగా టెస్టింగ్ ప్రయోగశాలలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నాలుగైదేళ్లలో ఈ విభాగాల నుంచి ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.6 లక్షల కోట్లు)కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఆహారం, పానీయాల రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతించింది. ఈ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు, యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: రూపాయి ఢమాల్.. నేల చూపులకు కారణాలుఅంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇన్నోవేషన్, మెరుగైన ప్యాకేజింగ్, యాంత్రీకరణలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని సాధించడం భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగంలో ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!
క్విక్ కామర్స్ ప్రముఖ ఎఫ్ఎంసీజీలకు కిక్కెక్కిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల మొత్తం ఆన్లైన్ అమ్మకాల్లో క్విక్‌కామర్స్ విక్రయాలు రెండు రెట్లు పెరిగినట్టు డెలాయిట్, ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది. పట్టణ వినియోగదారులకు క్విక్‌కామర్స్ ప్రాధాన్య ఛానల్‌గా మారుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ఎఫ్ఎంసీజీ ఆన్లైన్ విక్రయాల్లో క్విక్ కామర్స్ విభాగం వాటా 35 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..18 శాతానికి పైగా వినియోగదారులు ఆహారం, పానీయాలను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. 2021 నుంచి 2023 నాటికి క్విక్ కామర్స్ మార్కెట్ 230% పెరిగింది. మరుసటి రోజు డెలివరీ చేసే సంప్రదాయ ఆన్లైన్ గ్రోసరీ సంస్థల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ సంస్థలు కొల్లగొడుతున్నాయి. రానున్న రోజుల్లో క్విక్ కామర్స్ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ–కామర్స్‌ను ప్రధాన ఛానల్‌గా మారుస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల వాటా 17 శాతానికి చేరింది. సంపన్న వినియోగదారులు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. గొప్ప సౌకర్యం, విస్తృత ఉత్పత్తుల శ్రేణి, పోటీతో కూడిన ధరలు ఆకర్షిస్తున్నాయిఇదీ చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరంఫుడ్, బెవరేజెస్..ఫుడ్, బెవరేజెస్ కోసం సంప్రదాయ ఈ–కామర్స్ ఛానళ్ల కంటే క్విక్ కామర్స్ సంస్థల్లో ఆర్డర్ చేసేందుకే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి తక్షణ అవసరాల కోసం ఉద్దేశించినవిగా డెలాయిట్, ఫిక్కీ నివేదిక పేర్కొంది. అదే సౌందర్య, గృహ ఉత్పత్తులు తక్షణ అవసరమైనవి కావకపోవడంతో, వీటిని ఈ–కామర్స్ వేదికలపై ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు వెల్లడించింది. చిన్న కుటుంబాలు, భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు కావడం క్విక్ కామర్స్‌కు డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. -
వరుణ్ బెవరేజెస్ చేతికి బెవ్కో
న్యూఢిల్లీ: పానీయాల దిగ్గజం పెప్సీకో ఫ్రాంచైజీ సంస్థ వరుణ్ బెవరేజెస్.. దక్షిణాఫ్రికా కంపెనీ బెవరేజ్ కంపెనీ(బెవ్కో)తోపాటు అనుబంధ సంస్థలను కొనుగోలు చేయనుంది. దక్షిణాఫ్రికా, లెసోఠో, ఎస్వటీని ప్రాంతాలలో పెప్సీకో ఫ్రాంచైజీ హక్కులను బెవ్కో కలిగి ఉంది. 3 బిలియన్ రాండ్ల(జెడ్ఏఆర్) (రూ. 1,320 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వరుణ్ బెవరేజెస్ వెల్లడించింది. తద్వారా దక్షిణాఫ్రికా మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించనుంది. నమీబియా, బోట్స్వానా పంపిణీ హక్కులతోపాటు.. అత్యంత కెఫైన్ కంటెంట్ డ్రింక్ రీఫ్రెష్, ఎనర్జీ డ్రింక్ రీబూస్ట్, కార్బొనేటెడ్ డ్రింక్ కూఈ, జైవ్, ఫిజ్జీ లెమనేడ్ బ్రాండ్లను బెవ్కో కలిగి ఉంది. 2024 జులై31లోగా నగదు ద్వారా లావాదేవీని పూర్తి చేసే వీలున్నట్లు వరుణ్ అంచనా వేస్తోంది. 5 తయారీ కేంద్రాలు 2023లో బెవ్కో రూ. 1,590 కోట్ల టర్నోవర్ సాధించినట్లు వరుణ్ తెలియజేసింది. జోహన్నెస్‌బర్గ్‌లో రెండు, దర్బన్, ఈస్ట్ లండన్, కేప్‌టౌన్‌లో ఒకటి చొప్పున మొత్తం ఐదు తయారీ యూనిట్లను కలిగి ఉంది. నిమిషానికి 3,600 బాటిళ్ల(బీపీఎం) సామర్థ్యం సంస్థ సొంతం. బెవ్కో కొనుగోలు ద్వారా దక్షిణాఫ్రికా మార్కెట్లో విస్తరించనున్నట్లు వరుణ్ వెల్లడించింది. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా అతిపెద్ద పానీయాల మార్కెట్‌కాగా.. రానున్న నాలుగేళ్లలో అంటే 2027కల్లా వార్షిక సగటున 5.3 శాతం చొప్పున వృద్ధి చూపగలదని అంచనా. దేశీయంగా పెప్సీకో అమ్మకాల పరిమాణంలో వరుణ్ బెవరేజెస్ 90 శాతాన్ని ఆక్రమిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది(2022–23) రూ. 10,596 కోట్ల ఆదాయం సాధించింది. బెవ్కో కొనుగోలు వార్తలతో వరుణ్ బెవరేజెస్ షేరు ఎన్ఎస్ఈలో 3.7 శాతం జంప్‌చేసి రూ. 1,174 వద్ద ముగిసింది. -
సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన థియేటర్స్..!
-
రెండేళ్లలో బిలియన్ డాలర్ బ్రాండ్‌గా మాజా
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని మాజా సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్‌ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్‌కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. -
మేడిన్ ఇండియా ఆహారం, పానీయాలకు ప్రోత్సాహం
న్యూఢిల్లీ: దేశీయంగా ఆహారం, పానీయాల పరిశ్రమ (ఫుడ్ అండ్ బెవరేజ్) మరింత బలం పుంజుకునేందుకు, మేడిన్ ఇండియా ఉత్పత్తులకు 2022–23 బడ్జెట్లో ప్రోత్సాహకాలు కల్పించాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. భారత్ తయారీ ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్, అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) ల్యాబ్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని బడ్జెట్‌కు సంబంధించి సూచనలు చేసింది. అలాగే, ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) యూనిట్లు దిగుమతి చేసుకునే ముడి సరుకులపై సుంకాలు ఉండకూడదని కోరింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయం కల్పించాలని, ఆహార రంగంలో టెస్టింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ పరిశ్రమకు మెషినరీ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే సంస్థలకు నిధుల లభ్యత, ఎంఎస్ఎంఈ రంగానికి వడ్డీ రాయితీ పథకం ప్రకటించాలని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టీపీసీఐ) సూచించింది. ‘‘ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, ఆహార పరిశ్రమలకు పెద్ద పాత్ర ఉంది. ఈ రంగం మరింత పుంజుకునేందుకు ప్రోత్సాహం అవసరం. క్లిష్ట సమయాల్లోనూ ఈ రంగం బలంగా నిలబడింది’’ అని టీపీసీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీకే గౌబ పేర్కొన్నారు. అగ్రి, ఆహార ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్ డాలర్ల విలువకు చేరుకుంటాయని అంచనా వేశారు. ఆటోపై మోస్తరు పన్నులు..: వోల్వో ఆటోమొబైల్ రంగంపై పన్నుల భారం తగ్గించి, మోస్తరు పన్నుల విధానాన్ని అమలు చేయాలని వోల్వో గ్రూపు ఇండియా కోరింది. కేంద్ర బడ్జెట్లో దీనిపై దృష్టి సారించాలని సూచించింది. బడ్జెట్‌కు ముందు ఆటోమొబైల్ రంగం కోరుకుంటున్న అంశాల గురించి వోల్వో గ్రూపు ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, ఎండీ కమల్ బాలి తెలిపారు. విడిభాగాలకు సంబంధించి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌పై స్థిర విధానం అవసరమని చెప్పారు. మౌలిక రంగం ఆధారిత మూలధన నిధుల వ్యయాలు, క్లీన్, గ్రీన్, కనెక్టెడ్ లాజిస్టిక్స్‌పై బడ్జెట్లో దృష్టి పెడతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఉత్పత్తి ఆధారిత పథకం (పీఎల్ఐ) కింద ప్రోత్సాహకాలకుతోడు స్క్రాపేజీ విధానం (పాత వాహనాలను తుక్కువగా మార్చడం) ఆటో రంగం రూపురేఖలను మార్చేసే సంస్కరణలుగా పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధికి ఇవి తోడ్పడతాయన్నారు. ‘‘ఆటో విడిభాగాలపై గరిష్ట రేటు 28 శాతం జీఎస్టీలో అమలవుతోంది. దీంతో రానున్న బడ్జెట్లో అన్ని రకాల ఆటో విడిభాగాలపై 18 శాతం ఒకటే రేటు అమలు చేయాలని పరిశ్రమ కోరుతోంది. అలాగే, విడిభాగాలపై ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ పడకుండా చూడాలని ఆశిస్తోంది’’ అని కమల్‌బాలి వివరించారు. ‘ఈవీ’ రుణాలకు ప్రాధాన్యరంగం హోదా ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలు) కూడా ప్రాధాన్య రంగం రుణాల విభాగం కింద చేర్చాలని ఈవీ సంస్థ ఒమెగాసైకి మొబిలిటీ కోరింది. అలా చేస్తే ఈ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొంది. వినియోగదారులకు మరింత అందుబాటు ధరలకు వస్తాయని సూచించింది. ముడి సరుకులపై జీఎస్టీ రేటు తగ్గింపు నిర్ణయానికి బడ్జెట్లో చోటు ఉంటుందని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. -
ఆయుర్వేదం... అద్భుత విషయాలు!
వైద్యుడిగా పరిణతి సాధించాలని అనుకునేవాడు ఏదో ఒక విభాగానికి మాత్రమే పరిమితం కాకూడదు. అప్పుడతడు పాక్షిక వైద్యుడవుతాడు. పాక్షిక వైద్యుడు చికిత్స చేయడానికి పనికిరాడు. అందుకే నిష్పాక్షికంగా అతడు అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం సాధించి పరిపూర్ణజ్ఞానాన్ని పొందాలంటుంది ఆయుర్వేదం. ఇదీ నాడీ ప్రవీణ, డెరైక్టర్ ఆఫ్ మహర్షి ఆయుర్వేద, డాక్టర్ జె.ఆర్. రాజు ఉద్బోధించే విషయాలు. ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లడం కంటే... ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ కోసం వారు సూచించే పరీక్షలే రోగిని ఎక్కువగా భయపెడుతుంటాయి. కానీ వైద్యాచార్య డాక్టర్ రాజు ఇలాంటి రక్తపరీక్షలూ, మూత్రపరీక్షలూ, ఈసీజీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలను చేయించరు. కేవలం నాడిని చూడటం ద్వారానే వ్యాధినిర్ధారణ చేస్తారు. తద్వారా రోగుల ఖర్చులు ఆదా అవుతాయి. ఇక ఆయన ఎన్నెన్నో దేశాల్లో అల్లోపతి వైద్యులకూ ఆయుర్వేదం గొప్పదనాన్ని వివరించి, ఆ విధానంలో నయంకాని (క్యూర్ లేదనే) వ్యాధులకు ఆయుర్వేద విధానంలో నయం చేసే విధానాలను బోధిస్తుంటారు. ఆయుర్వేదాన్ని ఆచరిస్తూ వస్తున్న ఆయన మన రోజువారీ దినచర్యల్లో అత్యంత సులభంగానూ, సూక్ష్మంగానూ, పైసా ఖర్చులేకుండా ఆరోగ్యాన్ని పొందే అనేక విషయాలను విపులంగా వివరిస్తున్నారు. దైనందిన జీవనశైలిలోనే ఆయుర్వేదం... ఆయుర్వేద జ్ఞానం చాలా విస్తృతం. దానిని ఔపోసన పట్టడం కంటే అభ్యాసం చేయడం మేలని ఎంచారు మన పూర్వికులు. అందుకే ఆయుర్వేదాన్ని మన నిత్యజీవన శైలిగా మార్చారు. స్నానం, పానం, ఆహారం, విహారం... ఇలా ప్రతి అంశంలోనూ మనకు తెలియకుండానే మనం ఆయుర్వేదాన్ని ఆచరిస్తుంటాం. ఇంగ్లిష్ మందులు, ఇతర ఔషధాలకు కొన్ని దుష్ర్పభావాలు ఉంటాయి. వాటినే సైడ్ ఎఫెక్ట్స్ అని అందరూ వ్యవహరిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉపయోగించే పదార్థాలన్నీ స్వాభావికాలు. ప్రకృతి సహజాలు. ఉదాహరణకు మన వంటగదిలో ఉపయోగించే వాము, జీలకర్ర, దాల్చినచెక్క వంటివన్నీ ఆయుర్వేదంలో ఔషధాలే. అలాక్కాకుండా వంటింటి దినుసులుగా ఉపయోగిస్తే అప్పుడవి రోజువారీగా ఉపయోగించే పదార్థాలే. అందుకే ఆయుర్వేదం వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ సైడ్ బెనిఫిట్సే. కాబట్టే ఆయుర్వేదం మన నిత్యజీవితంలో భాగం అయ్యేలా చూశారు మన పూర్వికులు, ఆచార్యులు. అందుకే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పైసా ఖర్చులేకుండా పొందగలిగే ఆరోగ్యాన్ని స్నానం నుంచి ప్రారంభిద్దాం. రోజులో తొలి కార్యక్రమం...వ్యాయామం వ్యాయామం అతిగా చేయకూడదు. నుదుట చెమట రావడం మొదలు కాగానే లేదా అధికశ్రమతో శ్వాస తీసుకోవడం మొదలుకాగానే వ్యాయామాన్ని ఆపేయాలి. ఇలా చేయడాన్నే శరీర అర్ధబలమంటారు. బాగా శరీర పరిశ్రమ (కఠిన వ్యాయామం) లేదా రన్నింగ్ లేదా వాకింగ్ చేసి వచ్చాక... వెంటనే నీరు తాగకూడదు. శరీరం, శ్వాస నెమ్మదించాక మాత్రమే నీరు తాగాలి. వ్యాయామ, విహారాలకు అనువైనది ప్రాతఃకాలమే. ఆహారం తీసుకున్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాయామం చేయకూడదు. స్నానం...ప్రాధాన్యం..! స్నానానంతరం మనకు కలిగే ఆహ్లాదం అంతా ఇంతా కాదు. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే చేయదు. అనేక సమస్యలనుంచి సాంత్వన కలిగిస్తుందీ స్నానం. అయితే స్నానం ఆరోగ్యకరం కావాలంటే కొన్ని సూచనలు గుర్తుపెట్టుకోండి. అవి... తలపై మరీ ఎక్కువ వేన్నీళ్లతో స్నానం వద్దు. స్టీమ్ బాత్, సౌనా బాత్ వంటివి ఆరోగ్యకరం కాదు. స్టీమ్‌బాత్, సౌనాబాత్‌లో తలకు ఆవిరి పెడతారు. అది చాలా ప్రమాదకరం. ఏదైనా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. స్నానం తర్వాతే ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. రెండు, మూడు గంటల తర్వాతే స్నానం చేయండి. బలహీనంగా ఉన్నవాళ్లు, వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో స్నానంగాని వద్దు. చన్నీళ్ల స్నానం ఆరోగ్యకరమనే అపోహ వద్దు. గోరువెచ్చని నీళ్లే మంచివి. తప్పనిసరి పరిస్థితుల్లో చన్నీళ్లతో స్నానం చేస్తే... దానికి ముందర చన్నీళ్లు తాగవద్దు. చన్నీళ్ల స్నానంలో నీరు ఎంత చల్లటివైతే... స్నానం వ్యవధిని అంతగా తగ్గించడం మంచిది. గోరువెచ్చని నీళ్లతో స్నానం ముందర కాస్తంత వ్యాయామం మంచిది. ఏ నీళ్లతో (చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లు) అయినా స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకోండి. నీరూ... ఆరోగ్యప్రదాయనే! నీటిని మనం ఆహారంతో పాటు స్వీకరిస్తుంటాం. నీరూ ఒక ఓషధే. సరైన పాళ్లలో సరైన విధంగా తీసుకుంటే దాంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఉదాహరణకు... స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గించుకోడానికి ఆచరించదగిన నీటి చికిత్స (వాటర్ థెరపీ) ఏమిటంటే... ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో మూడో వంతు ఆవిరయ్యేలా చేసి, మిగతా నాల్గో వంతు భాగాన్ని చల్లార్చి తాగితే ఊబకాయం తగ్గుతుంది. అలాగే లావెక్కాలని భావించే అతిసన్నటి శరీరం ఉన్నవారు... ఒక పాత్రలో నీటిని తీసుకుని కేవలం నాలుగోవంతు మాత్రమే ఆవిరయ్యేలా చేసి, మిగతా నీటిని చల్లార్చి తాగితే క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా ఒకే నీరు... దాన్ని ఉపయోగించే అతి సాధారణ, అతి సులభ పద్ధతుల్లో రెండు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రతి అరగంటకొకసారి వేడి నీళ్లను టీ తాగినట్లుగా రోజూ సిప్ చేస్తూ తాగుతుంటే దీర్ఘకాలంలో చాలా వ్యాధులు నయమవుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి... కాచిన పాలనూ, కాచిన నీళ్లను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. అన్నపానాదులను సంస్కరించాకే ఉపయోగించాలి. ఇలాంటి సంస్కరణకు ప్రధానంగా ఉపయోగపడేది నీరే. నీళ్లు లేకుండా ఘన పదార్థాల సంస్కారం వీలు కాదు. చాలా రోగాలకు ముఖ్యకారణం కూడా నీరే. తమ ఆవాసంగా నీటిలో ఉండే జంతుజాలం ప్రసవించే సమయంలో వెలువడే విషపదార్థాలు నీళ్లలో కరిగి రోగకారకాలు కావచ్చు. అందుకే నీటి స్వచ్ఛపరిచాకే ఉపయోగించాలి. నీటిని స్వచ్ఛపరచడం అంటే... తొలుత మంచి పరిశుభ్రమైన నిర్మల వస్త్రంతో వడగట్టడం, ఆ తర్వాత నీటిని బాగా కాచి చల్లార్చి తాగడం. ఇలా నీటిని స్వచ్ఛపరిచాకే తాగాలి. భోజనానికి ముందు నీరు తాగితే అది మందాగ్ని రూపంలో శరీరాన్ని కృశింపజేస్తుంది. మధ్యమధ్యన నీరు తాగకుండా భోజనం తర్వాతే నీరు తాగితే అది శరీర స్థౌల్యం (ఊబకాయం) కలిగిస్తుంది. ఛాతీ, కంఠం, శిరస్సుల్లో కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే భోజనం మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే మధ్యమ స్థితి (అంటే కృశ - స్థౌల్య... ఈ రెంటినీ కలిగించేదిగా) సంభవిస్తుంది. ఇలా మధ్య మధ్యన నీరుతాగడం రస, రక్తాధి ధాతువులను సమస్థితిలో ఉంచుతుంది. ఇలా తాగిన నీరు సులభంగా, సుఖంగా జీర్ణమవుతుంది. చల్లని నీళ్లు జీర్ణం కవడానికి 45 నిమిషాలు, వేడి నీరు జీర్ణం కావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. దురలవాట్లనుదూరం చేసుకోండిలా... భోజనం గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. భోజనం ‘ఆత్మ’కు ఇంపుగా ఉండాలి. మంచి కవిత్వం రాయడం ఎప్పుడు సాధ్యమన్న విషయాన్ని అల్లసాని పెద్దన సరదాగా చెప్పినా ఆ మాటల్లోని వాస్తవం గమనించారా? ‘ఆత్మకింపైన భోజనం...’ తినాలంటారాయన. అలాగే అన్నం తిన్న తర్వాత కలిగే తృప్తిని వర్ణించడానికి చెప్పే మాట... ‘ఆత్మారాముడు శాంతించాడు’ అనే. అంటే ఇక్కడ తాను అనే అర్థంలో ఆత్మ అనే మాటను వాడినా... విస్తృతార్థంలోనూ ఆత్మకింపైన, ఆత్మకు మేలు చేకూర్చే భోజనమే తీసుకోవాలన్నది వాస్తవం. ఇందులో భాగంగా శరీరానికీ, నాలుకకూ రుచిగా ఉన్నప్పటికీ అది ఆరోగ్యానికి అంతగా మేలు చేసేది కానప్పుడు దాన్ని వర్జించాలి. ఇలా వర్జించే సమయంలోనూ దాన్ని అకస్మాత్తుగా వర్జించకూడదు. దురలవాటునూ, దుర్వ్యసనాన్ని దూరం చేసుకోనే సమయంలో దాని పరిమాణాన్ని రోజూ శోడశ పాద భాగాన్ని విడవాలి. అంటే ప్రతిరోజూ ఒకటిలో పదహారోవంతును తగ్గించుకుంటూ... ఇలా క్రమంగా మేలు చేయని ఆహారాన్ని వర్జించాలన్నమాట. భోజనం తర్వాత మొక్కజొన్న కండె, మొక్కజొన్న అటుకులు తినకూడదు. వండటానికి పనికొచ్చే కూరలను వండే తినండి... ఇటీవల చాలా మంది పచ్చి కూరలు తినడం వల్లనే ఆరోగ్యం ఇనుమడిస్తుందంటూ చెబుతుంటారు. ఇది కేవలం పాక్షిక సత్యం మాత్రమే. వండి తినడం (పచనం చేయడం) నాగరక పరిణామక్రమంలో వచ్చిన అభివృద్ధి. అందువల్ల దాన్ని అభివృద్ధి సూచకంగానే పరిగణించాలి. క్యారెట్, బీట్రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం తురుము, ధనియాలు, పుదీన లాంటి వాటిని పచ్చిగా తిన్నా పర్వాలేదు. ఎందుకంటే అవి అందుకు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి. కానీ సొర, బీర, కాకర వంటి కూరగాయలను వండి మాత్రమే తినండి. వండటానికి మాత్రమే వాటిని ఉపయుక్తంగా తయారు చేసింది ప్రకృతి. ఉదాహరణకు కూరగాయలుగా మనం వాడేవాటిలో కాకరనే తీసుకుందాం. దానికి చికిత్సాపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నది వాస్తవం. దాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది, డయాబెటిస్ లాంటి దీర్ఘవ్యాధులను తగ్గిస్తుందన్నది కూడా పరమ సత్యం. అయితే అలాగని దాన్ని పచ్చిగా తినడం చాలా హానికరం. అందులో ఔషధగుణాలతో పాటు కొన్ని ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అవి మోతాదుకు మించినప్పుడు శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి దాన్ని పచ్చిగా తినడమో లేదా అదేపనిగా రోజూ కాకర రసం తీసుకుని తాగడమో చేస్తే దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే కూరగాయలను, ఆకుకూరలను వండే తినండి. సలాడ్స్‌గా తీసుకోదగ్గ క్యారెట్, బీట్రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం వంటివాటికి మిగతా కూరలను జత చేయకండి. పొన్నగంటికూర కళ్లకు చాలా మంచిది. భోజనం తీసుకోండిలా... అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే దాన్ని గౌరవిస్తూ వీలైతే తూర్పునకు ముఖం చేసి తినండి. ఆహారాన్ని దూషిస్తూ, అశాంతితో తినకూడదు. భోజనంలో మొదట తీపి తీసుకోండి. ఆ తర్వాత భోజనంలో హెవీఫుడ్‌గా మీరు భావించేదాన్ని తినాలి. అలా క్రమంగా భోజనం సాగుతున్న కొద్దీ హెవీ నుంచి లైట్‌కు వస్తూ ఉండాలి. మొదట హెవీ అనే క్రమంలో నెయ్యిని తీసుకోండి. ఎందుకంటే నేతికి రెండు రకాల గుణాలుంటాయి. అది అగ్నిని ప్రజ్వలిస్తుంది. (అగ్నికి ఆజ్యం తోడైనట్లు అనేది అందుకే). అంటే మొదట అగ్నిగుణాన్ని కలిగించడం వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. అగ్నిగుణం కలిగిన ఆ నెయ్యే... కారాలతో నాలుక భగభగలాడేప్పుడూ... ఆహారంలో కారం మంట అధికంగా ఉన్నప్పుడూ దాన్ని శాంతింపజేయడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నంలో నేతికి తొలి వరస. ఈ క్రమంలో అన్నింటికన్నా తేలికైన మజ్జిగది తుది వరస. అన్నం తినేప్పుడు కొందరు మంచినీళ్లు అస్సలు తాగరు. కానీ మధ్యలో నీళ్లు తాగడమే మంచిది. లేకపోతే మనం తీసుకునే అన్నంలోని ఘనపదార్థాలు మధ్యలో చిక్కుకుపోయి (స్తంభించి), జీర్ణక్రియకు అవరోధం కలిగిస్తాయి. అందుకే గొంతులో/ కడుపులో ఏదైనా అడ్డంపడ్డట్లు ఉన్నప్పుడు నీళ్లు తాగడమే మంచిది. అన్నాన్ని కళ్లతో చూడగానే నోట్లో నీళ్లూరతాయి. జ్ఞానేంద్రియాలలో కలిగే స్పందనల్లో ఇదొకటి. మంచి శ్రేష్ఠమైన ఆహారం రుచులను వినగానే వాటిని రుచిచూడాలనిపిస్తుంది. ఇది మరో జ్ఞానేంద్రియం చేసే పని. ఇక ఎలాగూ నాల్క రుచిచూస్తుంది. అలాగే అన్నాన్ని స్పర్శిస్తూ తినడం వల్ల కూడా కొన్ని స్పందనలు కలుగుతాయి. అందుకే అన్నాన్ని స్పూన్లూ, ఫోర్కులూ, నైఫ్‌ల వంటి ఉపకరణాలతో తినే బదులు చేతి ఐదువేళ్లతో స్పర్శిస్తూ తినండి. ఈ స్పర్శజ్ఞానమూ మెదడులో కొన్ని స్పందనలు కలిగించి అన్నం పట్ల హితవును కలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కలగడానికి మిగతా జ్ఞానేంద్రియాలతో పోలిస్తే కాస్త ఎక్కువ వ్యవధి పడుతుంది. భోజనం చివరన చల్ల (మజ్జిగ) వాడటం చాలా మంచిది. దీనికి కొద్దిగా శుంఠి, సైంధవ లవణం కలుపుకుని తింటే మరింత శ్రేష్ఠం. ఇక అన్నం తిన్న తర్వాత చేయి కడిగి... ఆ చేయి తుడుచుకున్న తర్వాత ఉండే కాస్తంత తడితో కళ్లుమూసుకుని, కన్రెప్పలను తుడుచుకుంటే కొన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇది కళ్లకు చాలా మంచిది. భోజనం చేయండిలా... భోజనం చేసే సమయంలో మీ కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోండి. అందులోని రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకూ, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవండి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని లేదా ఉసిరిక లేదా ముద్గయూషం (పెసరకట్టు) కలుపుకుని లేదా చిలికి తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం. పెరుగు తన గురుగుణం వల్ల శోఫ (వాపు)ను, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఫలాలు...ఫలితాలు కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. (అరటి శ్రేష్టమైన పండే అయినప్పటికీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది బరువైన పండు, బరువైన ఆహారాలు ముందే తినాలి కాబట్టి దీన్ని భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్నభోజనం అయ్యాక... చాలాసేపటి తర్వాత ఈవినింగ్ శ్నాక్స్ టైమ్‌లో (ఉజ్జాయింపుగా సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో) తినాలి. బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తీసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు. పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదు. ఆహారం భాగమైన పండ్ల విషయంలోనూ దేశ, కాలాత్మాది విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని ప్రాంతాల్లో పండేవి అక్కడి వారికి తేలిగ్గా జీర్ణమవుతాయి. అవి వారికి మంచిది. ఇక కొన్ని పండ్లూ, ఆహారాలు కొన్ని ప్రాంతాలవారికి పరాయివి. దేశకాలాలను బట్టి మనకు ఏది అనువైనదో వాటినే తీసుకోవాలి. రోజులో చివరి కార్యకలాపం నిద్ర గురించి... నియమానుసారంగా నిద్రపోవాలి. తద్వారా ఆరోగ్యం, పుష్టి, బలం కలుగుతాయి. అకాల నిద్ర లేదా అతినిద్ర లేదా బొత్తిగా నిద్రమానినా అది ఆయువును హరించివేస్తుంది. నిద్ర వేళలు / నిద్ర అలవాట్లు సరిగా లేకపోతే అది రోగాన్ని, కృశింపజేసే తత్వాన్ని, బలహీనతను, అజ్ఞానాన్ని, మరణాన్ని కలగజేస్తుంది. నిద్రలేమి అనేది రోగాన్ని కలగజేస్తుంది. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. సరైన నిద్ర లేకుండటం అన్నది దీర్ఘకాలంలో మనిషిని క్రమంగా కుంగదీస్తుంది. నిద్ర వేళలన్నవి వారి వారి సౌకర్యాన్ని బట్టి మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండకుండా చూసుకోవాలి. అతినిద్ర, నిద్రలేమి ఈ రెండూ ప్రమాదకరమే అని గ్రహించండి. అవీ ఇవీ... సత్తుపిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు. నువ్వుల నూనెకు సత్వరం వ్యాపించే గుణం ఉంది. అందుకే అభ్యంగం (మసాజ్)లో దీన్ని వాడటం వల్ల అనేక రోగాలు తగ్గడానికి దోహదం చేస్తుంది. బక్కచిక్కిన వాళ్లు దీనితో మసాజ్ చేసుకుంటే బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు. బియ్యం లాంటి ఆహారధాన్యాలు ఒక సంవత్సరం కిందటివి అంటే పాతవి శ్రేష్ఠం. కొత్తపంటలు ప్రమేహానికి (డయాబెటిస్)కు కారకాలు. ధాన్యాలు, ఘృతం (నెయ్యి), తేనె, బెల్లం, పిప్పలి ఇవి తప్ప... ఇతర ద్రవ్యాలు ఒక ఏడాదిపైబడినవే శ్రేష్ఠం. పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం. పుట్టగొడుగులు మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి. లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం, ముదురు వంకాయ రోగకారకం. ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం. బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి. పైన పేర్కొన్నవన్నీ ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి, రాత్రి నిద్రించే వరకు ఒక క్రమపద్ధతిలో చేయడానికి వీలుగా ఆయుర్వేదం ఈ అలవాట్లన్నింటినీ మనందరి దైనందిన జీవితంలో ప్రవేశపెట్టింది. కొందరు ఏమీ తెలియకుండానే వీటన్నింటినీ ఆచరిస్తుండవచ్చు. మరికొందరు తెలియక కొన్నింటిని ఆచరించక, రుగ్మతలకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయుర్వేద సదాచారాలను అర్థం చేసుకుని ఆరోగ్యంగా జీవించండి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి ‘తేనె’లొలికే ఆరోగ్య సూచనలు ఉదయం వేళ ఆరోగ్యదాయని అంటూ చాలామంది తేనెను స్వీకరిస్తుంటారు. వేన్నీళ్లలో కాస్తంత తేనెనూ, నిమ్మరసాన్ని వేసి తాగుతారు. ఇలా తీసుకోవడం చాలా ప్రమాదకరం. తేనెను ఆరోగ్యప్రదాయనిగా స్వీకరించదలచినవారు వేన్నీళ్లలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వేయకూడదు. చన్నీళ్లతోనే స్వీకరించాలి. మీ శరీరం ఎంత తేనెను స్వీకరించడానికి సిద్ధంగా ఉందో ఆ మోతాదునే ఎప్పుడూ కొనసాగించాలి. అంతేగానీ తేనె మధురంగా ఉంటుందని అతిగా తీసుకోవడం సరికాదు. తేనె, నెయ్యి... ఈ రెండింటినీ సమానపాళ్లలో కలిసి తీసుకోకూడదు. ఏదో ఒకదాని మోతాదు ఎక్కువో, తక్కువో ఉండాలి. ఆ రెండూ సమానంగా ఉంటే అది విషంతో సమానం. తేనె ‘యోగవాహి’. అంటే తేనెను దేనితోనైనా కలిపి తీసుకుంటే, అది చేరిన పదార్థం గుణాలను అధికం చేస్తుంది. కానీ తన స్వీయ గుణాల వల్ల ఉద్దేశిత కార్యానికి విరుద్ధంగా పనిచేయదు. ఉదాహరణకు కరక్కాయతో కలిసిన తేనె విరేచనాన్ని కలిగిస్తుంది. కానీ తన స్వభావమైన విరేచన కార్యాన్ని ఆపదు. పాల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే... చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితోగాని అరటిపండు తీసుకోవడం సరికాదు. అది స్లోపాయిజన్ వంటిది. చాలామంది భోజనం అనంతరం అరటిపండును తీసుకుంటారు. ఇది కూడా సరికాదు. అరటిపండును తినాలనుకునేవారు భోజనానికి ముందే తీసుకోవాలి. లేదా మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కడుపు కాస్త ఖాళీ అయ్యాక తీసుకోవడం మంచిది. రోజూ పాలు తాగేవారు దానితో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కాబట్టి టీ, కాఫీలు తాగేవారు కేవలం వాటిని కషాయంగా (పాలు కలపకుండా) తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఇక ముఖ్యంగా పాలతో ఉప్పు కలపడం ఆరోగ్యానికి అనర్థం. అందుకే పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం మంచిదికాదని గుర్తుంచుకోండి. కొందరు కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వేడిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి... ఇలా చేయడం దీర్ఘకాలంలో హానికరం. పాలు, పనసపండు కలిపి తినకూడదు. పాలు, చేపలు కలిపి తినకూడదు. చేపలు తిన్న తర్వాత మజ్జిగ గాని, పెరుగుగాని తింటే దీర్ఘకాలంలో ఆరోగ్యభంగం అయ్యే అవకాశం ఉంది. పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు. -
ఇక ఐటీసీ చాక్లెట్లు...
కోల్‌కతా: దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ.. కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. పండ్ల రసాలు, టీ, కాఫీ వంటి పానీయాల(బెవరేజెస్)తో పాటు చాక్లెట్లు, పాల ఉత్పత్తుల(డెయిరీ) రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ ప్రకటించారు. కొత్త విభాగాల్లోకి ప్రవేశించేందుకు ఇదే అదునైన సమయమని, భవిష్యత్ వ్యాపారాభివృద్ధికి ఈ నిర్ణయాలు దోహదం చేయనున్నాయని బుధవారం ఇక్కడ జరిగిన కంపెనీ 103వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారం నుంచే కంపెనీకి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. ఆ తర్వాత అగ్రి బిజినెస్ నిలుస్తోంది. ఇంకా హోటళ్లు, పేపర్ తదితర విభాగాల్లో బహుముఖ వ్యాపారాలను ఐటీసీ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్లను సృష్టిస్తాం... ‘1996లో కంపెనీ పొగాకు ఉత్పత్తుల నుంచి ఇతర రంగాల్లోకి విస్తరించడంపై వాటాదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. వాటన్నింటినీ పట్టించుకోకుండా కంపెనీ ముందుకెళ్లడం సంతోషించదగ్గ విషయం. కంపెనీ వృద్ధిని విస్తృతం చేయడంలో ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్)యే ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతేకాదు భారత్‌లో ఐటీసీకి సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగం కూడా ఇదే. అయితే, దీన్ని ఇంకా బలోపేతం చేసేందుకు భారత్ నుంచి అంతర్జాతీయ బ్రాండ్లను సృష్టించాలనేది కంపెనీ యోచన. బ్రాండ్ల నిర్మాణం సులువేమీ కాదు. మన బ్రాండ్లు ఇక్కడ పూర్తిస్తాయిలో ఆధిపత్యం చాటుకున్నాక.. ఇతర దేశాలకూ వీటిని విస్తరించడంపై దృష్టిపెడతాం’ అని వాటాదారులకు దేవేశ్వర్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ అమలు చేస్తున్న, ప్రణాళికల్లో ఉన్న ప్రాజెక్టులు 65కు పైగా ఉన్నాయని.. వీటిలో పెట్టుబడుల విలువ రూ.25,000 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ఎంసీజీ వ్యాపారాల నుంచి 2030 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నామని ఈ సందర్భంగా దేవేశ్వర్ చెప్పారు. -
సీమలో నకిలీ కిక్కు
కడప : రాయలసీమలో అక్రమ, నకిలీ మద్యం ఏరులై పారుతోంది. అధికారుల కళ్లుగప్పి కర్ణాటక నుంచి వేల కేసుల మద్యాన్ని ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు. అక్రమ రవాణాతో పాటు నకిలీ మద్యం ఇబ్బడిముబ్బడిగా వస్తోంది. స్వ్కాడ్ పేరుతో తనిఖీలు షరా ‘మామూలు’గా మారిపోయాయి. పట్టుకున్న వారితో బేరసారాలు సాగించి చాలా కేసులు వదిలిపెడుతూ... కొన్నింటిపై కేసులు కడుతూ మమ అనిపిస్తుట్లు తెలుస్తోంది. దీంతో సరికొత్త ‘నాటు’ మందు జిల్లాలో ఏరులై పారుతోంది. కడప, ప్రొద్దుటూరులలో ఈ అక్రమ మద్యం నిల్వలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేత కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతోందని సమాచారం. ఎన్నికల సమయంలో ప్రారంభమై... స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల సమయంలో పెరిగిన డిమాండ్‌తో అక్రమ వ్యాపారం కట్టలు తెంచుకుంది. ఇప్పుడూ అది అలాగే కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో పట్టణాలు, పల్లెలపై మద్యం మాఫియా కన్నేసింది. మద్యం అమ్మకాలపై ‘సీలింగ్’ అమల్లో ఉండటంతో బేవరేజ్ సంస్థ నుంచి అదనంగా మద్యం సేకరణకు దారులు మూసుకుపోయాయి. దీంతో వ్యాపారులు అక్రమ మద్యంపై కన్నేశారు. కర్ణాటక వైపు కొందరు దారిపట్టారు. అదికూడా సరిపోక స్వయం పాకానికి సిద్ధపడ్డారు. స్పిరిట్, రంగుపొడితో నకిలీ మద్యం తయారీకి తెగించారు. మరికొందరు నాటు సారాలో రంగుపొడి కలిపి లిక్కర్ పేరుతో అమ్మకాలు జరిపారు. కర్ణాటక నుంచి అక్రమ రవాణా కర్ణాటకకు చెందిన చీప్, మధ్యస్థ రకాలు రెండింటిని ఎంచుకుని మరీ డంప్ చేస్తున్నారు. వేల కేసులు తీసుకొచ్చి జిల్లాలో నిల్వలు ఉంచారు. వ్యాపారులకు అనువైన ప్రాంతాల్లో దాచి ఉంచి వారివారి దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. కడప, ప్రొద్దుటూరులో ఈ తరహా మద్యం విక్రయాలు అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నిల్వలున్న ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ ఎవరైనా తనిఖీలు జరిపితే అక్కడికక్కడే విషయాన్ని తేల్చేస్తున్నారు. అధికారులను సంతృప్తి పరిచి విషయాన్ని పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. దీంతో నామమాత్రపు దాడులతో అధికారులు సరిపెడుతున్నారు. ఇక్కడ దొరికేది ‘మధ్య’స్థమే సీమలో అధికంగా దొరుకుతోంది మధ్యస్థంగా ఉండే మద్యమేనని తెలుస్తోంది. బేవరేజెస్ నుంచి తెచ్చుకునేది మొదటిరకం. ఇది మన వైన్‌షాపుల్లో విక్రయిస్తారు. ఇతర రాష్ట్రాల్లో చవకగా వస్తుందని మన రాష్ట్రంలో పన్ను ఎగ్గొట్టి కొనుగోలు చేసి విక్రయించే సరుకును రెండో రకం (సెకండ్స్) అంటారు. అసలు ఎలాంటి ఎక్సైజ్ డ్యూటీ చెల్లించకుండా స్పిరిట్, అవసరమైన పదార్థాలతో సొంతంగా తయారుచేసి విక్రయించేది మూడోరకం (థర్డ్). ప్రస్తుతం జిల్లాకు చేరిన సరుకు వీటిలో ఏ రకానికీ చెందదని తెలుస్తోంది. రెండు, మూడు రకాలకు మధ్యస్థంగా ఉంటుందని ఓ ఎక్సైజ్ అధికారి చెప్పారు. కర్ణాటక నుంచి తెచ్చిన మద్యాన్ని బేసిన్లు, టబ్‌లలో పోసి... నీళ్లు, రంగు, స్పిరిట్ కలిపి ఆ మిశ్రమ మద్యాన్ని సీసాల్లో నింపడమే మధ్యస్థం అని చెబుతున్నారు. సీసాపై మూత తొడిగి పట్టకారుతో నొక్కితే సహజమూతలా అతుక్కుపోతుంది. గత ఎన్నికల్లో ఇలాంటి మద్యం జిల్లాలో ఏరులై పారించారు. ఆనాటి అనవాళ్లు ఇప్పటీకీ జిల్లాలో నెలకొని ఉన్నాయి. మద్యం డిమాండ్ అధికంగా ఉండటంతో వ్యాపారులు ఈ తరహా మద్యాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. కడప శివార్లలోని ఓ మద్యం దుకాణంలో సుమారు తొమ్మిది కేసులు ఇలాంటి మద్యమే పట్టుబడింది. అయితే అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మరుగున పర్చినట్లు సమాచారం. ప్రొద్దుటూరులో కూడా ఇలాంటి విక్రయాలున్నా ఎక్సైజ్ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. దేశం నేత కనుసన్నుల్లోనే సరఫరా కడప, చిత్తూరు జిల్లాల్లో ఇలాంటి తరహా అక్రమమద్యం ఏరులై పారుతున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన మునుపటి ‘సారా’వ్యాపారి, ప్రస్తుత తెలుగుదేశం నేత కనుసన్నుల్లోనే అక్రమ నిల్వల దిగుమతులు ఉన్నట్లు సమాచారం. తన ఉన్నతికి దోహదపడిన అక్రమ మద్యం వ్యాపారం మరోమారు ‘మూడు లారీలు.. ఆరు డంప్‌లు’గా విరాజిల్లుతోన్నట్లు సమాచారం. దేశం నాయకుడు తన స్వగ్రామానికి సమీపంలో పెన్నాన దీ తీరంలో సరికొత్త మద్యాన్ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా సరఫరాకు ఉపక్రమించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటి తయారీ కేంద్రాన్ని కుప్పం ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు అన్ని ప్రయత్నాలను ఆ నాయకుడు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.