ఇక ఐటీసీ చాక్లెట్లు...
కోల్‌కతా: దేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ.. కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. పండ్ల రసాలు, టీ, కాఫీ వంటి పానీయాల(బెవరేజెస్)తో పాటు చాక్లెట్లు, పాల ఉత్పత్తుల(డెయిరీ) రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ ప్రకటించారు. కొత్త విభాగాల్లోకి ప్రవేశించేందుకు ఇదే అదునైన సమయమని, భవిష్యత్ వ్యాపారాభివృద్ధికి ఈ నిర్ణయాలు దోహదం చేయనున్నాయని బుధవారం ఇక్కడ జరిగిన కంపెనీ 103వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారం నుంచే కంపెనీకి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. ఆ తర్వాత అగ్రి బిజినెస్ నిలుస్తోంది. ఇంకా హోటళ్లు, పేపర్ తదితర విభాగాల్లో బహుముఖ వ్యాపారాలను ఐటీసీ నిర్వహిస్తోంది.
అంతర్జాతీయ బ్రాండ్‌లను సృష్టిస్తాం...
‘1996లో కంపెనీ పొగాకు ఉత్పత్తుల నుంచి ఇతర రంగాల్లోకి విస్తరించడంపై వాటాదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. వాటన్నింటినీ పట్టించుకోకుండా కంపెనీ ముందుకెళ్లడం సంతోషించదగ్గ విషయం. కంపెనీ వృద్ధిని విస్తృతం చేయడంలో ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్)యే ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతేకాదు భారత్‌లో ఐటీసీకి సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగం కూడా ఇదే. అయితే, దీన్ని ఇంకా బలోపేతం చేసేందుకు భారత్ నుంచి అంతర్జాతీయ బ్రాండ్‌లను సృష్టించాలనేది కంపెనీ యోచన.
బ్రాండ్‌ల నిర్మాణం సులువేమీ కాదు. మన బ్రాండ్‌లు ఇక్కడ పూర్తిస్తాయిలో ఆధిపత్యం చాటుకున్నాక.. ఇతర దేశాలకూ వీటిని విస్తరించడంపై దృష్టిపెడతాం’ అని వాటాదారులకు దేవేశ్వర్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ అమలు చేస్తున్న, ప్రణాళికల్లో ఉన్న ప్రాజెక్టులు 65కు పైగా ఉన్నాయని.. వీటిలో పెట్టుబడుల విలువ రూ.25,000 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాల నుంచి 2030 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నామని ఈ సందర్భంగా దేవేశ్వర్ చెప్పారు.