క్విక్ కామర్స్ ప్రముఖ ఎఫ్‌ఎంసీజీలకు కిక్కెక్కిస్తోంది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీల మొత్తం ఆన్‌లైన్ అమ్మకాల్లో క్విక్‌కామర్స్ విక్రయాలు రెండు రెట్లు పెరిగినట్టు డెలాయిట్, ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది. పట్టణ వినియోగదారులకు క్విక్‌కామర్స్ ప్రాధాన్య ఛానల్‌గా మారుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ఎఫ్‌ఎంసీజీ ఆన్‌లైన్ విక్రయాల్లో క్విక్ కామర్స్ విభాగం వాటా 35 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది.
నివేదికలోని వివరాల ప్రకారం..18 శాతానికి పైగా వినియోగదారులు ఆహారం, పానీయాలను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. 2021 నుంచి 2023 నాటికి క్విక్ కామర్స్ మార్కెట్ 230% పెరిగింది. మరుసటి రోజు డెలివరీ చేసే సంప్రదాయ ఆన్‌లైన్ గ్రోసరీ సంస్థల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ సంస్థలు కొల్లగొడుతున్నాయి. రానున్న రోజుల్లో క్విక్ కామర్స్ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ–కామర్స్‌ను ప్రధాన ఛానల్‌గా మారుస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ఎఫ్‌ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల వాటా 17 శాతానికి చేరింది. సంపన్న వినియోగదారులు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. గొప్ప సౌకర్యం, విస్తృత ఉత్పత్తుల శ్రేణి, పోటీతో కూడిన ధరలు ఆకర్షిస్తున్నాయి
ఇదీ చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరం
ఫుడ్, బెవరేజెస్..
ఫుడ్, బెవరేజెస్ కోసం సంప్రదాయ ఈ–కామర్స్ ఛానళ్ల కంటే క్విక్ కామర్స్ సంస్థల్లో ఆర్డర్ చేసేందుకే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి తక్షణ అవసరాల కోసం ఉద్దేశించినవిగా డెలాయిట్, ఫిక్కీ నివేదిక పేర్కొంది. అదే సౌందర్య, గృహ ఉత్పత్తులు తక్షణ అవసరమైనవి కావకపోవడంతో, వీటిని ఈ–కామర్స్ వేదికలపై ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు వెల్లడించింది. చిన్న కుటుంబాలు, భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు కావడం క్విక్ కామర్స్‌కు డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment