న్యూఢిల్లీ: దేశీయంగా ఆహారం, పానీయాల పరిశ్రమ (ఫుడ్ అండ్ బెవరేజ్) మరింత బలం పుంజుకునేందుకు, మేడిన్ ఇండియా ఉత్పత్తులకు 2022–23 బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు కల్పించాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. భారత్ తయారీ ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్, అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) ల్యాబ్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని బడ్జెట్‌కు సంబంధించి సూచనలు చేసింది.
అలాగే, ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) యూనిట్లు దిగుమతి చేసుకునే ముడి సరుకులపై సుంకాలు ఉండకూడదని కోరింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయం కల్పించాలని, ఆహార రంగంలో టెస్టింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ పరిశ్రమకు మెషినరీ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే సంస్థలకు నిధుల లభ్యత, ఎంఎస్‌ఎంఈ రంగానికి వడ్డీ రాయితీ పథకం ప్రకటించాలని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టీపీసీఐ) సూచించింది.
‘‘ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, ఆహార పరిశ్రమలకు పెద్ద పాత్ర ఉంది. ఈ రంగం మరింత పుంజుకునేందుకు ప్రోత్సాహం అవసరం. క్లిష్ట సమయాల్లోనూ ఈ రంగం బలంగా నిలబడింది’’ అని టీపీసీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీకే గౌబ పేర్కొన్నారు. అగ్రి, ఆహార ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్ డాలర్ల విలువకు చేరుకుంటాయని అంచనా వేశారు.
ఆటోపై మోస్తరు పన్నులు..: వోల్వో
ఆటోమొబైల్ రంగంపై పన్నుల భారం తగ్గించి, మోస్తరు పన్నుల విధానాన్ని అమలు చేయాలని వోల్వో గ్రూపు ఇండియా కోరింది. కేంద్ర బడ్జెట్‌లో దీనిపై దృష్టి సారించాలని సూచించింది. బడ్జెట్‌కు ముందు ఆటోమొబైల్ రంగం కోరుకుంటున్న అంశాల గురించి వోల్వో గ్రూపు ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, ఎండీ కమల్ బాలి తెలిపారు. విడిభాగాలకు సంబంధించి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌పై స్థిర విధానం అవసరమని చెప్పారు. మౌలిక రంగం ఆధారిత మూలధన నిధుల వ్యయాలు, క్లీన్, గ్రీన్, కనెక్టెడ్ లాజిస్టిక్స్‌పై బడ్జెట్‌లో దృష్టి పెడతారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఉత్పత్తి ఆధారిత పథకం (పీఎల్‌ఐ) కింద ప్రోత్సాహకాలకుతోడు స్క్రాపేజీ విధానం (పాత వాహనాలను తుక్కువగా మార్చడం) ఆటో రంగం రూపురేఖలను మార్చేసే సంస్కరణలుగా పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధికి ఇవి తోడ్పడతాయన్నారు. ‘‘ఆటో విడిభాగాలపై గరిష్ట రేటు 28 శాతం జీఎస్‌టీలో అమలవుతోంది. దీంతో రానున్న బడ్జెట్‌లో అన్ని రకాల ఆటో విడిభాగాలపై 18 శాతం ఒకటే రేటు అమలు చేయాలని పరిశ్రమ కోరుతోంది. అలాగే, విడిభాగాలపై ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ పడకుండా చూడాలని ఆశిస్తోంది’’ అని కమల్‌బాలి వివరించారు.
‘ఈవీ’ రుణాలకు ప్రాధాన్యరంగం హోదా
ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలు) కూడా ప్రాధాన్య రంగం రుణాల విభాగం కింద చేర్చాలని ఈవీ సంస్థ ఒమెగాసైకి మొబిలిటీ కోరింది. అలా చేస్తే ఈ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొంది. వినియోగదారులకు మరింత అందుబాటు ధరలకు వస్తాయని సూచించింది. ముడి సరుకులపై జీఎస్‌టీ రేటు తగ్గింపు నిర్ణయానికి బడ్జెట్‌లో చోటు ఉంటుందని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment