అధిక పన్నులతో అల్లాడుతున్న మధ్య తరగతి ప్రజలకు రానున్న బడ్జెట్(Budget)లో ఊరట లభించనుందా? మందగించిన వినియోగానికి ప్రేరణగా ప్రభుత్వం పన్ను రేటు(Tax Rate)ను తగ్గించనుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అంశాన్ని ప్రభుత్వం సునిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక వ్యవస్థ మందగించిన తరుణంలో జీవన వ్యయాలు పెరిగిపోయి, మధ్య తరగతి ప్రజలు(middle class people) ఇబ్బంది పడుతున్నారని, వినియోగం పడిపోతుందన్న ఆందోళనలు వినిపిస్తుండడం తెలిసిందే. వీటికి పరిష్కారంగా పన్ను రేట్ల తగ్గింపుతో వినియోగానికి ఊతమివ్వాలన్నది ఈ ప్రతిపాదన లక్ష్యమని ఆ వర్గాలు వెల్లడించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఇందులో ఈ మేరకు ప్రతిపాదన ఉంటే అది లక్షలాది మందికి ఊరట కల్పించనుంది. అయితే, కొత్త పన్ను వ్యవస్థలోనే ఈ మేరకు ఉపశమనం ఉండొచ్చన్నది సమాచారం. తద్వారా మరింత మందిని కొత్త పన్ను విధానం వైపు తీసుకురావడం కూడా ఈ ప్రతిపాదనలోని ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
కొత్త, పాత పన్ను విధానం..
2020లో కేంద్రం అప్పటి వరకు ఉన్న పన్ను విధానానికి అదనంగా, మరో కొత్త విధానాన్ని సైతం ప్రవేశపెట్టింది. పాత విధానంలో ఆదాయం రూ.6లక్షలు మించితే 20 శాతం పన్ను పరిధిలోకి వస్తారు. అదే కొత్త పన్ను విధానంలో అయితే ప్రస్తుతం రూ.12 లక్షల వరకు ఆదాయంపై 15 శాతమే పన్ను అమల్లో ఉంది. కాకపోతే పాత పన్ను వ్యవస్థలో గృహ రుణం, బీమా ప్రీమియంలు, పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలున్నాయి. కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఇతర మినహాయింపుల్లేవు. ఈ రెండింటిలో ఏ విధానం ఎంచుకోవాలన్నది పన్నుదారుల ఐచ్ఛికమే.
ఇదీ చదవండి: ప్రాపర్టీ ఎంపికలో పిల్లలూ కీలకమే..
సర్కారుపై పెరుగుతున్న ఒత్తిళ్లు
ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిల నుంచి దిగిరావడం లేదు. వేతనాల్లో వృద్ధి సైతం మందగించింది. దీంతో ఖర్చు చేసేందుకు మిగులు లేక, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా పట్టణ, గ్రామీణ వినియోగం క్షీణించి, అది దేశ ఆర్థిక వృద్ధిపైనా ప్రభావం చూపిస్తోంది. జీడీపీ ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 5.4 శాతానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పడిపోవడం తెలిసిందే. దీంతో ఆదాయపన్ను రేట్లను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. బడ్జెట్ ముందస్తు సమావేశాలు, వినతుల సందర్భంగా పలు రంగాల నిపుణులు, ఆర్థిక వేత్తలు సైతం పన్ను రేట్లు, కస్టమ్స్ టారిఫ్‌లు తగ్గించాలంటూ ప్రభుత్వానికి సూచించడం గమనార్హం. సహజంగా పన్ను తగ్గింపు డిమాండ్లు ఏటా బడ్జెట్ ముందు వినిపిస్తూనే ఉంటాయి. ఆర్థిక వృద్ధి క్షీణించిన తరుణంలో ఈ విడత ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment