ప్రతి సంవత్సరం బడ్జెట్ సమయంలో.. ట్యాక్స్ మినహాయింపుపై ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రకటనలు చేస్తుందా? అని పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పరిమిత ఆదాయ వనరులతో.. సీనియర్ సిటిజన్లు పెన్షన్‌లపై ఆధారపడతారు. కాబట్టి ట్యాక్స్ మినహాయింపు వారికి కీలకమైన ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది.
2020 - 21 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం ప్రకటించిన తరువాత.. పన్ను విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదు. కాబట్టి త్వరలోనే జరగనున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) ఎట్టకేలకు పాత పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లను సవరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
2023-24 బడ్జెట్‌లో, ప్రభుత్వం ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్‌లకు (60 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ) రూ.3 లక్షలకు, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు (80 ఏళ్లు & అంతకంటే ఎక్కువ) రూ.5 లక్షలకు పెంచింది. అయితే రాబోయే బడ్జెట్‌లో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.7 లక్షలకు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుంది.
పాత పన్ను విధానం
ప్రస్తుతం పాత పన్ను విధానం ప్రకారం.. 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. అయితే రూ. 3,00,001 నుంచి రూ. 5,00,000 మధ్య 5 శాతం, రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది.
80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి రూ. 5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. అయితే రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షలకు పైన 30 శాతం ట్యాక్స్ ఉండేది. సీనియర్ సిటిజన్లు సాధారణంగా కొన్ని సేవింగ్స్ స్కీముల్లో సేవింగ్స్ చేసుకుంటారు. వీరికి పాత పన్ను విధానంలోనే సెక్షన్ 80సీ మినహాయింపులు లభిస్తాయి. కొత్త పన్ను విధానంలో పరిమితిని పెంచితే.. ట్యాక్స్ నుంచి వారికి కొంత ఉపసమయం లభిస్తుంది.
కొత్త శ్లాబులు
ఫిబ్రవరి 1న జరగనున్న బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే.. 60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న వారు రూ. 5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లింపు ఉంటుంది.
సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం లేదా 80 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ వయసున్న వారు రూ. 7,00,000 వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 7,00,001 నుంచి రూ. 10,00,000 వరకు.. 20 శాతం, రూ. 10 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రా
పన్ను మినహాయింపు పరిమితి పెరిగితే 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్నవారు.. తమ ఆదాయం 10 లక్షలయినా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలా అంటే.. వారి ఆదాయం రూ. 10 లక్షలు అనుకుంటే.. అందులో రూ. 5 లక్షలు ప్రాథమిక మినహాయింపు పరిమితి. సెక్షన్ 80సీ ద్వారా రూ. 1.50 లక్షలు, సెక్షన్ 80సీసీడీ (1బీ) ద్వారా రూ. 50,000, సెక్షన్ 80డీ ద్వారా రూ. 50వేలు, స్టాండర్డ్ డిడక్షన్ మరో రూ. 50,000, సెక్షన్ 80TTB ద్వారా రూ. 50,000.. ఫ్యామిలీ పెన్షన్ స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా రూ. 15,000.. సెక్షన్ 80DDB ద్వారా రూ. 1 లక్ష తగ్గింపు లభిస్తాయి. ఇలా మొత్తం మీద తగ్గింపు రూ. 5,65,000. కాబట్టి దీని ప్రకారం ఆదాయం 10 లక్షల రూపాయలైనా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment