
పని గంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి (Narayana Murthy), ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ (Subrahmanyan) వివిధ రకాలుగా స్పందించారు. ప్రస్తుతం పనిగంటలపై సర్వత్రా చర్చ మొదలైపోయింది. తాజాగా దీనిపై ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా స్పందించారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.
వారానికి 70 గంటల పని
ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్‌లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు.
వారానికి 90 గంటల పని
ఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి.. అంటూ వారానికి 90 గంటలు పనిచేయాలని లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు.
వారానికి 70 గంటల పనిపై అదానీ స్పందన
భారతదేశంలో వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ డిబేట్‌పై గౌతమ్ అదానీ (Gautam Adani) మాట్లాడుతూ.. పని & జీవితం మధ్య సమతుల్యతను సాధించడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే 'ఒక వ్యక్తి ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పనిలోనే నిమగ్నమైపోతే.. భార్య అతన్ని విడిచి పారిపోతుంది' అని అన్నారు.
ఇదీ చదవండి: భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..
70 గంటల పనిపై నిమితా థాపర్ వ్యాఖ్యలు
హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' (Namita Thapar) మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల లాభం పొందేది యజమానులే.. కానీ ఉద్యోగులు కాదని వెల్లడించారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే యజమానులు.. ఎక్కువ గంటలు పనిచేయండని వివరించారు. అయితే అభివృద్ధి పేరుతో ఉద్యోగులపైన పనిభారాన్ని మోపకూడని అన్నారు.
పని గంటల పెంపు.. ఉద్యోగులపై తీవ్రమైన పని భారాన్ని, ఒత్తిడిని కలిగిస్తుందని కొందరు తీవ్రంగా ఖండిస్తే.. మరికొందరు పని గంటలు పెంచడం సరైనదే అని సమర్ధించారు. ఏది ఏమైనా పనిగంటలు వ్యవహారం రోజు రోజుకి తీవ్రమైన చర్చలకు దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment