ప్రముఖ టెక్ దిగ్గజం 'యాపిల్' (Apple).. సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) జీతాన్ని ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 18 శాతం పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.
వార్షిక వేతనం 18 శాతం పెరగడంతో.. టిమ్ కుక్ వేతనం 74.6 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 643 కోట్లు)కు చేరింది. యాపిల్ సీఈఓ జీతంలో బేసిక్ పే 3 మిలియన్ డాలర్లు, స్టాక్ అవార్డులు 58.1 మిలియన్ డాలర్లు, సుమారు 13.5 మిలియన్ డాలర్లు అదనపు పరిహారం వంటివి ఉన్నాయి.
కంపెనీ వార్షిక సమావేశం (ఫిబ్రవరి 25) జరగడానికి ముందే యాపిల్ టిమ్ కుక్ జీతం భారీగా పెంచినట్లు ప్రకటించింది. త్వరలో జరగనున్న సంస్థ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కుక్ వేతనం 2023 కంటే ఎక్కువే. అయినప్పటికీ ఈయన 2022లో (100 మిలియన్ డాలర్లు) అందుకున్న వేతనంతో పోలిస్తే చాలా తక్కువే అని సమాచారం.
టిమ్ కుక్‌తో పాటు యాపిల్ రిటైల్ చీఫ్, మాజీ సీఎఫ్ఓ, సీఓఓ, జనరల్ కౌన్సిల్ సహా ఇతర యాపిల్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ 2024లో 27 మిలియన్ డాలర్లకు పైగా వేతనాన్ని పొందనున్నారు. మొత్తం మీద యాపిల్ కంపెనీ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment