సీమలో నకిలీ కిక్కు | illicit liquor floos in rayalaseema | Sakshi
Sakshi News home page

సీమలో నకిలీ కిక్కు

Published Wed, Jun 18 2014 7:23 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

సీమలో నకిలీ కిక్కు - Sakshi

సీమలో నకిలీ కిక్కు

కడప : రాయలసీమలో అక్రమ, నకిలీ మద్యం ఏరులై పారుతోంది. అధికారుల కళ్లుగప్పి కర్ణాటక నుంచి వేల కేసుల మద్యాన్ని ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు. అక్రమ రవాణాతో పాటు నకిలీ మద్యం ఇబ్బడిముబ్బడిగా వస్తోంది. స్వ్కాడ్ పేరుతో తనిఖీలు షరా ‘మామూలు’గా మారిపోయాయి. పట్టుకున్న వారితో బేరసారాలు సాగించి చాలా కేసులు వదిలిపెడుతూ... కొన్నింటిపై కేసులు కడుతూ మమ అనిపిస్తుట్లు తెలుస్తోంది. దీంతో సరికొత్త ‘నాటు’ మందు జిల్లాలో ఏరులై పారుతోంది. కడప, ప్రొద్దుటూరులలో ఈ అక్రమ మద్యం నిల్వలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేత కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతోందని సమాచారం.
 
ఎన్నికల సమయంలో ప్రారంభమై...
స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల సమయంలో పెరిగిన డిమాండ్‌తో అక్రమ వ్యాపారం కట్టలు తెంచుకుంది. ఇప్పుడూ అది అలాగే కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో పట్టణాలు, పల్లెలపై మద్యం మాఫియా కన్నేసింది. మద్యం అమ్మకాలపై ‘సీలింగ్’ అమల్లో ఉండటంతో బేవరేజ్ సంస్థ నుంచి అదనంగా మద్యం సేకరణకు దారులు మూసుకుపోయాయి. దీంతో వ్యాపారులు అక్రమ మద్యంపై కన్నేశారు. కర్ణాటక వైపు కొందరు దారిపట్టారు. అదికూడా సరిపోక స్వయం పాకానికి సిద్ధపడ్డారు. స్పిరిట్, రంగుపొడితో నకిలీ మద్యం తయారీకి తెగించారు. మరికొందరు నాటు సారాలో రంగుపొడి కలిపి లిక్కర్ పేరుతో అమ్మకాలు జరిపారు.
 
కర్ణాటక నుంచి అక్రమ రవాణా
కర్ణాటకకు చెందిన చీప్, మధ్యస్థ రకాలు రెండింటిని ఎంచుకుని మరీ డంప్ చేస్తున్నారు. వేల కేసులు తీసుకొచ్చి జిల్లాలో నిల్వలు ఉంచారు. వ్యాపారులకు అనువైన ప్రాంతాల్లో దాచి ఉంచి వారివారి దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. కడప, ప్రొద్దుటూరులో ఈ తరహా మద్యం విక్రయాలు అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నిల్వలున్న ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ ఎవరైనా తనిఖీలు జరిపితే అక్కడికక్కడే విషయాన్ని తేల్చేస్తున్నారు. అధికారులను సంతృప్తి పరిచి విషయాన్ని పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. దీంతో నామమాత్రపు దాడులతో అధికారులు సరిపెడుతున్నారు.
 
ఇక్కడ దొరికేది ‘మధ్య’స్థమే
సీమలో అధికంగా దొరుకుతోంది మధ్యస్థంగా ఉండే మద్యమేనని తెలుస్తోంది. బేవరేజెస్ నుంచి తెచ్చుకునేది మొదటిరకం. ఇది మన వైన్‌షాపుల్లో విక్రయిస్తారు. ఇతర రాష్ట్రాల్లో చవకగా వస్తుందని మన రాష్ట్రంలో పన్ను ఎగ్గొట్టి కొనుగోలు చేసి విక్రయించే సరుకును రెండో రకం (సెకండ్స్) అంటారు. అసలు ఎలాంటి ఎక్సైజ్ డ్యూటీ చెల్లించకుండా స్పిరిట్, అవసరమైన పదార్థాలతో సొంతంగా తయారుచేసి విక్రయించేది మూడోరకం (థర్డ్). ప్రస్తుతం జిల్లాకు చేరిన సరుకు వీటిలో ఏ రకానికీ చెందదని తెలుస్తోంది. రెండు, మూడు రకాలకు మధ్యస్థంగా ఉంటుందని ఓ ఎక్సైజ్  అధికారి చెప్పారు. కర్ణాటక నుంచి తెచ్చిన మద్యాన్ని బేసిన్లు, టబ్‌లలో పోసి... నీళ్లు, రంగు, స్పిరిట్ కలిపి ఆ మిశ్రమ మద్యాన్ని సీసాల్లో నింపడమే మధ్యస్థం అని చెబుతున్నారు. సీసాపై మూత తొడిగి పట్టకారుతో నొక్కితే సహజమూతలా అతుక్కుపోతుంది.

గత ఎన్నికల్లో ఇలాంటి మద్యం జిల్లాలో ఏరులై పారించారు. ఆనాటి అనవాళ్లు ఇప్పటీకీ జిల్లాలో నెలకొని ఉన్నాయి. మద్యం డిమాండ్ అధికంగా ఉండటంతో వ్యాపారులు ఈ తరహా మద్యాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. కడప శివార్లలోని ఓ మద్యం దుకాణంలో సుమారు తొమ్మిది కేసులు ఇలాంటి మద్యమే పట్టుబడింది. అయితే అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మరుగున పర్చినట్లు సమాచారం. ప్రొద్దుటూరులో కూడా ఇలాంటి విక్రయాలున్నా ఎక్సైజ్ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.
 
దేశం నేత కనుసన్నుల్లోనే సరఫరా
కడప, చిత్తూరు జిల్లాల్లో ఇలాంటి తరహా అక్రమమద్యం ఏరులై పారుతున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన మునుపటి ‘సారా’వ్యాపారి, ప్రస్తుత తెలుగుదేశం నేత కనుసన్నుల్లోనే అక్రమ నిల్వల దిగుమతులు ఉన్నట్లు సమాచారం. తన ఉన్నతికి దోహదపడిన అక్రమ మద్యం వ్యాపారం మరోమారు ‘మూడు లారీలు.. ఆరు డంప్‌లు’గా విరాజిల్లుతోన్నట్లు సమాచారం.

దేశం నాయకుడు తన స్వగ్రామానికి సమీపంలో పెన్నాన దీ తీరంలో సరికొత్త మద్యాన్ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా సరఫరాకు ఉపక్రమించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటి తయారీ కేంద్రాన్ని కుప్పం ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు అన్ని ప్రయత్నాలను ఆ నాయకుడు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement