షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి నష్టాలపాలై చివరకు ప్రాణాలు వదులుతున్న ఘటనలు చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ నిజంగానే అంత ప్రమాదకరమా? మార్కెట్లో అడుగుపెట్టిన వారికి ఈ పరిస్థితి రావాల్సిందేనా? మార్కెట్ ముంచేస్తుందా? మరి లాభాలు ఎవరికి వస్తున్నాయి? నష్టాలు వస్తున్నవారు అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? అనే చాలా ప్రశ్నలొస్తాయి. వీటిని విశ్లేషించి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.
స్టాక్ మార్కెట్ అద్భుత సాధనం
స్టాక్ మార్కెట్ ఎప్పటికీ ప్రమాదకరం కాదు. పైగా మంచి రాబడి ఇవ్వడానికి మనకు అందుబాటులో ఉన్న ఒక అద్భుత సాధనం. ఓ పక్క కుటుంబం ప్రాణాలు వదులున్న ఘటనలున్నాయని చెప్పారు కదా. మరి స్టాక్ మార్కెట్ బెటర్ అని ఎలా చెబుతారు? అని ప్రశ్నించొచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వెంటనే రాబడి రావాలంటే చాలా కష్టం. మార్కెట్ తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంటుంది. కాబట్టి సరైన సమయం ఇచ్చి రాబడి ఆశించాలి. లార్జ్ క్యాప్ స్టాక్‌ల్లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే దాదాపు నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు తొందరగానే రావొచ్చు. నష్టాలు కూడా తీవ్రంగానే ఉండొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పెన్నీ స్టాక్స్‌తో జాగ్రత్త
కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్(అంతర్గత సమాచారంతో చేసే ట్రేడింగ్) జరుగుతుంటుంది. అది నిబంధనలకు విరుద్ధం. అది సాధారణ ఇన్వెస్టర్లకు తెలియక పోవచ్చు. దాంతో పెన్నీ స్టాక్ బాగా ర్యాలీ అవుతుందనే ఉద్దేశంతో అందులో పెట్టుబడి పెట్టి చివరకు నష్టాలతో ముగించాల్సి ఉంటుంది. కాబట్టి పెన్నీ స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన వారు వాటి వైపు చూడకపోవడం ఉత్తమం.
ఎవరో చెప్పారని..
చాలామంది స్టాక్ మార్కెట్ అనగానే వెంటనే లాభాలు వచ్చేయాలి.. తక్కువ మొత్తం పెట్టుబడితో అధికంగా లాభాలు ఆర్జించాలనే ఆశతో మార్కెట్లోకి అడుగుపెడుతుంటారు. అలాంటి వారు తొందరగానే నష్టాలు మూటగట్టుకుంటారు. కాసింత లాభం కళ్ల చూడగానే మార్కెట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని అనుకుంటారు. కానీ చాలామందికి స్టాక్స్‌కు సంబంధించి సరైన అవగాహన ఉండడం లేదు. ఎవరో చెప్పారని, ఏదో ఆన్‌లైన్‌లో వీడియో చూశారని, వాట్సప్, టెలిగ్రామ్.. వంటి ఛానల్‌లో ఎవరో సజెస్ట్ చేశారని పెట్టుబడి పెడుతున్నవారు చాలా మంది ఉన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడి
స్టాక్ మార్కెట్‌లో తాము ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఎందుకు పెరుగుతోందో చాలామందికి తెలియదు. అది ఇంకెంత పెరుగుతుందో అవగాహన ఉండదు. ఎప్పుడు పడుతుందో తెలియదు. నిన్నపెరిగింది కదా.. ఈరోజు పడుతుందిలే.. లేదంటే.. నిన్న పడింది కదా.. ఈరోజు పెరుగుతుందిలే..అని సాగిపోతుంటారు. దాంతో భారీగా క్యాపిటల్ కోల్పోవాల్సి వస్తుంది. అప్పటికీ తేరుకోకపోగా ఫర్వాలేదు.. పూడ్చేద్దాం అనుకుంటారు. ఆ నష్టం పూడకపోగా.. మరింత పెరుగుతుంది. అప్పు చేస్తారు. ఎలాగైనా సంపాదించి తీర్చేద్దాం అనుకుంటారు. అదీ జరగదు. క్రమంగా అప్పులు పెరిగిపోతాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇది కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోతుంది. చివరకు ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది.
ఇదీ చదవండి: బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
దీర్ఘకాలిక దృక్పథం అవసరం
ట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయాలి. స్టాక్‌మార్కెట్‌లో డబ్బులు సంపాదించవచ్చు అనేది నిజం. కానీ నిమిషాల్లో సంపాదించేయలేం. ఓపిక ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం అవసరం. అప్పుడే ఎవరైనా మార్కెట్లో రాణించగలుగుతారు. లేదంటే ఆషేర్లే మెడకు ఉరితాళ్ళుగా మారి కుటుంబాల్ని విషాదాల్లో నింపేస్తాయి.
డబ్బు ఎవరు సంపాదిస్తున్నారంటే..
మార్కెట్ తీరుతెన్నులను ఓపిగ్గా గమనిస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేరుగా డబ్బు పెట్టి ట్రేడింగ్ చేయడం కంటే కనీస ఆరు నెలలపాటు పేపర్ ట్రేడింగ్ చేయాలి. దాంతో అవగాహన వస్తుంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా కంపెనీలు కాన్‌కాల్ ఏర్పాటు చేస్తాయి. అందులో పాల్గొనాలి. ఒకవేళ అవకాశం లేకపోతే తర్వాత రెగ్యులేటర్లకు ఆయా వివరాలను అప్డేట్ చేస్తాయి. ఆ డాక్యుమెంట్లు చదవాలి. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి..రెవెన్యూ అంశాలు ఎలా ఉన్నాయి.. క్యాష్‌ఫ్లోలు ఎలా ఉన్నాయి.. అనుబంధ సంస్థలతో జరిపే రిలేటెడ్ పార్టీ లావాదేవీలు ఎలా ఉన్నాయి.. కంపెనీ సేల్స్ పెంచుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు.. పోటీలో ఉన్న కంపెనీలు, వాటి విధానం.. కాలానుగుణంగా సరైన సెక్టార్‌లోని స్టాక్‌లనే ఎంచుకున్నామా.. వంటి చాలా అంశాలను పరిగణించి పెట్టుబడి పెట్టాలి. అలా చేసిన తర్వాత దీర్ఘకాలంపాటు వేచిచూస్తేనే మంచి రాబడులు అందుకోవచ్చు.
- బెహరా శ్రీనివాసరావు
స్టాక్ మార్కెట్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment