Stock analysts
-
సాక్షి మనీ మంత్ర: ఆరంభం నుంచి నష్టాల్లో ట్రేడయిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభం నుంచి మార్కెట్ ముగిసే వరకు నష్టాల్లోనే పయనించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 65629 వద్ద.. నిఫ్టీ 46.4 పాయింట్లను కోల్పోయి 19624 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 134 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 34.55 పాయింట్లు నష్టపోయాయి. హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు ఆలోచిస్తున్న వేళ మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ భయాలు మార్కెట్లను నష్టాల్లో పయనించేలా చేశాయి. ఈ తరుణంలో మార్కెట్లలో అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్‌లు వల్ల ఫెడ్ వడ్డీ రేట్లు పెంచొచ్చనే ఊహాగానాలు ఆందోళనలకు కారణమౌతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే 3.4శాతం, ఆల్ట్రా టెక్ సిమెంట్ 2.8శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.9శాతం, ఎల్ అండ్ టీ 0.2శాతం లాభాల్లో ముగిశాయి. విప్రో 3 శాతం, సన్‌ఫార్మా 1.5శాతం, టెక్ మహీంద్రా 1.4శాతం, ఎన్టీపీసీ 1.3శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.1శాతం, భారతీఎయిర్‌టెల్ 1 శాతంమేర నష్టాల్లో ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో కదలాడిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ మార్కెట్లకు కొనుగోళ్ల అండ లభించలేదు. వారాంతం కావడంతో మదుపర్ల అమ్మకాలు, రూపాయి బలహీన పడడం, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, కీలక స్టాక్స్‌లో అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 66,068 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,895.41 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు కొంద పుంజుకుని 66,282.74 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,654 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,800 మార్క్ దగ్గర ఎగువ స్థాయికి చేరుకుంది. చివరకు గురువారం ముగింపుతో పోలిస్తే 43 పాయింట్లు నష్టపోయి 19,751 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, మారుతిసుజుకీ, టీసీఎస్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, బజాన్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ , ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈలో మొత్తం 3,820 షేర్లు ట్రేడ్ అవగా, 1,804 స్టాక్‌లు లాభాలతో ముగిశాయి. గతంతో పోలిస్తే 156 షేర్లు యథాతథంగా ఉన్నాయి. రోజులో 317 షేర్లు వాటి ఎగువ సర్క్యూట్‌ను తాకగా, 157 షేర్లు లోయర్ సర్క్యూట్ స్థాయిలో ట్రేడయ్యాయి. జై కార్ప్, ఐటీఐ, ఏడీఎఫ్ ఫుడ్స్ 20 శాతం చొప్పున పుంజుకోగా, స్పైస్‌జెట్ 19 శాతానికి పైగా లాభపడింది. టెక్స్మాకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోల్డింగ్స్ 16 శాతం ర్యాలీ కాగా, ఏజీఐ గ్రీన్‌పాక్ 15 శాతం పెరిగింది. ఆంధ్రా పెట్రోకెమికల్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్లు 10 శాతం పెరిగాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీమంత్ర: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతకుముందు రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో కీలక స్టాక్స్‌లో మదుపర్లు లాభాలను స్వీకరించారు. మరోవైపు నిన్న వెలువడ్డ ఇన్ఫోసిస్ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. నిఫ్టీలో దీని వాటా అధికంగా ఉండడంతో ఇది సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో సెప్టెంబరులో రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠమైన 5.02 శాతంగా నమోదైంది. ఇది ఒకింత మార్కెట్‌కు పాజిటివ్ విషయం. అయినప్పటికీ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. నిఫ్టీ గత ముగింపుతో పోలిస్తే 140 పాయింట్లు నష్టంతో ప్రారంభమై ఉదయం 9:37 వరకు కొంత పుంజుకుని 19721 వద్ద ట్రేడవుతుంది. సెన్సెక్స్ 286 పాయింట్ల నష్టపోయి 66,121.52 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22కు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, యాక్సిక్‌బ్యాంక్, ఎస్బీఐ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీలు మాత్రం నష్టంలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అక్కడ వెలువడిన సెప్టెంబరు నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు మదుపర్లను నిరాశపర్చాయి. ఐరోపా సూచీలు మాత్రం లాభాల్లో స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 86.48 డాలర్లకు చేరింది. టాటా స్టీల్ లాంగ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సాయి సిల్క్స్ కళామందిర్, డెన్ నెట్వర్క్స్, ఆదిత్య బిర్లా మనీ, మిత్తల్ లైఫ్ స్టైల్ కంపెనీలు ఈరోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. -
సాక్షి మనీ మంత్ర: 19,800 పాయింట్లు వద్దే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ అయిన నిఫ్టీ గురువారం మునుపటి రోజుకంటే స్వల్పంగా 11 పాయింట్లు పెరిగి 19,822 వద్ద ప్రారంభమయింది. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 66500 వద్ద ప్రారంభమయి 66437 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.14కు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఇండసింద్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. TCS, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, HCL టెక్నాలజీస్ కంపెనీలు మాత్రం నష్టంలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు మాత్రం కొంత నష్టంలోకి జారుకున్నాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ భయాల నుంచి మార్కెట్లు క్రమంగా కోలుకుంటాన్నాయినే సంకేతాలు ఉన్నాయి. బుధవారం బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 85.82 డాలర్లకు చేరింది. -
వడ్డీ రేట్ లో మార్పు లేదు అన్న రబీఐ
-
ఈ వారం అమ్మకాల ఒత్తిడిలో మార్కెట్లు!
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశమున్నట్లు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) మూసివేత తదితర అంశాలు కారణంకానున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా పలు గణాంకాలు విడుదల కానుండటంతో ఇన్వెస్టర్లు వీటన్నిటినిపైనా దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. ద్రవ్యోల్బణం, వాణిజ్యం.. సోమవారం(13న) దేశీయంగా ఫిబ్రవరి నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు విడుదల కానున్నాయి. అంతకుముందు నెల అంటే జనవరిలో సీపీఐ మూడు నెలల గరిష్టం 6.52 శాతంగా నమోదైంది. ఇక మంగళవారం(14న) ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. 2022 డిసెంబర్లో నమోదైన 4.95 శాతం నుంచి జనవరిలో 4.73 శాతానికి డబ్ల్యూపీఐ స్వల్పంగా తగ్గింది. ఈ బాటలో ఫిబ్రవరి వాణిజ్య గణాంకాలను సైతం ఇదే రోజు ప్రభుత్వం ప్రకటించనుంది. జనవరిలో వాణిజ్య లోటు 17.75 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశీ అంశాలు గత వారాంతాన ఇన్సూర్డ్ డిపాజిట్ల రక్షణకు వీలుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్వీబీని మూసివేసినట్లు కాలిఫోర్నియా ఆర్థిక పరిరక్షణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పరిస్థితులను చక్కదిద్దే బాటలో ఎస్వీబీని ఫైనాన్షియల్ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఐసీకి అప్పగించినట్లు వెల్లడించింది. ప్రధానంగా సిలికాన్ వ్యాలీ, టెక్ స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించే ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ ఆర్థిక సంక్షోభంలో పడటంతో గత గురువారం కంపెనీ షేరు 60 శాతం కుప్పకూలింది. దీంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్‌ఫార్గో తదితర బ్యాంకింగ్ దిగ్గజ షేర్లు 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. దీంతో సోమవారం బ్యాంకింగ్ పరిశ్రమపై ఈ ప్రభావం ఏమేర ఉండబోయేదీ వేచిచూడవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. అంచనాలకంటే అధికంగా వడ్డీ రేట్లను పెంచే వీలున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ గత వారం పేర్కొన్నారు. అయితే వారాంతాన యూఎస్ నిరుద్యోగ గణాంకాలు అంచనాలను మించి వెలువడ్డాయి. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు కొంతమేర చెక్ పడేవీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు ఊహిస్తున్నాయి. ఈ నెల 22న ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలను వెల్లడించ నుంది. గ్లోబల్ గణాంకాలు ఫిబ్రవరి నెలకు యూఎస్ సీపీఐ గణాంకాలు 14న వెలువడనున్నాయి. చైనా పారిశ్రామికోత్పత్తి వివరాలు 15న వెల్లడికానున్నాయి. యూఎస్ ఉత్పాదక ధరల ద్రవ్యోల్బణం, రిటైల్ విక్రయ గణాంకాలు ఇదే రోజు వెలువడనున్నాయి. ఈ బాటలో 16న జపాన్ వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. ఇక దేశీయంగా ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు, ఎస్వీబీ వైఫల్యంతో వారం చివర్లో దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గత వారం సెన్సెక్స్ నికరంగా 674 పాయింట్లు కోల్పోయి 59,135కు చేరగా.. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 17,413 వద్ద ముగిసింది. -
Saurabh Maurya: విజయ సౌరభం
మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనేది సౌరభ్ మౌర్య కల. అయితే తన దగ్గర అమ్మ పంపించిన అయిదువేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొన్నాడు. స్టార్టప్‌లు స్టార్ట్ చేసి కోటీశ్వరుడిగా ఎదిగి, ఎంతోమందికి రోల్‌మోడల్ కావడానికి అవసరమైన ప్రయాణం ఈ సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ నుంచే మొదలైంది! ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ అనే చిన్నగ్రామంలో పుట్టి పెరిగాడు సౌరభ్ మౌర్య. పేదరికంలో ఉన్నప్పటికీ తన పిల్లలను అప్పు చేసైనా పెద్ద చదువులు చదివించాలనుకునేవాడు తండ్రి. సౌరభ్ ఇద్దరు అన్నలు చదువులో మందుండేవారు. పై చదువుల కోసం వారిని బెనారస్‌కు పంపాడు తండ్రి. మొదటి ప్రయత్నంలో ఇద్దరు ‘ఐఐటీ–జెఇఇ’లో ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు పిల్లలు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలని కలలు కనేవారు తల్లిదండ్రులు. అయితే సౌరభ్ పరిస్థితి వేరు. తనకు పెద్ద ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనేది కల. కంప్యూటర్ స్టోర్ అనేది ఆ కలలలో ఒకటి. మొదటి ప్రయత్నంలో ‘ఐఐటీ– జెఇఇ’లో ఫెయిలయ్యాడు సౌరభ్. ‘నేను ఫెయిలయ్యాను అనే బాధ కంటే తల్లిదండ్రులను బాధ పెట్టాను అనే ఆలోచన నన్ను ఎక్కువగా బాధ పెట్టింది’ అంటున్న సౌరభ్ కష్టపడి చదివి రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఐఐటీ–బెనారస్ కాలేజీలోకి వెళ్లిన తరువాత తనకొక కొత్త ప్రపంచం పరిచయం అయింది. తనలాగే ఆలోచించే ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. మరో వైపు ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నాయి. జేబు ఖర్చుల కోసం 6–8 తరగతులకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. జేబుఖర్చుల మాట ఎలా ఉన్నా పోను పోను ‘బోధన’ అనేది తనకొక ప్యాషన్‌గా మారింది. తల్లి పంపించిన అయిదువేలతో సెకండ్‌హ్యాండ్ సెల్‌ఫోన్ కొనడంతో తన కెరీర్ మొదలు పెట్టడానికి మొదటి అడుగు పడింది. కొద్దిరోజులకు యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఐఐటీ–జెఇఇ పరీక్షలో విఫలమైన తాను రెండో ప్రయత్నంలో ఎలా విజయం సాధించింది మొదలు ఐఐటీకి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ యూట్యూబ్ చానల్ ద్వారా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చానల్‌కు మంచి ఆదరణ లభించడంతో సౌరభ్‌లో ఉత్సాహం వెల్లువెత్తింది. నాలుగు సంవత్సరాల అనుభవం తరువాత స్టాక్ మార్కెట్ ట్రేడర్‌గా సక్సెస్ అయ్యాడు. ‘ఐఐటీయన్ ట్రేడర్’ పేరుతో ట్రేడింగ్ స్ట్రాటజీస్, టెక్నికల్ ఎనాలసిస్...మొదలైన ఆన్లైన్ కోర్సులు ప్రారంభించి సక్సెస్ సాధించాడు. చిన్న వ్యాపారమైనా సరే, సొంతంగా మొదలుపెడితే చాలు అనుకున్న సౌరభ్ 11–12 తరగతుల విద్యార్థులు ‘ఐఐటీ–జెఇఇ’ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన బలమైన పునాదిని ఏర్పాటు చేయడానికి ప్రారంభించిన ‘రైట్–ర్యాంకర్స్’ స్టార్టప్, ఆన్లైన్ స్టాక్‌మార్కెట్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ఐఐటీయన్ ట్రేడర్స్’ సక్సెస్ సాధించి తనను 22 కోట్ల క్లబ్‌లోకి చేర్చాయి. ‘ఏదైనా సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు డబ్బు, వనరుల కొరత ఎప్పుడూ అడ్డంకి కాదు. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి’ అంటున్నాడు 22 సంవత్సరాల సౌరభ్ మౌర్య. -
ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తున్న ప్రముఖ కంపెనీల షేర్లు.. కారణం అదేనా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి అర్ధభాగంలో అటూఇటుగా పనితీరు చూపిన టైర్ల తయారీ కంపెనీలు ఇకపై పుంజుకోనున్నాయి. ఇందుకు ప్రధానంగా ముడివ్యయాలు తగ్గుతుండటం, డిమాండు ఊపందుకోనుండటం దోహదపడనుంది. వెరసి టైర్ల కంపెనీల షేర్లు ఇకపై జోరందుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. ఇటీవలే ముగిసిన ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో టైర్ల తయారీ కంపెనీలు మిశ్రమ ఫలితాలు సాధించాయి. అయితే భవిష్యత్‌లో అమ్మకాలు బలపడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వాహన తయారీ దిగ్గజాల(ఓఈఎం) నుంచి ఆర్డర్లు పెరగడంతోపాటు.. సెకండరీ(రీప్లేస్మెంట్) మార్కెట్ నుంచి టైర్లకు డిమాండు మెరుగుపడుతోంది. ఇది విక్రయాలకు ఊపునివ్వనుంది. ఇవికాకుండా మరోవైపు ముడిచమురు ధరలు దిగిరావడంతో సంబంధిత ముడిసరుకుల వ్యయాలు తగ్గుతున్నాయి. దీనికి నేచురల్ రబ్బర్ ధరలు నీరసించడం జత కలుస్తోంది. అమ్మకాలతో పోలిస్తే టైర్ల తయారీలో ఈ రెండింటి సంబంధ ముడివ్యయాలే 60 శాతాన్ని ఆక్రమిస్తుంటాయి. దీంతో లాభదాయకత మెరుగుపడేందుకు వీలుంటుంది. ముడివ్యయాల ఎఫెక్ట్ త్రైమాసికవారీగా చూస్తే క్యూ2లో సియట్ స్థూల మార్జిన్లను 0.82 శాతం, అపోలో టైర్స్ 0.1 శాతం చొప్పున మెరుగుపరచుకున్నాయి. అయితే మరో దిగ్గజం ఎంఆర్ఎఫ్ మార్జిన్లు మాత్రం 1.8 శాతం నీరసించాయి. భారీగా పెరిగిన ముడివ్యయాల ధరలను కస్టమర్లకు పూర్తిస్థాయిలో బదిలీ చేయకపోవడం ప్రభావం చూపింది. ఎగుమతులపై అధికంగా ఆధారపడే ఆఫ్‌రోడ్ టైర్ల దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్థూల మార్జిన్లు త్రైమాసికవారీగా 2.2 శాతం క్షీణించాయి. ప్రధానంగా ముడిసరుకులు, రవాణా వ్యయాలు పెరగడంతో టైర్ల పరిశ్రమ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు మార్జిన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తెలియజేసింది. అయితే చమురు డెరివేటివ్స్, రబ్బర్ ధరలు వెనకడుగు వేస్తుండటంతో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్–మార్చి)లో మార్జిన్లు బలపడవచ్చని అంచనా వేసింది. జులై నుంచి దిగివస్తున్న ముడిచమురు ధరలు మార్చిలో నమోదైన చరిత్రాత్మక గరిష్టం నుంచి 35 శాతం క్షీణించాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనలతో రబ్బర్ ధరలు సైతం కొన్నేళ్ల కనిష్టాలను తాకుతున్నాయి. కోవిడ్–19 ప్రభావంతో చైనా నుంచి టైర్లకు డిమాండు తగ్గడం ప్రభావం చూపుతోంది. మార్జిన్లకు బలిమి మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ అంచనా ప్రకారం నేచురల్, సింథటిక్ రబ్బర్, కార్బన్ బ్లాక్ ధరలు 10 శాతం తగ్గితే.. నిర్వహణ లాభ మార్జిన్లు 1.6 శాతం, 0.8 శాతం, 1 శాతం చొప్పున బలపడతాయి. కాగా.. యూరోపియన్ మార్కెట్లలో అనిశ్చితుల కారణంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ఇటీవల నీర సించగా.. మార్జిన్ల ప్రభావంతో నెల రోజులుగా ఎంఆర్ఎఫ్ స్టాక్ హెచ్చుతగ్గుల మధ్య అక్కడక్కడే అన్నట్లుగా కదులుతోంది. ఇదే కాలంలో అపోలో టైర్స్, జేకే టైర్స్ సైతం ఒడిదొడుకులు ఎదుర్కోగా గత ఆరు నెలల కాలంలో ఈ రెండు స్టాక్స్ 17–47 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే గత మూడు నెలల్లో సియట్ షేరు 27 శాతం లాభపడటం గమనార్హం! -
దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా...నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లపై గురువారం బేర్ పంజా విసిరింది. దీంతో సూచీలు కుప్ప కూలి గురువారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) సంస్థలు సిద్ధమవ్వడం, అంతర్జాతీయంగా అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం,యూరప్‌లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం 9.20గంటలకు సెన్సెక్స్ పాయింట్లు నష్టపోయి 57370 వద్ద ట్రేడ్ అవుతుండగా..నిఫ్టీ 489 పాయింట్లు నష్టపోయి 35659 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను కొనసాగుతుంది. కోల్ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్ స్టాక్స్ లాభాలతో కంటిన్యూ అవుతుండగా..కొటాక్, ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
వేల కోట్ల నష్టం: అదానీ గ్రూప్ సీఎఫ్ఓ స్పందన
సాక్షి,వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్ స్టాక్స్‌కు గ్రహణం పట్టింది. మూడు విదేశీ ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డిఎల్) సంస్థ ఫ్రీజ్ చేయడంతో అదానీ షేర్లు బాగా నష్టపోయాయి. దీంతో తిరిగి మళ్లీ లాభాల బాట పట్టేందుకు అదానీ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేషిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. అదానీ భవిష్యత్ కార్య చరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. • ఇవి 2-3 సంవత్సరాల ఓల్డ్ కంపెనీలు. 5-7 సంవత్సరాల తరువాత లాభాల్ని గడిస్తాయి. మాది వేగంగా అభివృద్ది చెందుతున్న సంస్థ. • నష్టపోయిన షేర్ల వ్యాల్యూ పెరుగుతుంది. ప్రస్తుతం యుటిలిటీ ప్లాట్‌ఫామ్ సేవల్ని మాత్రమే అందిస్తున్నాం. కానీ మనదేశంలో యుటిలిటీ ఇండెక్స్ లేదు. • అదానీకి డైవర్సిఫైడ్ రిజిస్టర్ ఉంది. దానిపై పనిచేస్తున్నాం. • సిటీ గ్యాస్ చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది బి-టు-సి వ్యాపారం. ఇది 2టైర్ , 3 టైర్ కేటగిరీ పట్టణాలకు కూడా విస్తరిస్తుంది. ప్రస్తుతానికి దానిపైనే దృష్టి సారించినట్లు అదానీ సీఎఫ్ఓ చెప్పారు. కాగా ఎన్ఎస్డీఎల్ మూడు విదేశీ ఖాతాలను స్తంభింపజేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం 5శాతం - 25 శాతానికి పడిపోయాయి. దాదాపు ఒక దశాబ్దంలో అదానీ ఎంటర్ప్రైజెస్ 25 శాతం పడిపోయింది. అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) కూడా 19 శాతం పైగా కుప్పకూలింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం అదానీ నికర విలువ 7.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 55,000 కోట్లు) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. చదవండి: పుకార్లు షికార్లు,అదానీ ‘ఫండ్స్’ కలకలం! -
2021లో పెట్టుబడికి 6 స్టాక్స్
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను కోవిడ్-19 కలవర పెట్టినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు ఏడాది కాలంలో బలంగా పుంజుకున్నాయి. మార్చిలో నమోదైన మూడేళ్ల కనిష్టాల నుంచి 79 శాతం ర్యాలీ చేయగా.. ఇటీవల సరికొత్త గరిష్ట రికార్డులను సైతం సాధించాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అమలు చేసిన సహాయక ప్యాకేజీలతో లిక్విడిటీ భారీగా పెరిగింది. దీనికితోడు.. ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడనున్న అంచనాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి 2021లోనూ మార్కెట్లు లాభాల దౌడు తీసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే కొంతమేర కన్సాలిడేషన్ జరిగే వీలున్నట్లు చెప్పారు. (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) ప్లస్- మైనస్.. రికవరీ బాటపట్టిన ఆర్థిక వ్యవస్థ కారణంగా కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలుంది. మరోవైపు కోవిడ్-19 కట్టడికి ఇప్పటికే యూకే, యూఎస్, భారత్‌సహా పలు దేశాలు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది(2021)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 15,000 పాయింట్ల సమీపానికి చేరుకోగలదని రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేసింది. ఫండమెంటల్ విలువలో చూస్తే 13,500 స్థాయిలో నిఫ్టీకి బలమైన సపోర్ట్ లభించగలదని అభిప్రాయపడింది. ఒకవేళ రిస్కులు పెరిగి ఈక్విటీలలో అమ్మకాల పరిస్థితి తలెత్తితే నిఫ్టీ 11,600 వరకూ తిరోగమించే అవకాశమున్నదని వివరించింది. 2020 నవంబర్వరకూ చూస్తే గత 12 నెలల కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 17.7 బిలియన్ డాలర్లను పంప్ చేశారు. ఒక్క నవంబర్లోనే ఏకంగా 8.3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందుకు చౌక వడ్డీ రేట్లతో భారీగా లభిస్తున్న నిధులు కారణమైనట్లు రీసెర్చ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది కొనసాగితే మార్కెట్లు మరింత పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది. అయితే పెట్టుబడుల ట్రెండ్ యూటర్న్ తీసుకుంటే.. మార్కెట్లు పతనమయ్చే చాన్స్ కూడా ఉన్నదని తెలియజేసింది. (రికవరీ అంచనాలను మించుతోంది: ఆర్బీఐ) అప్రమత్తత అవసరం ప్రస్తుతం మార్కెట్లు కొంతమేర ఖరీదుగా ఉన్నట్లు బ్రోకింగ్ సంస్థ షేర్‌ఖాన్ పేర్కొంది. 22- 23 రెట్లు పీఈ(అధిక విలువ)లో కదులుతున్నట్లు తెలియజేసింది. ఫలితంగా మార్కెట్లలో కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్ట్ చేయడం మేలని బ్రోకింగ్ సంస్థలు సూచించాయి. ప్రధానంగా ఫార్మా, ఐటీ, ఇంజినీరింగ్, ఎన్బీఎఫ్సీ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని షేర్‌ఖాన్ అభిప్రాయపడింది. రీసెర్చ్ సంస్థల పెట్టుబడి సలహాలు పరిశీలిద్దాం.. బంధన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 20 శాతం వాటాతో మైక్రో ఫైనాన్స్ విభాగం(ఎంఎఫ్ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా వాటాను సొంతం చేసుకుంది. కార్యకలాపాల వృద్ధితో బ్యాలన్స్‌షీట్‌ను పటిష్ట పరచుకుంది. 2 కోట్ల కస్టమర్లు, రూ. 76,000 కోట్ల లోన్‌బుక్‌ను కలిగి ఉంది. గృహ ఫైనాన్స్ విలీనం తదుపరి లోన్‌బుక్‌లో మార్టిగేజ్ విభాగం వాటా 26 శాతానికి చేరింది. రానున్న ఐదేళ్ల కాలంలో పూర్తిస్థాయి బ్యాంకింగ్ సౌకర్యాల ద్వారా మధ్య, తక్కువస్థాయి ఆదాయ గ్రూప్‌లో పట్టుసాధించాలని ప్రణాళికలు వేసింది. బిర్లా కార్పొరేషన్ దేశీ సిమెంట్ పరిశ్రమలో 4.2 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ప్రధానంగా మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మార్కెట్లలో పట్టుసాధించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోనూ పటిష్ట కార్యకలాపాలు కలిగి ఉంది. సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించే ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతమున్న 15.6 ఎంటీపీఏ సామర్థ్యాన్ని 2025కల్లా 25 ఎంటీపీఏకు పెంచుకోవాలని చూస్తోంది. హెచ్‌యూఎల్ ఎఫ్ఎంసీజీ రంగంలో పలు విభాగాలలో మార్కెట్ లీడర్‌గా నిలుస్తోంది. 70 లక్షలకుపైగా ఔట్లెట్లతో విస్తృత పంపిణీ నెట్వర్క్ కంపెనీ సొంతం. రుణ రహితమేకాకుండా రూ. 5,100 కోట్లకుపైగా నగదు నిల్వలు కలిగి ఉంది. ఇటీవలే జీఎస్కే కన్జూమర్ బిజినెస్‌ను చేజిక్కించుకుంది. తద్వారా రానున్న రెండు, మూడేళ్లలో మరింత లబ్ది పొందనుంది. 2020 సెప్టెంబర్‌కల్లా హైజీన్ విభాగంలో 100 ఎస్‌కేయూలను ప్రవేశపెట్టింది. వీటికితోడు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార బ్రాండ్లు సగటున 10 శాతం వృద్ధిని చూపుతున్నాయి. - హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదిక హాకిన్స్ కుకర్స్ ప్రధానంగా ప్రెజర్ కుకర్స్, కుక్వేర్ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ రంగంలోని పోటీ కంపెనీలతో పోలిస్తే ఆదాయంలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది. మార్కెట్ వాటాను పెంచుకుంటూ వస్తోంది. వంటగ్యాస్ కనెక్షన్లు పెరగడం, కంపెనీకున్న బ్రాండ్ ప్రాచుర్యం, విస్తృత నెట్వర్క్ వంటి అంశాల రీత్యా భవిష్యత్‌లోనూ పటిష్ట అమ్మకాలు సాధించే వీలుంది. కోవిడ్-19 నేపథ్యంలో కిచెన్ ప్రొడక్టులకు పెరిగిన డిమాండ్ కంపెనీకి మేలు చేయనుంది. వర్ల్‌పూల్ ఇండియా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు తదితర పలు వైట్‌గూడ్స్ ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తోంది. అంతేకాకుండా చిన్నతరహా అప్లయెన్సెస్‌ను సైతం రూపొందిస్తోంది. దేశ, విదేశీ మార్కెట్లో వీటిని మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు ప్రొడక్టులకు దేశీ మార్కెట్లలో అధిక అవకాశాలున్నాయి. మరోవైపు అధిక డిమాండ్ కనిపిస్తున్న వాటర్ ప్యూరిఫయర్, ఏసీలు, కిచెన్ చిమ్నీల తయారీలోకీ ప్రవేశించింది. సుప్రసిద్ధ బ్రాండ్కావడం, విస్తార పంపిణీ నెట్వర్క్, పటిష్ట పోర్ట్‌ఫోలియో, సామర్థ్య విస్తరణ వంటి అంశాలు కంపెనీ బలాలుగా చెప్పవచ్చు. రాడికో ఖైతాన్ ఐఎంఎఫ్ఎల్ తయారీకి దేశీ సంస్థలలో ముందు వరుసలో నిలుస్తోంది. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కలిగి ఉంది. మ్యాజిక్ మొమెంట్స్ వోడ్కా, 8 పీఎం ప్రీమియం బ్లాక్ విస్కీ తదితర బ్రాండ్లు సుప్రసిద్ధం. సెప్టెంబర్ క్వార్టర్(క్యూ2)లో పోటీ సంస్థల ఆదాయాలు క్షీణతను నమోదు చేసినప్పటికీ అమ్మకాలలో 11 శాతం వృద్ధిని సాధించడం గమనించదగ్గ అంశం. కొత్త ప్రొడక్టుల విడుదల, మార్కెట్ వాటాను పెంచుకుంటుండటం, ప్రీమియం బ్రాండ్లపై దృష్టి, విస్తృత పంపిణీ నెట్వర్క్ వంటి అంశాలు కంపెనీకి మద్దతిస్తున్నాయి. - అమర్జీత్ మౌర్య, ఏవీపీ(మిడ్‌క్యాప్స్), ఏంజెల్ బ్రోకింగ్ (గమనిక: ఇవి రీసెర్చ్ సంస్థల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దిగేముందు సంబంధిత నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి) -
బేర్ మార్కెట్లోనూ ఈ షేర్లు బాగుబాగు!
కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దన్నుగా కేంద్ర బ్యాంకులు ప్యాకేజీలను అమలు చేస్తుంటే.. వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డవున్ అమలుతోపాటు.. పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్చిలో కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఏప్రిల్‌లో రివ్వున పైకెగశాయి. తదుపరి 45 రోజులుగా ఒక రోజు పెరిగితే.. మరుసటి రోజు నీరసిస్తూ ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో చార్టుల ఆధారంగా రీసెర్చ్ సంస్థలు పెట్టుబడికి వీలైన 5 స్టాక్స్ సిఫారసు చేస్తున్నాయి. సాంకేతిక అంశాల ఆధారంగా వీటిని సూచిస్తున్నాయి. కాగా.. గతంలో మార్కెట్ల పతనం నుంచి వినియోగం, ఐటీ రంగాలు వేగంగా బౌన్స్‌బ్యాక్ సాధిస్తుండేవని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు విభిన్నంగా కనిపిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. 2008-09లో ఫైనాన్షియల్ సవాళ్లతో మార్కెట్లు పతనంకాగా.. ప్రస్తుతం కోవిడ్-19తో అనారోగ్య సమస్యలు ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. ఇతర వివరాలు చూద్దాం.. పరిస్థితులు వేరు కోవిడ్-19 మరింత కాలం సమస్యలు సృష్టించే అవకాశముందంటున్నారు యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పల్వియా. దీంతో జీవితాల్లో వచ్చిన మార్పులను పోలి మార్కెట్ల ఔట్లుక్ మారిపోయినట్లు పేర్కొన్నారు. టెలికం, హెల్త్‌కేర్, పరిశుభ్రత వంటి రంగాలు వెలుగులోకి రాగా, లీజర్ ట్రావెల్ వంటివి ప్రాధాన్యత కోల్పోయినట్లు చెబుతున్నారు. సొంత వాహనాలలో ప్రయాణాలకు మొగ్గు చూపడంతో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ పెరగనుందని అభిప్రాయపడ్డారు. కాగా.. గత పతనాలను పరిగణిస్తే.. అధికంగా దెబ్బతిన్న రంగాలే వేగంగా కోలుకున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ పేర్కొంటున్నారు. మెటల్స్, రియల్టీ, పవర్, పీఎస్‌యూ వంటి సైక్లికల్ రంగాలతోపాటు.. ఫార్మా వంటి రక్షణాత్మక రంగాలకు డిమాండ్ పుట్టవచ్చని అంచనా వేశారు. ఇక రీసెర్చ్ నిపుణులు సిఫారసు చేస్తున్న స్టాక్స్‌ను చూద్దాం.. హెచ్‌యూఎల్ షేరు ధర, కాలావధి రీత్యా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) 8 వారాల దిద్దుబాటు దశను పూర్తిచేసుకుంది. దీంతో కొద్ది రోజులుగా సానుకూల ధోరణితో సైడ్‌వేస్‌లో కదులుతోంది. కనిష్టాల వద్ద భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఈ కౌంటర్ సానుకూల పుల్‌బ్యాక్‌ను సాధించింది. ఫలితంగా కొద్ది రోజుల్లో తిరిగి అప్‌ట్రెండ్ ప్రారంభంకావచ్చని భావిస్తున్నాం. ఈ కౌంటర్లో లాంగ్ పొజిషన్లు తీసుకున్న ఇన్వెస్టర్లు రూ. 2450 టార్గెట్ ధర కోసం వేచిచూడవచ్చు. అయితే రూ. 1850 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవలసి ఉంటుంది. ఇన్ఫోసిస్ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ కౌంటర్లో దీర్ఘకాలంగా జరుగుతున్న కన్సాలిడేషన్తోపాటు షేరు ధరలో పెరుగుదల లేకపోవడంతో కాలానుగుణ దిద్దుబాటు జరిగినట్లు కనిపిస్తోంది. రూ. 630-640 ధరల శ్రేణిలో పలుమార్లు మద్దతు(సపోర్ట్) కూడగట్టుకుంది. వెరసి ప్రస్తుత స్థాయిలో రిస్క్రివార్డ్ నిష్పత్తి సానుకూలంగా కనిపిస్తోంది. రోజువారీ ఆర్ఎస్ఐ 60 స్థాయికి ఎగువన నిలవడం బుల్లిష్ ధోరణిని సూచిస్తోంది. రూ. 830 టార్గెట్ ధరతో లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 620 వద్ద స్టాప్‌లాస్ అమలు చేయడం మేలు. సన్ ఫార్మా గత వారం రూ. 515 వద్ద నమోదైన గరిష్టాల నుంచి హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మా కౌంటర్లో దిద్దుబాటును చవిచూసింది. ఫలితంగా దీర్ఘకాలిక సగటుల నుంచి రీట్రేస్మెంట్ జరిగింది. ప్రస్తుతం ఫార్మా రంగం పటిష్ట అప్‌ట్రెండ్‌లో ఉంది. హైయర్ హైలతోపాటు, హైయర్ బాటమ్ ఏర్పడటం ద్వారానెల వారీ చార్టులు రానున్న రోజుల్లో మరింత పుంజుకునే వీలున్నట్లు సంకేతిస్తున్నాయి. రోజువారీ చార్టులు సైతం అధిక ట్రేడింగ్ పరిమాణంతో 34 నెలల సగటును అధిగమించినట్లు స్పష్టం చేస్తు న్నాయి. దీంతో రూ. 590 టార్గెట్ ధరతో ఈ కౌంటర్లో లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 415 దిగువన స్టాప్‌లాస్ పెట్టుకోవలసి ఉంటుంది. - వికాస్ జైన్, సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు, రిలయన్స్ సెక్యూరిటీస్ డీమార్ట్ డీమార్ట్ బ్రాండ్ రిటైల్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కౌంటర్ హయ్యర్ టాప్స్, బాటమ్స్‌ను సాధిస్తూ వస్తోంది. నెలవారీ చార్టుల ప్రకారం ఈ స్టాక్ అప్‌సైడ్ ట్రెండ్‌లో ఉంది. సానుకూల సంకేతాలతో అప్ స్లోపింగ్ చానల్‌ను నమోదు చేస్తోంది. సాంకేతికంగా కీలకమైన 50, 100, 200 రోజుల చలన సగటుల ఎగువన కదులుతోంది. ఇవన్నీ రానున్న రోజుల్లో డీమార్ట్ కౌంటర్ మరింత బలపడేందుకు వీలున్నట్లు సూచిస్తున్నాయి. ఎయిర్టెల్ మొబైల్ సేవల దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కౌంటర్ రూ. 500 స్థాయిలో 13ఏళ్ల కన్సాలిడేషన్ శ్రేణిని అధిగమించింది. అంతేకాకుండా ఈ స్థాయికి ఎగువనే నిలదొక్కుకుంటోంది. అదికూడా భారీ ట్రేడింగ్ పరిమాణంతో బ్రేకవుట్ సాధించింది. వెరసి సాంకేతికంగా కీలకమైన 50, 100, 200 రోజుల చలన సగటులకు ఎగువన కదులుతోంది. తద్వారా రానున్న రోజుల్లో మరింత పుంజుకునే వీలున్నట్లు గోచరిస్తోంది. - రాజేష్ పల్వియా, టెక్నికల్, డెరివేటివ్ రీసెర్చ్ హెడ్, యాక్సిస్ సెక్యూరిటీస్ -
హెడల్ బర్గ్, సాగర్ సిమెంట్స్ బై: బ్రోకరేజ్‌ల స్టాక్ సిఫార్సులు
కరోనా దాటికి కుదేలైన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. గత వారం రోజులుగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ సమయంలో షేర్ల కొనుగోలు విక్రయాల విషయంలో తొందరపాటు లేకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని చెబుతూ..కొన్ని షేర్లను కొనుగోలు చేయవచ్చని బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: హెడల్ బర్గ్ సిమెంట్ బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠీ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.207 ప్రస్తుత ధర: రూ.172 బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ హెడల్‌బర్గ్ సిమెంట్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.207గా నిర్ణయించింది.ఈ కంపెనీ పనితీరు బావుందని చెబుతూ.. కంపెనీకి దృడమైన నెట్ డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ ఉందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. భవిష్యత్తులో మూల ధన నియంత్రణ సామర్థ్యం బాగా పెరుగుతాయని చెబుతూ ఈ షేరును కొనవచ్చని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.172.75 గా ఉంది. కంపెనీ పేరు: చోళమండళమ్ ఇన్వెస్ట్మెంట్ బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర : రూ.225 ప్రస్తుత ధర: రూ.145 హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ చోళమండళమ్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.225గా నిర్ణయించింది. బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీలలో లిక్విడిటీ, టర్మ్ ఫండింగ్‌లో ఈ కంపెనీ స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. మూల ధనం, రుణాలు పెంచుకునే విషయంలో ఈ కంపెనీ స్థితిగతులకు బావున్నాయని అందువల్ల ఈ షేరు కొనవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కోంది.కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.145.35 గా ఉంది. కంపెనీ పేరు:భారత్ పెట్రోలియం బ్రోకరేజ్ సంస్థ: నోమురా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.390 ప్రస్తుత ధర: రూ.369 భారత్ పెట్రోలియం షేరుకు బ్రోకరేజ్ సంస్థ బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.390 గా నిర్ణయించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక అంచనాలను మించి ఫలితాలను వచ్చాయని నోమురా తెలిపింది.కోవిడ్-19 కారణంగా ఆర్థిక సంవత్సరం 2020-21లో పెట్టుబడులు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రైవేటీరణ ఒక ముఖ్యమైన ఉత్ప్రేరకంగా ఉంటుందని వెల్లడించింది. కాగా బీఎస్ఈలో ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర రూ.369.90 గా ఉంది. కంపెనీ పేరు: సాగర్ సిమెంట్స్ బ్రోకరేజ్ సంస్థ: యస్ సెక్యూరిటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.476 ప్రస్తుత ధర: రూ.333 బ్రోకరేజ్ సంస్థ యస్ సెక్యూరిటీస్ సాగర్ సిమెంట్స్‌కు బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.476గా నిర్ణయించింది. కోవిడ్-19 వల్ల ఏర్పడిన అంతరాయాలనుంచి సెప్టెంబర్ తర్వాతే సాగర్ సిమెంట్స్ సాధారణ స్థితి చేరుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. లాక్డౌన్లో కొన్ని సడలింపుల ఇవ్వడం వల్ల సిమెంట్స్ వినియోగం 30 శాతం పెరిగిందని ,ఇకముందు ఇంకా పుంజుకుంటుందని చెబుతూ ఈ షేరును కొనవచ్చని పేర్కొంది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.333.05 గా ఉంది. కంపెనీ పేరు: కేఈఐ ఇండస్ట్రీస్ బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠీ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.411 ప్రస్తుత ధర: రూ.352 బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ కేఈఐ ఇండస్ట్రీస్‌పై పాజిటివ్‌గా స్పందిస్తూ షేరుకు బయ్రేటింగ్ను ఇచ్చింది.టార్గెట్ ధరను రూ.411గా నిర్ణయించింది. ఈ కంపెనీ కేబుల్స్ ఆర్డర్లు బాగున్నాయని, వివిధ రకాల కస్టమర్లతో బలమైన బ్యాలెన్స్ షీట్ కలిగిందని చెబుతూ ఈ షేరును కొనవచ్చని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.352.10 గా ఉంది. -
కొటక్ మహీంద్రా ,ఇన్ఫోసిస్‌లపై ఫోకస్
క్యూ4 ఫలితాలు: డాబర్, హెరిటేజ్ ఫుడ్స్, ఇండియా గ్రిడ్ ట్రస్ట్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్, కంప్యూకమ్ సాఫ్ట్వేర్, సన్ ఫార్మాసూటికల్స్, క్వెస్ కార్పొరేషన్, జేపీ అసోసియేట్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వైభవ్ గ్లోబల్ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించనున్నాయి. కొటక్‌మహీంద్రా బ్యాంక్: రూ.7,500 కోట్ల నిధులు సమీకరించేందుకు కొటక్ మహీంద్రా బ్యాంక్ క్వాలిఫైడ్ ఇన్స్టీట్యూషనల్ ప్లేస్మెంట్ ఆఫర్‌ను ప్రకటించింది.ఇందులో భాగంగా ఒక్కో షేరు ధరను రూ.1,147.75 గా నిర్ణయించింది. బ్లూడార్ట్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.30.57 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది.అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.12.24 కోట్లుగా ఉందని బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో బ్లూడార్ట్ తెలిపింది. పీఎఫ్సీ: రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టుకు సంబంధించి నర్మదా బేసిన్ ప్రాజెక్ట్స్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) తెలిపింది. న్యూజెన్ సాఫ్ట్వేర్: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 34 శాతం పడిపోయి రూ.41.5 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.62.5 కోట్లుగా ఉంది. దీపక్ నైట్రైట్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 88 శాతం పెరిగి రూ.172.3 కోట్లకు చేరిందని దీపక్ నైట్రేడ్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.91.46 కోట్లుగా ఉందని బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇన్ఫోసిస్: డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ఎండ్టుఎండ్ వెల్త్ మేనేజ్మెంట్ సామర్థ్యాలను అందించేందుకు అవాల్క్ కంపెనీతో బాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 96 శాతం క్షీణించి రూ.6.67 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.199.91 కోట్లుగా నమోదైంది. టొరంట్ ఫార్మాసూటికల్స్: కన్సాలిడేటెడ్ నికర లాభం క్యూ4లో రూ.314కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. జయప్రకాశ్ పవర్ వెంచర్స్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.70.91 కోట్లకు తగ్గినట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం 245.30 కోట్లుగా ఉంది. -
అజంతా, అలెంబిక్ ఫార్మా బై: బ్రోకరేజ్‌ల రికమెండేషన్లు
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాలని చెబుతూ.. కొన్ని షేర్లను బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సులు చేస్తున్నాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రేటింగ్: మరిన్ని కొనవచ్చు టార్గెట్ ధర:రూ.1800 ప్రస్తుత ధర: రూ.1783 బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎల్అండ్ టీ ఇన్ఫోటెక్ షేర్లను మరిన్ని కొనవచ్చని చెబుతూ టార్గెట్ ధరను రూ.1800 గా నిర్ణయించింది. పటిష్టమైన పోర్ట్పోలియోతోపాటు, అగ్రఖాతాలలో స్థిరత్వం ఉన్నందున ఈ షేర్లను కొనుక్కోవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు ధర రూ.1783.25 గా ఉంది. కంపెనీ పేరు: అలెంబిక్ ఫార్మా బ్రోకరేజ్ సంస్థ:యస్ సెక్యూరిటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.1100 ప్రస్తుత ధర: రూ.897 అలెంబిక్ ఫార్మా షేరుకు బ్రోకరేజ్ సంస్థ బైరేటింగ్ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.11000గా నిర్ణయించింది. ఈ కంపెనీకు ఆదాయం బాగానే వస్తుందని, టొరంట్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీ కంటే అధికంగా డిస్కౌంట్లు ఇచ్చి వ్యాపారం చేస్తోంది. అందువల్ల ఈ షేరును కొనవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెని షేరు ధర రూ. 897.50గా ఉంది. కంపెనీ పేరు: అజంతా ఫార్మా బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.1700 ప్రస్తుత ధర: రూ.1,510 బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అజంతా ఫార్మా షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ, టార్గెట్ ధరను రూ.1700 గా నిర్ణయించింది. అజంతా ఫార్మా ప్రధాన క్యాపెక్స్ కార్యక్రమం ఆర్థిక సంవత్సరం-21లో ముగుస్తుంది.నిర్వహణ క్యాపెక్స్ ఆర్థిక సంవత్సరం-22లో అవసరమని ఇది సంస్థకు ఉచిత నగదు ప్రవాహాన్ని సూచిస్తుందని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.1,510.30 గా ఉంది. కంపెనీ పేరు: ఆల్ట్రా టెక్ సిమెంట్ బ్రోకరేజ్ సంస్థ: యస్ సెక్యూరిటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.4413 ప్రస్తుత ధర: రూ.3,638 బ్రోకరేజ్ సంస్థ యస్ సెక్యూరిటీస్ ఆల్ట్రా టెక్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ, టార్గెట్ ధరను రూ.4413గా నిర్ణయించింది. ఆల్ట్రాటెక్ సిమెంట్‌కు చెందిన సెంచురీ టెక్స్టైల్స్ వినియోగం క్యూ4లో 83 శాతం పెరిగిందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.3,638.40 గా ఉంది. కంపెనీ పేరు: బజాజ్ ఆటో బ్రోకరేజ్ సంస్థ: ఎమ్కే గ్లోబల్ రేటింగ్: హోల్డ్ టార్గెట్ ధర: రూ.2629 ప్రస్తుత ధర: రూ.2,552 బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల బజాజ్ ఆటో షేరు రేటింగ్‌ను హోల్డ్‌లో ఉంచుతూ టార్గెట్ ధరను రూ.2629 గా నిర్ణయించింది. త్రీవీలర్ డిమాండ్, ఎగుమతుల అధిక మార్జిన్ అవకాశాలు తగ్గుతాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. త్రీవీలర్ ధరల పెరుగుదల దేశీయ డిమాండ్‌పై పడుతుందని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు ధర రూ.2,552.75 గా ఉంది. -
స్వల్పకాలంలో 13శాతం ర్యాలీ చేసే 3స్టాక్‌లు ఇవే..!
స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్ప గ్యాప్ అప్‌తో మొదలైంది. అయితే ప్రారంభంలో అనూహ్య కొనుగోళ్లతో సూచీలు భారీ లాభాల్ని మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ ఒకదశలో 400 పాయింట్ల లాభపడి 30,596.17 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 9వేల స్థాయిని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ సాంకేతిక నిపుణుడు షితిజ్ గాంధీ 3 స్టాక్‌లకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించారు. ఈ మూడు షేర్లు స్వల్పకాలంలో 13శాతం వరకు ర్యాలీ చేయవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. షేరు పేరు: మారికో బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.354 స్టాప్ లాస్: 285 అప్‌సైడ్: 13.40శాతం విశ్లేషణ: ఈ స్టాక్ డైలీ చార్టులలో హయ్యర్ హై.., హయ్యర్ బాటమ్ ఫార్మాషన్ ఏర్పాటుతో ట్రేడ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా షేరు 100 రోజులు ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.306 వద్ద, అలాగే 200 రోజులు ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.323 మధ్య కన్సాలిడేట్ అవుతోంది. బోర్డర్ స్ట్రక్చర్‌పై..., స్టాక్ డైలీ ఛార్ట్‌లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ నమూనా ఏర్పాటు చేసింది. ప్యాట్రన్ ఫార్మేషన్ నెక్‌లైన్‌పై తాజా బ్రేక్ అవుట్ అంచనా ఉంది. అదనంగా, మూమెంటమ్ ఇండికేటర్స్, ఓసిలేటర్స్ డైలీ, వీక్లీ స్కేల్ పై సానుకూల సంకేతాలను సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.285 స్టాప్‌లాస్‌గా పెట్టుకొని రూ.354 టార్గెట్ ధరగా రూ.310-312 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. షేరు పేరు: గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడెక్ట్స్ బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.627 స్టాప్ లాస్: రూ.505 అప్‌సైడ్: 12.77శాతం విశ్లేషణ: రూ.485 వద్ద సపోర్ట్ తీసుకున్న తర్వాత, షేరు వీ-ఆకారపు రీకవరీని తీసుకుంది. మరోసారి రూ.550 ధరను అధిగమించిన తర్వాత వెనక్కి వచ్చింది.ప్రస్తుత దశలో, ఈ స్టాక్ డైలీ చార్టులలో హెడ్ అండ్ షోల్డర్ ప్యాట్రన్స్‌ను ఏర్పాటు చేసింది. స్వల్ప హయ్యర్ వాల్యూమ్‌లతో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది స్టాక్స్‌లో లాంగ్-బిల్డప్ నిర్మాణాన్ని సూచిస్తుంది. షేరు ధరలో తరువాత అప్స్వింగ్ ఉంటుందని మూమెంటమ్ ఓసిలేటర్లు సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.505 స్టాప్‌లాస్‌గా పెట్టుకొని రూ.627 టార్గెట్ ధరగా రూ.రూ.550-553 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. షేరు పేరు: భారతి ఇన్ఫ్రాటెల్ బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.240 స్టాప్ లాస్: 185 అప్‌సైడ్: 11.63శాతం విశ్లేషణ: సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాట్రన్కు పైన బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత షేరులో తదుపరి కొనుగోళ్లను చూస్తున్నాము. ఈ వారం, స్టాక్ డైలీ ఇంటర్వెల్లో 100రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ట్రేడైంది. ఇది ధరలలో స్వల్పకాలిక రివర్సల్‌ను, రాబోయే సెషన్లలో మరింత అప్‌సైడ్ ట్రెండ్‌ను సూచిస్తుంది. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.185 స్టాప్‌లాస్‌గా పెట్టుకొని రూ.240 టార్గెట్ ధరగా రూ.రూ.205-210 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. -
విదేశీ సంకేతాలవైపు చూపు...
న్యూఢిల్లీ: దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం విదేశీ పరిణామాలే కీలకంగా నిలవనున్నాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇరాక్- అమెరికా, ఉక్రెయిన్-రష్యా మధ్య గత వారంలో ఏర్పడ్డ యుద్ధ మేఘాలు, వాటి పరిణామాలు వంటి అంశాలు ఈ వారం దేశీ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని తెలిపారు. మరోవైపు దేశీయ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికల తీరు కూడా కీలకం కానున్నాయని వివరించారు. కాగా, విదేశీ పరిణామాలకు అనుగుణంగా కదులుతున్న ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నదని చెప్పారు. దేశీయ చమురు అవసరాల్లో 80% వరకూ దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల కదలికలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలిపారు. అక్కడక్కడే... ప్రాధాన్యత కలిగిన అంశాలేవీ లేని కారణంగా ఈ వారం ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ అక్కడక్కడే సంచరించే అవకాశమున్నదని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. వెరసి రానున్న సెషన్లలో నిఫ్టీకి 7,750 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనున్నదని చెప్పారు. ఈ స్థాయికి ఎగువన కొనుగోళ్లు పుంజుకోగలవని అంచనా వేశారు. గడిచిన శుక్రవారం దేశీ మార్కెట్లకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు అయినప్పటికీ, ఆ రోజు ప్రధాని చేసిన ప్రసంగాన్ని ట్రేడర్లు నిశితంగా పరిశీలిస్తారని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌధరి చెప్పారు. ఈ ప్రసంగం ద్వారా మోడీ భవిష్యత్‌లో చేపట్టబోయే సంస్కరణల ప్రణాళికలను మార్కెట్లు అంచనా వేస్తాయన్నారు. బిజినెస్‌కు స్నేహపూర్వక వాతావరణం బిజినెస్‌కు స్నేహ పూర్వక వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు మోడీ ప్రసంగం స్పష్టం చేసిందని జిగ్నేష్ చెప్పారు. శుక్రవారం మోడీ ప్రకటించిన ఆర్థిక ఎజెండాలో తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన విషయం విదితమే. దీనిలో భాగంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను దేశీ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. తద్వారా మేడిన్ ఇండియా విజన్‌ను ఆవిష్కరించారు. దీంతోపాటు పేదప్రజలకూ అభివృద్ధిలో భాగాన్ని కల్పించేలా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రణాళికలను ప్రకటించారు. ఈ అంశాలతోపాటు, విదేశీ సంకేతాలను కూడా ఇన్వెస్టర్లు పరిగణిస్తారని అత్యధిక శాతంమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆందోళనలు కాస్త ఉపశమించడంతో గత వారం చివర్లో చమురు ధరలు తగ్గడంతోపాటు, దేశీ మార్కెట్లు పురోగమించాయి. పరిస్థితులు కుదురుకుంటే... ఇరాక్, ఉక్రెయిన్, మధ్యప్రాచ్యాలలో తలెత్తిన ఆందోళనలు మరింత తగ్గుముఖంపడితే సెంటిమెంట్‌కు జోష్ లభిస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరి హద్దులవద్ద రష్యా యుద్ధ విమానాలు కవాతులు నిలి పివేయడం, మరో ఐదు రోజులమేర కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఒప్పందం కుదరడం వంటి అంశాలతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. వారం మొత్తంమీద సెన్సెక్స్ 774 పాయింట్లు ఎగసి 26,103 పాయింట్ల వద్ద నిలవగా, నిఫ్టీ సైతం 223 పాయింట్లు జమ చేసుకుని 7,792 పాయింట్ల వద్ద స్థిరపడింది.