కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దన్నుగా కేంద్ర బ్యాంకులు ప్యాకేజీలను అమలు చేస్తుంటే.. వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డవున్ అమలుతోపాటు.. పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్చిలో కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఏప్రిల్‌లో రివ్వున పైకెగశాయి. తదుపరి 45 రోజులుగా ఒక రోజు పెరిగితే.. మరుసటి రోజు నీరసిస్తూ ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో చార్టుల ఆధారంగా రీసెర్చ్ సంస్థలు పెట్టుబడికి వీలైన 5 స్టాక్స్ సిఫారసు చేస్తున్నాయి. సాంకేతిక అంశాల ఆధారంగా వీటిని సూచిస్తున్నాయి. కాగా.. గతంలో మార్కెట్ల పతనం నుంచి వినియోగం, ఐటీ రంగాలు వేగంగా బౌన్స్‌బ్యాక్ సాధిస్తుండేవని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు విభిన్నంగా కనిపిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. 2008-09లో ఫైనాన్షియల్ సవాళ్లతో మార్కెట్లు పతనంకాగా.. ప్రస్తుతం కోవిడ్-19తో అనారోగ్య సమస్యలు ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. ఇతర వివరాలు చూద్దాం..
పరిస్థితులు వేరు
కోవిడ్-19 మరింత కాలం సమస్యలు సృష్టించే అవకాశముందంటున్నారు యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పల్వియా. దీంతో జీవితాల్లో వచ్చిన మార్పులను పోలి మార్కెట్ల ఔట్‌లుక్ మారిపోయినట్లు పేర్కొన్నారు. టెలికం, హెల్త్‌కేర్, పరిశుభ్రత వంటి రంగాలు వెలుగులోకి రాగా, లీజర్ ట్రావెల్ వంటివి ప్రాధాన్యత కోల్పోయినట్లు చెబుతున్నారు. సొంత వాహనాలలో ప్రయాణాలకు మొగ్గు చూపడంతో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ పెరగనుందని అభిప్రాయపడ్డారు. కాగా.. గత పతనాలను పరిగణిస్తే.. అధికంగా దెబ్బతిన్న రంగాలే వేగంగా కోలుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ పేర్కొంటున్నారు. మెటల్స్, రియల్టీ, పవర్, పీఎస్‌యూ వంటి సైక్లికల్ రంగాలతోపాటు.. ఫార్మా వంటి రక్షణాత్మక రంగాలకు డిమాండ్ పుట్టవచ్చని అంచనా వేశారు. ఇక రీసెర్చ్ నిపుణులు సిఫారసు చేస్తున్న స్టాక్స్‌ను చూద్దాం..
హెచ్‌యూఎల్
షేరు ధర, కాలావధి రీత్యా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) 8 వారాల దిద్దుబాటు దశను పూర్తిచేసుకుంది. దీంతో కొద్ది రోజులుగా సానుకూల ధోరణితో సైడ్‌వేస్‌లో కదులుతోంది. కనిష్టాల వద్ద భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఈ కౌంటర్ సానుకూల పుల్‌బ్యాక్‌ను సాధించింది. ఫలితంగా కొద్ది రోజుల్లో తిరిగి అప్‌ట్రెండ్ ప్రారంభంకావచ్చని భావిస్తున్నాం. ఈ కౌంటర్లో లాంగ్ పొజిషన్లు తీసుకున్న ఇన్వెస్టర్లు రూ. 2450 టార్గెట్ ధర కోసం వేచిచూడవచ్చు. అయితే రూ. 1850 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవలసి ఉంటుంది.
ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ కౌంటర్లో దీర్ఘకాలంగా జరుగుతున్న కన్సాలిడేషన్‌తోపాటు షేరు ధరలో పెరుగుదల లేకపోవడంతో కాలానుగుణ దిద్దుబాటు జరిగినట్లు కనిపిస్తోంది. రూ. 630-640 ధరల శ్రేణిలో పలుమార్లు మద్దతు(సపోర్ట్) కూడగట్టుకుంది. వెరసి ప్రస్తుత స్థాయిలో రిస్క్‌రివార్డ్ నిష్పత్తి సానుకూలంగా కనిపిస్తోంది. రోజువారీ ఆర్‌ఎస్‌ఐ 60 స్థాయికి ఎగువన నిలవడం బుల్లిష్ ధోరణిని సూచిస్తోంది. రూ. 830 టార్గెట్ ధరతో లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 620 వద్ద స్టాప్‌లాస్ అమలు చేయడం మేలు.
సన్ ఫార్మా
గత వారం రూ. 515 వద్ద నమోదైన గరిష్టాల నుంచి హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మా కౌంటర్‌లో దిద్దుబాటును చవిచూసింది. ఫలితంగా దీర్ఘకాలిక సగటుల నుంచి రీట్రేస్‌మెంట్ జరిగింది. ప్రస్తుతం ఫార్మా రంగం పటిష్ట అప్‌ట్రెండ్‌లో ఉంది. హైయర్ హైలతోపాటు, హైయర్ బాటమ్ ఏర్పడటం ద్వారానెల వారీ చార్టులు రానున్న రోజుల్లో మరింత పుంజుకునే వీలున్నట్లు సంకేతిస్తున్నాయి. రోజువారీ చార్టులు సైతం అధిక ట్రేడింగ్ పరిమాణంతో 34 నెలల సగటును అధిగమించినట్లు స్పష్టం చేస్తు న్నాయి. దీంతో రూ. 590 టార్గెట్ ధరతో ఈ కౌంటర్లో లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 415 దిగువన స్టాప్‌లాస్ పెట్టుకోవలసి ఉంటుంది.
- వికాస్ జైన్, సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు, రిలయన్స్ సెక్యూరిటీస్
డీమార్ట్
డీమార్ట్ బ్రాండ్ రిటైల్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కౌంటర్ హయ్యర్ టాప్స్, బాటమ్స్‌ను సాధిస్తూ వస్తోంది. నెలవారీ చార్టుల ప్రకారం ఈ స్టాక్ అప్‌సైడ్ ట్రెండ్‌లో ఉంది. సానుకూల సంకేతాలతో అప్ స్లోపింగ్ చానల్‌ను నమోదు చేస్తోంది. సాంకేతికంగా కీలకమైన 50, 100, 200 రోజుల చలన సగటుల ఎగువన కదులుతోంది. ఇవన్నీ రానున్న రోజుల్లో డీమార్ట్ కౌంటర్ మరింత బలపడేందుకు వీలున్నట్లు సూచిస్తున్నాయి.
ఎయిర్‌టెల్
మొబైల్ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కౌంటర్ రూ. 500 స్థాయిలో 13ఏళ్ల కన్సాలిడేషన్ శ్రేణిని అధిగమించింది. అంతేకాకుండా ఈ స్థాయికి ఎగువనే నిలదొక్కుకుంటోంది. అదికూడా భారీ ట్రేడింగ్ పరిమాణంతో బ్రేకవుట్ సాధించింది. వెరసి సాంకేతికంగా కీలకమైన 50, 100, 200 రోజుల చలన సగటులకు ఎగువన కదులుతోంది. తద్వారా రానున్న రోజుల్లో మరింత పుంజుకునే వీలున్నట్లు గోచరిస్తోంది.
- రాజేష్ పల్వియా, టెక్నికల్, డెరివేటివ్ రీసెర్చ్ హెడ్, యాక్సిస్ సెక్యూరిటీస్
Comments
Please login to add a commentAdd a comment