technical analysis wing
-
విద్రోహచర్య కారణంగానే భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం !
న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అక్టోబర్ 11న జరిగిన మైసూర్–దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర దాగి ఉందని ముగ్గురుసభ్యుల రైల్వే సాంకేతిక బృందం అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన చోట పట్టాలకు ఎలాంటి బోల్ట్‌లు లేకపోవడం, పట్టాలను ఎవరో బలవంతంగా అపసవ్య దిశలోకి సుత్తితో కొట్టిన గుర్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 15 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడిన విషయం తెల్సిందే. సవ్యదిశలో నేరుగా వెళ్లాల్సిన రైలు లూప్లైన్లోకి హఠాత్తుగా వచ్చి ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొనడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. దీంతో రైల్వే సిగ్నల్, టెలికం, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ బృందం ఆదివారం కవరపేట స్టేషన్‌లోని ఘటనాస్థలిలో దర్యాప్తు మొదలెట్టింది. ‘‘రైల్వేపట్టాల ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలోని భాగాలను విడదీశారు. వీటి గురించి బాగా అవగాహన ఉన్న ఆగంతకులే ఈ పని చేశారు. ఇటీవల కవరపేట స్టేషన్ సమీపంలో ఇలాంటి దుశ్చర్యకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక్కడ మాత్రం సఫలమయ్యారు. ఘటన జరగడానికి నాలుగు నిమిషాల ముందే ఇదే పట్టాల మీదుగా ఒక రైలు వెళ్లింది. అది వెళ్లి మైసూర్–దర్భంగా రైలువచ్చేలోపే బోల్ట్‌లు, విడిభాగాలు విడతీశారు’’ అని అధికారులు వెల్లడించారు. -
Saurabh Maurya: విజయ సౌరభం
మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనేది సౌరభ్ మౌర్య కల. అయితే తన దగ్గర అమ్మ పంపించిన అయిదువేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొన్నాడు. స్టార్టప్‌లు స్టార్ట్ చేసి కోటీశ్వరుడిగా ఎదిగి, ఎంతోమందికి రోల్‌మోడల్ కావడానికి అవసరమైన ప్రయాణం ఈ సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ నుంచే మొదలైంది! ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ అనే చిన్నగ్రామంలో పుట్టి పెరిగాడు సౌరభ్ మౌర్య. పేదరికంలో ఉన్నప్పటికీ తన పిల్లలను అప్పు చేసైనా పెద్ద చదువులు చదివించాలనుకునేవాడు తండ్రి. సౌరభ్ ఇద్దరు అన్నలు చదువులో మందుండేవారు. పై చదువుల కోసం వారిని బెనారస్‌కు పంపాడు తండ్రి. మొదటి ప్రయత్నంలో ఇద్దరు ‘ఐఐటీ–జెఇఇ’లో ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు పిల్లలు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలని కలలు కనేవారు తల్లిదండ్రులు. అయితే సౌరభ్ పరిస్థితి వేరు. తనకు పెద్ద ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనేది కల. కంప్యూటర్ స్టోర్ అనేది ఆ కలలలో ఒకటి. మొదటి ప్రయత్నంలో ‘ఐఐటీ– జెఇఇ’లో ఫెయిలయ్యాడు సౌరభ్. ‘నేను ఫెయిలయ్యాను అనే బాధ కంటే తల్లిదండ్రులను బాధ పెట్టాను అనే ఆలోచన నన్ను ఎక్కువగా బాధ పెట్టింది’ అంటున్న సౌరభ్ కష్టపడి చదివి రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఐఐటీ–బెనారస్ కాలేజీలోకి వెళ్లిన తరువాత తనకొక కొత్త ప్రపంచం పరిచయం అయింది. తనలాగే ఆలోచించే ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. మరో వైపు ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నాయి. జేబు ఖర్చుల కోసం 6–8 తరగతులకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. జేబుఖర్చుల మాట ఎలా ఉన్నా పోను పోను ‘బోధన’ అనేది తనకొక ప్యాషన్‌గా మారింది. తల్లి పంపించిన అయిదువేలతో సెకండ్‌హ్యాండ్ సెల్‌ఫోన్ కొనడంతో తన కెరీర్ మొదలు పెట్టడానికి మొదటి అడుగు పడింది. కొద్దిరోజులకు యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఐఐటీ–జెఇఇ పరీక్షలో విఫలమైన తాను రెండో ప్రయత్నంలో ఎలా విజయం సాధించింది మొదలు ఐఐటీకి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ యూట్యూబ్ చానల్ ద్వారా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చానల్‌కు మంచి ఆదరణ లభించడంతో సౌరభ్‌లో ఉత్సాహం వెల్లువెత్తింది. నాలుగు సంవత్సరాల అనుభవం తరువాత స్టాక్ మార్కెట్ ట్రేడర్‌గా సక్సెస్ అయ్యాడు. ‘ఐఐటీయన్ ట్రేడర్’ పేరుతో ట్రేడింగ్ స్ట్రాటజీస్, టెక్నికల్ ఎనాలసిస్...మొదలైన ఆన్లైన్ కోర్సులు ప్రారంభించి సక్సెస్ సాధించాడు. చిన్న వ్యాపారమైనా సరే, సొంతంగా మొదలుపెడితే చాలు అనుకున్న సౌరభ్ 11–12 తరగతుల విద్యార్థులు ‘ఐఐటీ–జెఇఇ’ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన బలమైన పునాదిని ఏర్పాటు చేయడానికి ప్రారంభించిన ‘రైట్–ర్యాంకర్స్’ స్టార్టప్, ఆన్లైన్ స్టాక్‌మార్కెట్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ఐఐటీయన్ ట్రేడర్స్’ సక్సెస్ సాధించి తనను 22 కోట్ల క్లబ్‌లోకి చేర్చాయి. ‘ఏదైనా సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు డబ్బు, వనరుల కొరత ఎప్పుడూ అడ్డంకి కాదు. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి’ అంటున్నాడు 22 సంవత్సరాల సౌరభ్ మౌర్య. -
బేర్ మార్కెట్లోనూ ఈ షేర్లు బాగుబాగు!
కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దన్నుగా కేంద్ర బ్యాంకులు ప్యాకేజీలను అమలు చేస్తుంటే.. వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డవున్ అమలుతోపాటు.. పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్చిలో కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఏప్రిల్‌లో రివ్వున పైకెగశాయి. తదుపరి 45 రోజులుగా ఒక రోజు పెరిగితే.. మరుసటి రోజు నీరసిస్తూ ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో చార్టుల ఆధారంగా రీసెర్చ్ సంస్థలు పెట్టుబడికి వీలైన 5 స్టాక్స్ సిఫారసు చేస్తున్నాయి. సాంకేతిక అంశాల ఆధారంగా వీటిని సూచిస్తున్నాయి. కాగా.. గతంలో మార్కెట్ల పతనం నుంచి వినియోగం, ఐటీ రంగాలు వేగంగా బౌన్స్‌బ్యాక్ సాధిస్తుండేవని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు విభిన్నంగా కనిపిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. 2008-09లో ఫైనాన్షియల్ సవాళ్లతో మార్కెట్లు పతనంకాగా.. ప్రస్తుతం కోవిడ్-19తో అనారోగ్య సమస్యలు ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. ఇతర వివరాలు చూద్దాం.. పరిస్థితులు వేరు కోవిడ్-19 మరింత కాలం సమస్యలు సృష్టించే అవకాశముందంటున్నారు యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పల్వియా. దీంతో జీవితాల్లో వచ్చిన మార్పులను పోలి మార్కెట్ల ఔట్లుక్ మారిపోయినట్లు పేర్కొన్నారు. టెలికం, హెల్త్‌కేర్, పరిశుభ్రత వంటి రంగాలు వెలుగులోకి రాగా, లీజర్ ట్రావెల్ వంటివి ప్రాధాన్యత కోల్పోయినట్లు చెబుతున్నారు. సొంత వాహనాలలో ప్రయాణాలకు మొగ్గు చూపడంతో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ పెరగనుందని అభిప్రాయపడ్డారు. కాగా.. గత పతనాలను పరిగణిస్తే.. అధికంగా దెబ్బతిన్న రంగాలే వేగంగా కోలుకున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ పేర్కొంటున్నారు. మెటల్స్, రియల్టీ, పవర్, పీఎస్‌యూ వంటి సైక్లికల్ రంగాలతోపాటు.. ఫార్మా వంటి రక్షణాత్మక రంగాలకు డిమాండ్ పుట్టవచ్చని అంచనా వేశారు. ఇక రీసెర్చ్ నిపుణులు సిఫారసు చేస్తున్న స్టాక్స్‌ను చూద్దాం.. హెచ్‌యూఎల్ షేరు ధర, కాలావధి రీత్యా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) 8 వారాల దిద్దుబాటు దశను పూర్తిచేసుకుంది. దీంతో కొద్ది రోజులుగా సానుకూల ధోరణితో సైడ్‌వేస్‌లో కదులుతోంది. కనిష్టాల వద్ద భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఈ కౌంటర్ సానుకూల పుల్‌బ్యాక్‌ను సాధించింది. ఫలితంగా కొద్ది రోజుల్లో తిరిగి అప్‌ట్రెండ్ ప్రారంభంకావచ్చని భావిస్తున్నాం. ఈ కౌంటర్లో లాంగ్ పొజిషన్లు తీసుకున్న ఇన్వెస్టర్లు రూ. 2450 టార్గెట్ ధర కోసం వేచిచూడవచ్చు. అయితే రూ. 1850 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవలసి ఉంటుంది. ఇన్ఫోసిస్ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ కౌంటర్లో దీర్ఘకాలంగా జరుగుతున్న కన్సాలిడేషన్తోపాటు షేరు ధరలో పెరుగుదల లేకపోవడంతో కాలానుగుణ దిద్దుబాటు జరిగినట్లు కనిపిస్తోంది. రూ. 630-640 ధరల శ్రేణిలో పలుమార్లు మద్దతు(సపోర్ట్) కూడగట్టుకుంది. వెరసి ప్రస్తుత స్థాయిలో రిస్క్రివార్డ్ నిష్పత్తి సానుకూలంగా కనిపిస్తోంది. రోజువారీ ఆర్ఎస్ఐ 60 స్థాయికి ఎగువన నిలవడం బుల్లిష్ ధోరణిని సూచిస్తోంది. రూ. 830 టార్గెట్ ధరతో లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 620 వద్ద స్టాప్‌లాస్ అమలు చేయడం మేలు. సన్ ఫార్మా గత వారం రూ. 515 వద్ద నమోదైన గరిష్టాల నుంచి హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మా కౌంటర్లో దిద్దుబాటును చవిచూసింది. ఫలితంగా దీర్ఘకాలిక సగటుల నుంచి రీట్రేస్మెంట్ జరిగింది. ప్రస్తుతం ఫార్మా రంగం పటిష్ట అప్‌ట్రెండ్‌లో ఉంది. హైయర్ హైలతోపాటు, హైయర్ బాటమ్ ఏర్పడటం ద్వారానెల వారీ చార్టులు రానున్న రోజుల్లో మరింత పుంజుకునే వీలున్నట్లు సంకేతిస్తున్నాయి. రోజువారీ చార్టులు సైతం అధిక ట్రేడింగ్ పరిమాణంతో 34 నెలల సగటును అధిగమించినట్లు స్పష్టం చేస్తు న్నాయి. దీంతో రూ. 590 టార్గెట్ ధరతో ఈ కౌంటర్లో లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 415 దిగువన స్టాప్‌లాస్ పెట్టుకోవలసి ఉంటుంది. - వికాస్ జైన్, సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు, రిలయన్స్ సెక్యూరిటీస్ డీమార్ట్ డీమార్ట్ బ్రాండ్ రిటైల్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కౌంటర్ హయ్యర్ టాప్స్, బాటమ్స్‌ను సాధిస్తూ వస్తోంది. నెలవారీ చార్టుల ప్రకారం ఈ స్టాక్ అప్‌సైడ్ ట్రెండ్‌లో ఉంది. సానుకూల సంకేతాలతో అప్ స్లోపింగ్ చానల్‌ను నమోదు చేస్తోంది. సాంకేతికంగా కీలకమైన 50, 100, 200 రోజుల చలన సగటుల ఎగువన కదులుతోంది. ఇవన్నీ రానున్న రోజుల్లో డీమార్ట్ కౌంటర్ మరింత బలపడేందుకు వీలున్నట్లు సూచిస్తున్నాయి. ఎయిర్టెల్ మొబైల్ సేవల దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కౌంటర్ రూ. 500 స్థాయిలో 13ఏళ్ల కన్సాలిడేషన్ శ్రేణిని అధిగమించింది. అంతేకాకుండా ఈ స్థాయికి ఎగువనే నిలదొక్కుకుంటోంది. అదికూడా భారీ ట్రేడింగ్ పరిమాణంతో బ్రేకవుట్ సాధించింది. వెరసి సాంకేతికంగా కీలకమైన 50, 100, 200 రోజుల చలన సగటులకు ఎగువన కదులుతోంది. తద్వారా రానున్న రోజుల్లో మరింత పుంజుకునే వీలున్నట్లు గోచరిస్తోంది. - రాజేష్ పల్వియా, టెక్నికల్, డెరివేటివ్ రీసెర్చ్ హెడ్, యాక్సిస్ సెక్యూరిటీస్ -
ఈ 120 షేర్లు- సాంకేతికంగా వీక్
గత నెలలో జోరు చూపిన దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీలు, ఆర్బీఐ లిక్విడిటీ చర్యలు, లాక్‌డవున్ ఆంక్షల సడలింపులు సెంటిమెంటుకు బలాన్నివ్వడంతో మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 9,125 స్థాయిలో కదులుతోంది. అయితే నిఫ్టీ అటు దీర్ఘకాలిక, ఇటు స్వల్పకాలిక సగటు కంటే దిగువనే కదులుతున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. అంటే నిఫ్టీ 200 రోజులు, 50 రోజుల చలన సగటు(డీఎంఏ) లోపునే ఉంది. ఇదే విధంగా 200 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే దిగువన 120 స్టాక్స్ ట్రేడవుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో బ్లూచిప్ కౌంటర్లతోపాటు.. మిడ్ క్యాప్స్ సైతం చోటు చేసుకున్నాయి.సాంకేతిక నిపుణులు పేర్కొంటున్న ఇతర వివరాలు చూద్దాం.. రూ. 10,000 కోట్ల విలువ దీర్ఘకాలిక సగటుగా భావించే 200 రోజుల సింపుల్ మూవింగ్ ఏవరేజ్(ఎస్ఎంఏ) కంటే దిగువనే ఇప్పటికీ నిఫ్టీ కదులుతోంది. ఇదే విధంగా కనీసం రూ. 10,000 కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్(విలువ) కలిగిన కంపెనీలను పరిగణిస్తే.. సుమారు 120 స్టాక్స్ 200 డీఎంఏ కంటే దిగువన ట్రేడవుతున్నాయి. కాగా.. నిఫ్టీ-50కి.. 200 డీఎంఏ 11,056 వద్ద, 50 డీఎంఏ.. 9199గా చార్టులు చూపుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 9125 స్థాయిలో కదులుతోంది. ఇది స్వల్ప బేరిష్‌నెస్‌ను సూచిస్తోంది. సాధారణంగా సాంకేతిక నిపుణులు 200 డీఎంఏను కీలకంగా భావిస్తుంటారు. 200 డీఎంఏ దిగువన కదులుతున్న కంపెనీల జాబితాలో దిగ్గజాలు టీసీఎస్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ తదితరాలున్నాయి. దీంతో సహజంగానే మార్కెట్ల స్ట్రక్చర్ బలహీనంగా ఉన్నట్లు శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ టెక్నికల్, డెరివేటివ్స్ హెడ్ ఆశిష్ చతుర్మొహతా పేర్కొన్నారు. జాబితా ఇలా 200 డీఎంఏ దిగువన కదులుతున్న కంపెనీల జాబితాలో దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ, టీసీఎస్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్తాన్ జింక్, కోల్ ఇండియా, డాబర్, బజాజ్ ఆటో, పిడిలైట్, శ్రీ సిమెంట్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, హీరో మోటో, బెర్జర్ పెయింట్స్, మారికో, డీఎల్ఎఫ్ తదితరాలున్నాయి. -
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి శ్రీకారం
- రాయలసీమ ఐజీ ఎన్.శ్రీధర్‌రావు కడప అర్బన్ : రాష్ట్రంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిసారిగా జిల్లాలో టెక్నికల్ అనాలసిస్ వింగ్‌ను ప్రారంభించామని, ఇది చాలా శుభపరిణామమని రాయలసీమ ఐజీ ఎన్.శ్రీధర్‌రావు అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాయలసీమ ఐజీ ఎన్.శ్రీధర్‌రావు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం వరకు ఎన్నికలు, శాంతిభద్రతలపై డీఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ బంగ్లా, క్యాంపు కార్యాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘టా’ (టెక్నికల్ అనాలసిస్ వింగ్) కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ విధానం ద్వారా నేర పరిశోధనలో, కేసుల దర్యాప్తుల్లో ఎలా ముందడుగు వేయాలో తెలుసుకోవచ్చన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు లక్షల మంది వివిధ నేరాల ప్రవృత్తి కలిగిన వారిని గుర్తించామని, వారు ఎక్కడైనా సరే తనిఖీల సమయంలో తారసపడినా, తమకు అనుమానం వచ్చినా వెంటనే వారి వివరాలను, వేలిముద్రలను నమోదు చేయడం ద్వారా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. చోరీలు, దోపిడీలను తద్వారా అరికట్టవచ్చన్నారు. నేరాల సమయంలో వివిధ సెల్ఫోన్లను ఉపయోగిస్తూ తాము తెరవెనుక ఉంటూ తప్పించుకుంటూ తిరిగే వారని కూడా టెక్నికల్ అనాలసిస్ వింగ్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు సీడీఆర్తోపాటు వారి వెనుకగల సాంకేతిక ప్రమాణాలతో కూడిన లోపాలను కూడా కనిపెట్టవచ్చన్నారు. ప్రతి పోలీసు వాహనానికి ఇప్పటికే జీపీఎస్ సిస్టమ్ ఉన్నందున వీఎంఎస్ ద్వారా ఆయా పోలీసు అధికారులను నేరాలు జరిగినపుడు గుర్తించి వెంటనే ఆయా ప్రదేశాలకు సకాలంలో చేరుకుని నేరాలను నిరోధించే విధంగా కృషి చేయవచ్చన్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ రాష్ట్రంలోనే మొదటిసారిగా డీజీపీ చెప్పిన నెలరోజుల్లోపే టెక్నికల్ అనాలసిస్ వింగ్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయించడం అభినందించదగ్గ విషయమన్నారు. పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు: రాయలసీమలో జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఒక్కొ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష జరిపి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నామన్నారు. పొలిటికల్, ఇతర అనుమానించదగ్గ, గతంలో కేసులు ఉన్న వారిపైన, వారి కదలికలపైన ఇప్పటికే నిఘా ఉంచామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, ఓఎస్డీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.