ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశమున్నట్లు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్‌వీబీ) మూసివేత తదితర అంశాలు కారణంకానున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా పలు గణాంకాలు విడుదల కానుండటంతో ఇన్వెస్టర్లు వీటన్నిటినిపైనా దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు.
ద్రవ్యోల్బణం, వాణిజ్యం..
సోమవారం(13న) దేశీయంగా ఫిబ్రవరి నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు విడుదల కానున్నాయి. అంతకుముందు నెల అంటే జనవరిలో సీపీఐ మూడు నెలల గరిష్టం 6.52 శాతంగా నమోదైంది. ఇక మంగళవారం(14న) ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. 2022 డిసెంబర్‌లో నమోదైన 4.95 శాతం నుంచి జనవరిలో 4.73 శాతానికి డబ్ల్యూపీఐ స్వల్పంగా తగ్గింది. ఈ బాటలో ఫిబ్రవరి వాణిజ్య గణాంకాలను సైతం ఇదే రోజు ప్రభుత్వం ప్రకటించనుంది. జనవరిలో వాణిజ్య లోటు 17.75 బిలియన్ డాలర్లకు చేరింది.
విదేశీ అంశాలు
గత వారాంతాన ఇన్సూర్డ్ డిపాజిట్ల రక్షణకు వీలుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్‌వీబీని మూసివేసినట్లు కాలిఫోర్నియా ఆర్థిక పరిరక్షణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పరిస్థితులను చక్కదిద్దే బాటలో ఎస్‌వీబీని ఫైనాన్షియల్ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఐసీకి అప్పగించినట్లు వెల్లడించింది. ప్రధానంగా సిలికాన్ వ్యాలీ, టెక్ స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించే ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ ఆర్థిక సంక్షోభంలో పడటంతో గత గురువారం కంపెనీ షేరు 60 శాతం కుప్పకూలింది.
దీంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్‌ఫార్గో తదితర బ్యాంకింగ్ దిగ్గజ షేర్లు 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. దీంతో సోమవారం బ్యాంకింగ్ పరిశ్రమపై ఈ ప్రభావం ఏమేర ఉండబోయేదీ వేచిచూడవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. అంచనాలకంటే అధికంగా వడ్డీ రేట్లను పెంచే వీలున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ గత వారం పేర్కొన్నారు. అయితే వారాంతాన యూఎస్ నిరుద్యోగ గణాంకాలు అంచనాలను మించి వెలువడ్డాయి. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు కొంతమేర చెక్ పడేవీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు ఊహిస్తున్నాయి. ఈ నెల 22న ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలను వెల్లడించ నుంది.
గ్లోబల్ గణాంకాలు
ఫిబ్రవరి నెలకు యూఎస్ సీపీఐ గణాంకాలు 14న వెలువడనున్నాయి. చైనా పారిశ్రామికోత్పత్తి వివరాలు 15న వెల్లడికానున్నాయి. యూఎస్ ఉత్పాదక ధరల ద్రవ్యోల్బణం, రిటైల్ విక్రయ గణాంకాలు ఇదే రోజు వెలువడనున్నాయి. ఈ బాటలో 16న జపాన్ వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. ఇక దేశీయంగా ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు, ఎస్‌వీబీ వైఫల్యంతో వారం చివర్లో దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గత వారం సెన్సెక్స్ నికరంగా 674 పాయింట్లు కోల్పోయి 59,135కు చేరగా.. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 17,413 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment