Wholesale price inflation
-
Wholesale price inflation: 3 నెలల గరిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: దేశీయంగా టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. కూరగాయలు, బంగాళదుంప, ఉల్లి, ముడి చమురు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా మార్చిలో 0.53 శాతంగా (ప్రొవిజనల్) నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 0.20 శాతంగా ఉంది. గతేడాది మార్చిలో ఇది 1.41 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మైనస్‌లోనే ఉన్న టోకు ధరల ఆధారిత సూచీ నవంబర్‌లో ప్లస్ 0.26 శాతానికి వచి్చంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్ట స్థాయి 4.85 శాతానికి తగ్గిన నేపథ్యంలో తాజా టోకు గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బేస్ ఎఫెక్ట్ తగ్గుతుండటంతో రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.42 శాతం నుంచి 6.88 శాతానికి చేరింది. కూరగాయల ధరల పెరుగుదల మైనస్ 2.39 శాతం నుంచి 19.52 శాతానికి ఎగిసింది. -
ఈ వారం అమ్మకాల ఒత్తిడిలో మార్కెట్లు!
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశమున్నట్లు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) మూసివేత తదితర అంశాలు కారణంకానున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా పలు గణాంకాలు విడుదల కానుండటంతో ఇన్వెస్టర్లు వీటన్నిటినిపైనా దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. ద్రవ్యోల్బణం, వాణిజ్యం.. సోమవారం(13న) దేశీయంగా ఫిబ్రవరి నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు విడుదల కానున్నాయి. అంతకుముందు నెల అంటే జనవరిలో సీపీఐ మూడు నెలల గరిష్టం 6.52 శాతంగా నమోదైంది. ఇక మంగళవారం(14న) ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. 2022 డిసెంబర్లో నమోదైన 4.95 శాతం నుంచి జనవరిలో 4.73 శాతానికి డబ్ల్యూపీఐ స్వల్పంగా తగ్గింది. ఈ బాటలో ఫిబ్రవరి వాణిజ్య గణాంకాలను సైతం ఇదే రోజు ప్రభుత్వం ప్రకటించనుంది. జనవరిలో వాణిజ్య లోటు 17.75 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశీ అంశాలు గత వారాంతాన ఇన్సూర్డ్ డిపాజిట్ల రక్షణకు వీలుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్వీబీని మూసివేసినట్లు కాలిఫోర్నియా ఆర్థిక పరిరక్షణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పరిస్థితులను చక్కదిద్దే బాటలో ఎస్వీబీని ఫైనాన్షియల్ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఐసీకి అప్పగించినట్లు వెల్లడించింది. ప్రధానంగా సిలికాన్ వ్యాలీ, టెక్ స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించే ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ ఆర్థిక సంక్షోభంలో పడటంతో గత గురువారం కంపెనీ షేరు 60 శాతం కుప్పకూలింది. దీంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్‌ఫార్గో తదితర బ్యాంకింగ్ దిగ్గజ షేర్లు 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. దీంతో సోమవారం బ్యాంకింగ్ పరిశ్రమపై ఈ ప్రభావం ఏమేర ఉండబోయేదీ వేచిచూడవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. అంచనాలకంటే అధికంగా వడ్డీ రేట్లను పెంచే వీలున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ గత వారం పేర్కొన్నారు. అయితే వారాంతాన యూఎస్ నిరుద్యోగ గణాంకాలు అంచనాలను మించి వెలువడ్డాయి. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు కొంతమేర చెక్ పడేవీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు ఊహిస్తున్నాయి. ఈ నెల 22న ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలను వెల్లడించ నుంది. గ్లోబల్ గణాంకాలు ఫిబ్రవరి నెలకు యూఎస్ సీపీఐ గణాంకాలు 14న వెలువడనున్నాయి. చైనా పారిశ్రామికోత్పత్తి వివరాలు 15న వెల్లడికానున్నాయి. యూఎస్ ఉత్పాదక ధరల ద్రవ్యోల్బణం, రిటైల్ విక్రయ గణాంకాలు ఇదే రోజు వెలువడనున్నాయి. ఈ బాటలో 16న జపాన్ వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. ఇక దేశీయంగా ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు, ఎస్వీబీ వైఫల్యంతో వారం చివర్లో దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గత వారం సెన్సెక్స్ నికరంగా 674 పాయింట్లు కోల్పోయి 59,135కు చేరగా.. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 17,413 వద్ద ముగిసింది. -
ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చాన్స్
ముంబై: హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం డేటా వెల్లడి (మంగళవారం) మినహా దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున.. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు ప్రపంచ పరిణామాలే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బుధవారం వెల్లడి కానున్న ఫెడ్ రిజర్వ్ జూలై పాలసీ సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కంపెనీల జూన్ కార్పొరేట్ ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో సెన్సెక్స్ 1,075 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగిరావడం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ‘‘గడిచిన రెండు నెలల్లో సూచీలు 16% ర్యాలీ చేయడంతో మార్కెట్ ఓవర్‌బాట్ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు వీలుంది. సాంకేతికంగా నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో 17,850 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17,350–17,400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఎఫ్ఓఎంసీ మినిట్స్: ఫెడ్ జూలై పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) ఈనెల 16న (బుధవారం) ప్రకటించనుంది. ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, మాంద్యంతో పాటు వడ్డీ రేట్లపై ఫెడ్ పాలసీ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలమని నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ ముందుగా మంగళవారం గతవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. అదేరోజన జూలై హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. జూన్‌తో పోలిస్తే (15.18 శాతం) ఈ జూలై డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం దిగిరావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జూలై మాసపు ప్యాసింజర్ వాహన అమ్మకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. అలాగే ఆర్బీఐ ఆగస్టు 13 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల ఐదో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఆగస్టు 1–15 తేదీల మధ్య రూ. 22,452 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది(2021) అక్టోబర్‌లో మొదలైన విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ జూన్ నాటికి రూ.2.46 లక్షల కోట్ల నిధులను భారత ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా.., ఈ జూలైలో రూ. 6295 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జూలై నెల నుంచి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవడం, ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న తగు నిర్ణయాలతో విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం ప్రారంభించాయి’’ కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రీటైల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. ఈ వారంలోనూ ట్రేడింగ్ 4 రోజులే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (నేడు) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీతో పాటు కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. మార్కెట్లు తిరిగి మంగళవారం యధావిధిగా ప్రారంభమవుతాయి. -
టోకు ధరలు మళ్లీ ఎగిశాయ్!
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) మళ్లీ పెరిగింది. జూలై నెలలో 3.55 శాతానికి ఎగబాకి మార్కెట్ వర్గాలను నిరాశపరిచిన ఈ ద్రవ్యోల్బణం, మళ్లీ ఆగస్టు నెలలో 3.74 శాతానికి ఎగిసింది. అయితే ఈ పెరుగుదల తక్కువగానే నమోదైంది. ప్రభుత్వం బుధవారం విడుదలచేసిన తాజా డేటాలో ఈ విషయం వెల్లడైంది. జూలై నెలలో 11.82శాతంగా ఉన్న ఆహార ధరల ఇండెక్స్ ఆగస్టు నెలలో 8.23 శాతంగా నమోదైంది. డబ్ల్యూపీఐలో ఎక్కువ శాతం కలిగి ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు ఆగస్టు నెలలో 2.42 శాతం ఎగిశాయి. జూలైలో ఈ ధరలు 1.82 శాతంగా ఉన్నాయి. గతవారంలో విడుదల చేసిన వినియోగదారుల ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో ఐదు నెలల కనిష్టానికి పడిపోయి రేట్ల కోతకు అవకాశం కల్పించగా ఈ ద్రవ్యోల్బణం కొంత నిరాశపరిచింది. అయితే వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీలో ఆహార ధరల పెరుగుదల అదుపులోకి రావడంతో వచ్చే నెలలో విడుదల చేసే ద్రవ్య విధాన పరపతి సమీక్షలో ఆర్బీఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ రేట్లకు కోత పెడతారని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఆర్బీఐ విడుదలచేసే మానిటరీ పాలసీలో వినియోగదారుల ద్రవ్యోల్బణాన్నే పరిగణలోకి తీసుకుంటారని పేర్కొంటున్నారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్భణంలో కంటే వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీలోనే ఆహార ధరలు ఎక్కువ శాతాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు. జూన్ నెలతో పోలిస్తే జూలైలో దాదాపు రెట్టింపు శాతం పెరిగిన ఈ ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడం మార్కెట్ వర్గాలు కొంత విస్మయ పరుస్తుంది. ఈ డేటా విడుదల అనంతరం మధ్యాహ్నం సెషన్లో మార్కెట్లు పడిపోయాయి. సెన్సెక్స్ 28,356 వద్ద, నిఫ్టీ 8,723 వద్ద లాభనష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. -
ఆకాశాన్నంటిన ఆహార ధరలు
21 నెలల గరిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ జోరుగా ఉందని సంకేతాలు ఇస్తూ.. అంచనా వేసిన దానికంటే అధికంగా నమోదైన గత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాల ఉత్సాహం ఎన్నో రోజులు నిలవలేదు. సోమవారం విడుదలైన వినియోగదారుల సూచీ గణాంకాలు, మంగళవారం రిలీజ్ చేసిన టోకు ధరల సూచీ రెండూ పైకి ఎగిశాయి. మే నెల టోకు ధరల ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెల కూడా పెరిగి, 21 నెలల గరిష్ట స్థాయికి నమోదైందని గణాంకాలు తెలిపాయి. ఆహార ధరలు పెరగడంతో మే నెల టోకు ధరల ద్రవ్బోల్బణం 5.78శాతానికి ఎగిసింది. కూరగాయలు ధరలు రెండంకెల సంఖ్యలో పెరిగాయని, పప్పులు, గుడ్లు, మాంసాలు, ఫిష్ వంటి ధరలు మే నెలలో ఒక్కసారిగా ఎగిసి, మార్కెట్లో చుక్కలు చూపించాయని గణాంకాల్లో వెల్లడైంది. పప్పు ధాన్యాలను మినహాయిస్తే, ఆహార ఉత్పత్తుల ధరలేమీ రుతుపవనాలపై ఆధారపడవని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఎకనామిస్ట్ సునీల్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్ బీఐ రేట్ల కోతకు విఘాతం కలిగిస్తున్నాయి. 2017 జనవరి వరకు ద్రవ్యోల్బణం 5శాతానికి దించాలని ఆర్ బీఐ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ గా కమోడిటీ ధరలు తగ్గడంతో గత రెండేళ్ల నుంచి తక్కువ ద్రవ్యోల్బణంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటూ వస్తోంది. అయితే ఒక్కసారిగా ఈ ధరలు పెరుగుతుండటంతో మోదీ ప్రభుత్వానికి ఇది అతిపెద్ద సవాలుగా మారనుంది. ఈ పెరుగుదలతో ఆర్థిక శాఖ విశ్లేషకులు భయాందోళను వ్యక్తంచేస్తున్నారు. మే 1నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు 5శాతం పెరిగాయి. ఆహార ధరలు కూడా గతనెల పైకి ఎగిశాయి. -
ఆహార ధరలు భగ్గు..
* నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.41 శాతం * మైనస్ 1.9 శాతానికి టోకు ధరల ద్రవ్యోల్బణం * ఎగిసిన పప్పులు, కూరగాయలు, పండ్ల రేట్లు న్యూఢిల్లీ: పప్పులు, పండ్లు, కూరగాయలు తదితర ఆహార పదార్ధాల ధరలు ఎగియడంతో నవంబర్‌లో రిటైల్, టోకు రేట్ల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది, అక్టోబర్‌లో 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం రేటు గత నెలలో 5.41 శాతం మేర పెరిగింది. ఇది 14 నెలల గరిష్టం. గతేడాది నవంబర్‌లో ఇది 3.27 శాతంగా ఉంది. టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు మైనస్‌లోనే ఉన్నప్పటికీ పెరుగుదల నమోదు చేసింది. ఇది అక్టోబర్‌లో మైనస్ 3.81 శాతం ఉండగా నవంబర్‌లో మైనస్ 1.9 శాతం మేర పెరిగింది. గతేడాది నవంబర్‌లో ఇది మైనస్ 0.17 శాతం. రేట్ల కోత ఉండకపోవచ్చు.. టోకు, రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఊహించిన దానికన్నా కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఇది పరిస్థితులకు తగ్గట్లుగానే ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకానమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. బేస్ ఎఫెక్ట్ క్రమంగా తొలగిపోతోందని, దీంతో ఈ రెండూ రాబోయే రోజుల్లో మరింత పెరగొచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ పాలసీ రేట్లను మరింత తగ్గించే అవకాశాలు కనిపించడం లేదని దేవేంద్ర కుమార్ తెలిపారు. మరోవైపు, టోకు, రిటైల్ గణాంకాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని, దేశీయంగా పెట్టుబడులకు ఊతమిచ్చేలా ఆర్బీఐ పాలసీ రేట్లను మరింత తగ్గించేందుకు తగిన అవకాశం ఉందని పరిశ్రమల సమాఖ్య అసోచాం పేర్కొంది. తగినంత ఉత్పత్తి సామర్థ్యాల కారణంగా తయారీ రంగంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తక్కువగానే ఉండగా, ఆహారోత్పత్తుల రేట్ల పెరుగుదల.. బలహీన రుతుపవనాల ప్రతికూల ప్రభావాన్ని సూచిస్తోందని నొమురా ఒక నివేదికలో పేర్కొంది. రిటైల్ వరుసగా నాలుగో నెలా .. అధికారిక గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా నాలుగో నెలా పెరిగినట్లయింది. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదల 5.95 శాతంగాను, పట్టణ ప్రాంతాల్లో 4.71 శాతంగాను నమోదైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.07% పెరిగింది. పప్పులు, తత్సంబంధిత ఉత్పత్తుల విభాగం ఏకంగా 46.08% ఎగిసింది. కూరగాయల ధరలు నవంబర్‌లో రెట్టింపై 4% మేర పెరుగుదల నమోదు చేశాయి. ఇక తృణధాన్యాల విభాగం 1.70% పెరగ్గా, సీజనల్ ఫలాల రేట్లు 2.07% ఎగిశాయి. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, ఇంధనం, విద్యుత్ మొదలైన వాటి రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఇక, మాంసం, చేపల విభాగం 5.34%, ఫుడ్, బెవరేజెస్ విభాగం మైనస్ 6.08 %, నాన్-ఆల్కహాలిక్ బెవరేజెస్ 4.55% మేర మారాయి. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను నిర్ణయించడంలో వినియోగదారుల ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటుంది. టోకు ధరలిలా.. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 13వ నెలా మైనస్‌లోనే కొనసాగింది. గత మూడు నెలల నుంచి కొంత పెరుగుతున్నప్పటికీ.. క్రితం ఏడాది నవంబర్ నుంచి ఇది మైనస్‌లోనే ఉంది. టోకు ధరల ప్రాతిపదికన చూస్తే ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో ఏకంగా 5.20 శాతం ఎగిసింది. ఇది అక్టోబర్‌లో 2.44%గా ఉంది. మరోవైపు పప్పుల రేట్లు 58.17%, ఉల్లిపాయల ధరలు 52.69% పెరిగాయి. కూరగాయల ధరల పెరుగుదల 14.08 శాతంగా ఉంది. ఈ విభాగంలో ఆలుగడ్డల రేట్ల పెరుగుదల మైనస్ 53.72 శాతంగా ఉంది. గుడ్లు.. మాంసం, చేపల విభాగం ధరల పెరుగుదల మైనస్ 2.24%, ఇంధనం.. విద్యుత్ విభాగం మైనస్ 11.09%, తయారీ ఉత్పత్తుల విభాగంలో మైనస్ 1.42 శాతంగాను నమోదైంది. సెప్టెంబర్‌కి సంబంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలను మైనస్ 4.54% నుంచి మైనస్ 4.59 శాతానికి సవరించారు. -
చివర్లో కొనుగోళ్ల జోష్
ముందురోజుకు విరుద్ధంగా స్టాక్ మార్కెట్లు వారాంతాన పుంజుకున్నాయి. చివర్లో అమాంతం ఊపందుకున్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 173 పాయింట్లు ఎగసింది. ఇది గత నెల రోజుల్లోనే అత్యధిక లాభంకాగా 20,367 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 47 పాయింట్లు ఎగసి 6,048 వద్ద స్థిరపడింది. గురువారం 255 పాయింట్లు నష్టపోవడం ద్వారా సెన్సెక్స్ నాలుగు నెలల కనిష్టం వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, జనవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్టమైన 5%కు ఉపశమించడంతో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇన్వెస్టర్లలో అంచనాలు పెరిగాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే రిటైల్ ద్రవ్యోల్బణం సైతం రెండేళ్ల కనిష్టానికి చేరిన విషయం విదితమే. ఇక మరోవైపు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాలతో ట్రేడవడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని తెలిపారు. ఐటీ, ఆయిల్ ఓకే ఐటీ, ఆయిల్ రంగాలు 1% చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్ అత్యధికంగా 3.3% ఎగసింది. జనవరిలో జేఎల్ఆర్ విక్రయాలు పుంజుకోవడం సహకరించింది. ఇక గెయిల్, ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.5-1.5% మధ్య లాభపడ్డాయి. అయితే బజాజ్ ఆటో, భెల్, సిప్లా, హీరో మోటో, ఎస్బీఐ 3.5-1.5% మధ్య డీ లాపడ్డాయి. చిన్న షేర్లలో ఆమ్టెక్ ఆటో, సింఫనీ, ఆమ్టెక్ ఇండియా, టాటా ఎలక్సీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్, కాక్స్ అండ్ కింగ్స్, ఫైనాన్షియల్ టెక్, పీసీ జ్యువెలర్స్ 19-5% మధ్య దూసుకెళ్లాయి