ఆహార ధరలు భగ్గు..
* నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.41 శాతం
* మైనస్ 1.9 శాతానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
* ఎగిసిన పప్పులు, కూరగాయలు, పండ్ల రేట్లు
న్యూఢిల్లీ: పప్పులు, పండ్లు, కూరగాయలు తదితర ఆహార పదార్ధాల ధరలు ఎగియడంతో నవంబర్‌లో రిటైల్, టోకు రేట్ల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది, అక్టోబర్‌లో 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం రేటు గత నెలలో 5.41 శాతం మేర పెరిగింది. ఇది 14 నెలల గరిష్టం. గతేడాది నవంబర్‌లో ఇది 3.27 శాతంగా ఉంది.
టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు మైనస్‌లోనే ఉన్నప్పటికీ పెరుగుదల నమోదు చేసింది. ఇది అక్టోబర్‌లో మైనస్ 3.81 శాతం ఉండగా నవంబర్‌లో మైనస్ 1.9 శాతం మేర పెరిగింది. గతేడాది నవంబర్‌లో ఇది మైనస్ 0.17 శాతం.
రేట్ల కోత ఉండకపోవచ్చు..
టోకు, రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఊహించిన దానికన్నా కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఇది పరిస్థితులకు తగ్గట్లుగానే ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకానమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. బేస్ ఎఫెక్ట్ క్రమంగా తొలగిపోతోందని, దీంతో ఈ రెండూ రాబోయే రోజుల్లో మరింత పెరగొచ్చని ఆయన పేర్కొన్నారు.
దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ పాలసీ రేట్లను మరింత తగ్గించే అవకాశాలు కనిపించడం లేదని దేవేంద్ర కుమార్ తెలిపారు. మరోవైపు, టోకు, రిటైల్ గణాంకాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని, దేశీయంగా పెట్టుబడులకు ఊతమిచ్చేలా ఆర్‌బీఐ పాలసీ రేట్లను మరింత తగ్గించేందుకు తగిన అవకాశం ఉందని పరిశ్రమల సమాఖ్య అసోచాం పేర్కొంది.
తగినంత ఉత్పత్తి సామర్థ్యాల కారణంగా తయారీ రంగంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తక్కువగానే ఉండగా, ఆహారోత్పత్తుల రేట్ల పెరుగుదల.. బలహీన రుతుపవనాల ప్రతికూల ప్రభావాన్ని సూచిస్తోందని నొమురా ఒక నివేదికలో పేర్కొంది.
రిటైల్ వరుసగా నాలుగో నెలా ..
అధికారిక గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా నాలుగో నెలా పెరిగినట్లయింది. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదల 5.95 శాతంగాను, పట్టణ ప్రాంతాల్లో 4.71 శాతంగాను నమోదైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.07% పెరిగింది. పప్పులు, తత్సంబంధిత ఉత్పత్తుల విభాగం ఏకంగా 46.08% ఎగిసింది. కూరగాయల ధరలు నవంబర్‌లో రెట్టింపై 4% మేర పెరుగుదల నమోదు చేశాయి.
ఇక తృణధాన్యాల విభాగం 1.70% పెరగ్గా, సీజనల్ ఫలాల రేట్లు 2.07% ఎగిశాయి. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, ఇంధనం, విద్యుత్ మొదలైన వాటి రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఇక, మాంసం, చేపల విభాగం 5.34%, ఫుడ్, బెవరేజెస్ విభాగం మైనస్ 6.08 %, నాన్-ఆల్కహాలిక్ బెవరేజెస్ 4.55% మేర మారాయి. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను నిర్ణయించడంలో వినియోగదారుల ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటుంది.
టోకు ధరలిలా..
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 13వ నెలా మైనస్‌లోనే కొనసాగింది. గత మూడు నెలల నుంచి కొంత పెరుగుతున్నప్పటికీ.. క్రితం ఏడాది నవంబర్ నుంచి ఇది మైనస్‌లోనే ఉంది. టోకు ధరల ప్రాతిపదికన చూస్తే ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో ఏకంగా 5.20 శాతం ఎగిసింది.
ఇది అక్టోబర్‌లో 2.44%గా ఉంది. మరోవైపు పప్పుల రేట్లు 58.17%, ఉల్లిపాయల ధరలు 52.69% పెరిగాయి. కూరగాయల ధరల పెరుగుదల 14.08 శాతంగా ఉంది. ఈ విభాగంలో ఆలుగడ్డల రేట్ల పెరుగుదల మైనస్ 53.72 శాతంగా ఉంది. గుడ్లు.. మాంసం, చేపల విభాగం ధరల పెరుగుదల మైనస్ 2.24%, ఇంధనం.. విద్యుత్ విభాగం మైనస్ 11.09%, తయారీ ఉత్పత్తుల విభాగంలో మైనస్ 1.42 శాతంగాను నమోదైంది. సెప్టెంబర్‌కి సంబంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలను మైనస్ 4.54% నుంచి మైనస్ 4.59 శాతానికి సవరించారు.