మనకు ఆహార పదార్థాలలో కొన్ని వండకుండా నేరుగా తినేయవచ్చు, మరికొన్నింటిని తప్పకుండా వండుకొనే తినాలి. మనలో చాలా మంది కొన్ని కూరగాయలను పచ్చిగా తినడమే ఆరోగ్యకరం అని నమ్ముతారు. అయితే అన్ని సందర్భాలలో.. అన్ని కూరగాయల విషయంలో అది మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా పచ్చిగా తినకూడని కూరగాయలేమిటో తెలుసుకుందాం.
కొన్ని కూరగాయలలో సహజమైన విషపూరిత సమ్మేళనాలు, జీర్ణం కావడానికి కష్టతరమైన చక్కెరలు ఉంటాయి. ఇవి ఫుడ్ పాయిజన్, జీర్ణ సమస్యలు కలిగించడంతో పాటు గ్యాస్ట్రోనామికల్ వ్యాధులకు దారితీయవచ్చు. అంతేకాదు, కూరగాయలను పండించటానికి ఎరువులు, పురుగుమందులు ఎక్కువగా వాడుతున్నారు. మనం వాటిని ఎంత శుభ్రం చేసినా, వాటి లోపలి భాగంలో ఉండే హానికర సమ్మేళనాలు, బ్యాక్టీరియా వంటివి అలాగే ఉంటాయి. బాగా ఉడికించినపుడు మాత్రమే అవి క్రిమిసంహారం అవుతాయి, అప్పుడే అవి తినడానికి అనువైనవిగా ఉంటాయి. అయితే పచ్చిగా అస్సలు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం.
చిలగడదుంప/ గెణుసుగడ్డ/ రత్నపురి గడ్డ
వీటిని నేరుగా తిన్నా, రుచిగానే ఉంటుంది. అయితే ఇలా తినడం జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. వీటిలో ఉండే పిండి పదార్థం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్‌సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను నివారించడానికి వీటిని కాల్చడం లేదా ఉడికించడం మంచిది.
బీన్స్
పచ్చిగా తినకూడని మరో వెజిటెబుల్ బీన్స్. కొన్నిరకాల బీన్స్ పచ్చిగా తింటే ప్రమాదకరం కూడా. బీన్స్ లోని కొన్ని రకాలు హానికరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. అందువల్ల వాటిలోని హానికరమైన టాక్సిన్‌ను తొలగించడానికి ముందు బీన్స్‌ను క్లీనర్ నీటిలో నానబెట్టండి. ఆపైన వండుకొని తినాలి.
రెడ్ కిడ్నీ బీన్స్
ఉడికించని లేదా సరిగ్గా ఉడకని కిడ్నీ బీన్స్ (రాజ్మా) లో పెద్ద మొత్తంలో టాక్సిన్, గ్లైకో ప్రోటీన్ లెక్టిన్ ఉంటుంది. వీటిని తిన్న కొన్ని గంటల్లోనే వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. లక్షణాల తీవ్రత కూడా మీరు తిన్నపరిమాణంపై ఉంటుంది. ఎక్కువగా తినేస్తే ఎక్కువ మొత్తంలో టాక్సిన్స్ మీ శరీరంలోకి చేరతాయి. కాబట్టి కిడ్నీబీన్స్‌ని ఎప్పుడయినా ఉడకబెట్టి తినాలి.
ఆకు కూరలు
ఆకుకూరల్లో కొన్నింటిని పచ్చిగా తినకూడదు. క్యాబేజీ కుటుంబానికి చెందిన కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, బ్రోకలీ, అలాగే మొలకలను పచ్చిగా తినడం వల్ల అనేక గ్యాస్ట్రోనమికల్ సమస్యలు వస్తాయి.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులను పచ్చిగా తినవచ్చు, అయితే ఎక్కువ పోషకాలను పొందడానికి ఉడికించిన వాటిని తీసుకోవడం మంచిది. కాల్చిన, వేయించిన లేదా ఉడికించిన పుట్టగొడుగుల్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. అంతేకాకుండా వాటి రుచికూడా పెరుగుతుంది. కాబట్టి వండుకొని తినండి.
శాకాహారాలు కాకుండా ఏ రకమైన మాంసాహారాన్ని అయినా పచ్చిగా తినడం చాలా ప్రమాదకరం. పచ్చి మాంసంపై రకరకాల హానికర బ్యాక్టీరియాలు ఆవాసం ఏర్పర్చుకుంటాయి. కాబట్టి మాంసాన్ని బాగా ఉడికించుకొని తినాలి. అలాగే కోడిగుడ్లను కూడా పచ్చిగా తినడం హానికరమే!
Comments
Please login to add a commentAdd a comment