ఈ కాలంలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వంటికి ఎంతో మంచిది. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఏ కాలంలో తీసుకో వలసిన పండ్లు, కూరగాయలు ప్రకృతి చేసిన ఏర్పాటు వల్ల విరివిగా దొరుకుతూనే ఉంటాయి. అయితే తీసుకోకూడని ఆహారం మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే వాటికి దూరంగా ఉండటం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారమేంటో చూద్దాం.
ఈ కాలంలో తీసుకోకూడని ఆహార పదార్థాలలో ముందు వరసలో ఉండేది...
నూనెలో వేయించిన చిరుతిళ్లు...
వీటికి ఉదాహరణ సమోసాలు, పకోడీలు, బజ్జీలు. చలి చలిగా ఉన్న వాతావరణంలో వేడి వేడి బజ్జీలు, పకోడీలు, సమోసాలు లాగించడానికి బాగుంటుంది కానీ అరుగుదలకే చాలా కష్టం అవుతుంది. అజీర్తి, యాసిడిటీ, కడుపు ఉబ్బరం వస్తాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి చిరుతిళ్లకు దూరంగా ఉండటమే మేలు.
డెయిరీ ఫుడ్...
మీగడ, జున్ను, పాల ఉత్పత్తులు శరీరానికి బలవర్థకమే కానీ అది ఈ సీజన్‌లో అంతమంచిది కాదు. పాల ఉత్పత్తులు ఒంటికి వెచ్చదనాన్నివ్వడమొక్కటే కాదు, శ్లేష్మకరం కూడా. చల్లని వాతావరణంలో సైన సైటిస్ వచ్చేలా చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులున్నవారికి సమస్యలు కలిగిస్తుంది. అందువల్ల ఈ సీజన్‌లో డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం అంత మంచిది కాదు.
రెడ్ మీట్...
చలికాలంలో రెడ్ మీట్ తీసుకోరాదు. రెడ్‌మీట్‌కు మంచి ఉదాహరణ మటన్, బీఫ్, పోర్క్. ఇవి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై దు్రçష్పభావం పడుతుంది. అధికమొత్తంలో కొవ్వు ఉండటం మూలాన అరుగుదల లోపిస్తుంది. కడుపు ఉబ్బరం వస్తుంది. ఒకోసారి అది గుండెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
బండ్లమీద అమ్మే పదార్థాలు...
బండ్లమీద అపరిశుభ్ర వాతావరణంలో అమ్మే పానీపూరి, చాట్ వంటి వాటిని ఎప్పుడు తీసుకున్నా మంచిది కాదు కానీ ఈ సీజన్‌లో తీసుకోవడం బొత్తిగా మంచిది కాదు. స్ట్రీట్‌ఫుడ్ తినడం రోగనిరోధక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపి, బలహీనపరుస్తుంది. ఫలితంగా శరీరం రకరకాల వ్యాధుల బారిన పడుతుంది. అందువల్ల స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది.
శీతల పానీయాలు...
చల్లటి వాతావరణంలో చల్లటి పానీయాలు, ఐస్‌క్రీములూ తీసుకోవడం వల్ల వాటిని అరిగించడానికి, జీర్ణం చేసుకోవడానికి శరీరానికి చాలా కష్టం అవుతుంది. దానివల్ల జీర్ణవ్యవస్థకు తీవ్ర హాని కలుగుతుంది. గొంతులో గరగర, నొప్పి, జలుబు, ముక్కు కారడం వంటి సమస్యలు తీవ్రం అవుతాయి.
సిట్రస్ జాతి పండ్లు...
విటమిన్ సీ అధికంగా ఉండే కమలా, బత్తాయి, నిమ్మ వంటి పండ్లు తీసుకోవడం వల్ల వాటిని అరిగించే క్రమంలో కడుపులో తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అసిడిటీ, గొంతు మంట వంటి ఇబ్బందులు కలుగుతాయి.
ఆవకాయ వంటి ఊరగాయలు...
వింటర్‌లో ఊరగాయలు తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే నిల్వ ఉండటం కోసం ఊరగాయలలో ఉప్పు, నూనె, కారం వంటివి కొంచెం ఎక్కువమొత్తంలో వాడతారు. వాటిని అరిగించడం జీర్ణవ్యవస్థకు కాస్తంత భారమైన పనే. ఊరగాయలలో కూడా మామిడికాయలతో పెట్టిన ఆవకాయ, మాగాయ వంటివి తినడమంటే జీర్ణవ్యవస్థకు మరింత పని పెట్టినట్టే కాబట్టి వాటికి కాస్తంత దూరంగా ఉండటం మంచిది.
మసాలా పదార్థాలు...
మసాలాలు దట్టించి చేసిన పదార్థాలంటే భారతీయులకు అందులోనూ తెలుగు వాళ్లకు చాలా ఇష్టం. అయితే ఈ సీజన్‌లో మసాలాలను దేహం అరిగించుకోలేదు కాబట్టి వాటిని కూడా దూరం పెట్టడమే మేలు.
Comments
Please login to add a commentAdd a comment