
శరీరానికి తగినంత శక్తి అందనప్పుడు ఆకలి నియంత్రణలో ఉండదు. దాంతో ఏవి పడితే అవి తినేస్తాం. దీన్ని అదుపులో ఉంచాలంటే.. పొద్దున పూట అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అందులోనూ మాంసకృత్తులూ, పీచు పదార్థాలు, కార్బో హైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆటోమేటిగ్గా మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకుంటాం. గుడ్లు, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలూ వంటివి మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
సన్నబడాలనుకునేవారు తినే పదార్థాల్లో అసలు కొవ్వే ఉండకూడదనుకుంటారు. ఇది పొరబాటు. శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగా పనిచేయాలంటే డైటరీ ఫ్యాట్ కూడా కొంతవరకూ అవసరమే అంటారు నిపుణులు. లేదంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే మేలుచేసే కొవ్వు పదార్థాలైన బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, రైస్‌బ్రాన్ ఆయిల్ వంటివి ఎంచుకోవాలి. అలాగే ఉప్పు కలపని తాజా వెన్న కూడా మంచిది. ఆవునెయ్యి తగు మోతాదులో పుచ్చుకోవచ్చు.
బరువు పెరగడానికి ప్రధాన కారణం.. మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సంక్లిష్ట పిండి పదార్థాలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి. సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment