మొదలైందా నెలసరి...ఈ ఆహారం సరి..! | Better Nutrition for periods time | Sakshi
Sakshi News home page

మొదలైందా నెలసరి...ఈ ఆహారం సరి..!

Published Thu, Dec 5 2013 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Better Nutrition for periods time

పాప రజస్వల అయ్యింది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు భర్తీ అవ్వాలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించమంటారు పొరుగువారు. ఆ మాట నిజమేనా? మరి అమ్మాయి సరిగా తినడం లేదే? ఏం చేయాలి. ఎటూ పాలుపోని ఈ పరిస్థితిపై అయోమయాలు తొలగిపోవాలంటే ఈ కథనం చదవండి. అమ్మాయి ఆరోగ్యాన్ని పరిరక్షించండి.
 
 పొరుగువారి మాటల్లో నిజమెంత?

 రుతుస్రావం సమయంలో నెత్తురు ఎక్కువగా పోతుంటుంది కాబట్టి ఆహారం ఎక్కువ మోతాదులో పెట్టాలని పొరుగువారు, ఫ్రెండ్స్ చెబుతుంటారు. అది నిజం కాదు. ఈ సమయంలోనే అమ్మాయిలు తాము తీసుకునే క్యాలరీల వల్ల బరువు పెరుగుతుంటారు. అందుకే ఆహారం ఎక్కువగా తీసుకోవడం కంటే... ఎప్పటిలాగే తీసుకుంటూ అదనంగా ఇక్కడ పేర్కొన్న ఎక్కువగా తీసుకోవాల్సిన పదార్థాలు తీసుకోవాలి.
 
 కొత్తగా రుతుస్రావం మొదలైన వారికి కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలోనూ, నువ్వుల్లోనూ కొవ్వు పాళ్లు ఎక్కువ కాబట్టి కాస్తంత పరిమితి పాటిస్తే మంచిది.
 
 నెయ్యికి బదులు వెన్న వాడాలి. ఎందుకంటే వెన్న కాచి నెయ్యి చేశాక అందులో కొన్ని పోషకాలు తగ్గుతాయి. అందుకే ఒక స్టెప్ ముందుగానే వాటిని తీసుకుంటే కొవ్వులో జీర్ణమయ్యే విటమిన్లను ఒంటబట్టించుకునేందుకు వెన్న దోహదం చేస్తుంది.
 
 ఎక్కువగా తీసుకోవాల్సినవి...
 మీరు శాకాహారులైతే... మీ రోజువారీ ఆహారం తోపాటు తాజాగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్), ఎండుఖర్జూరం, నువ్వులు, బెల్లం (బెల్లం, నువ్వులు ఉండే నువ్వుల జీళ్లు, బెల్లం, వేయించిన వేరుశనగలు ఉండే పల్లీపట్టీ కూడా మంచివే), గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండేలా చూడండి.
 
 మీరు మాంసాహారులైతే... మీ రోజువారీ ఆహారాన్నే తీసుకోండి. దాంతోపాటు మీ ఆహారంలో వేటమాంసం, చేపలు, చికెన్‌తో పాటు... మాంసాహారంలో లివర్‌ను ప్రత్యేకంగా ఇవ్వండి.
 
 మాంసాహారులైనా, శాకాహారులైనా... కోడిగుడ్డు, పాలు తప్పనిసరిగా రోజూ ఇవ్వండి. కోడిగుడ్డులో పచ్చసొన వద్దనే అపోహను తొలగించుకుని, దాన్ని అమ్మాయికి తప్పక ఇవ్వండి. ఎందుకంటే ఈ వయసులో వారు అది తీసుకోవడం వల్ల పచ్చసొన కారణంగా వచ్చే హానికరమైన కొలెస్ట్రాల్ కంటే, ఒకవేళ వారు గుడ్డు తీసుకోకపోతే కోల్పోయే పోషకాలే ఎక్కువ.
     
 ఇకపై ప్రతినెలా రక్తం కోల్పోతుండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గుతుంది. అందుకే రక్తహీనత రాకుండా ఐరన్‌ను భర్తీ చేయాల్సిన అవసరం ఉండటం వల్ల పై ఆహారాన్ని నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.
     
 మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉన్నప్పటికీ మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. అంటే... అది తిన్నవెంటనే ఒంటికి పడుతుంది. అదే శాకాహార పదార్థాల్లోని నాన్ హీమ్ ఐరన్ మన ఒంటికి పట్టాలంటే, అదనంగా విటమిన్-సి కావాలి. కాబట్టి ఐరన్ ఉండే శాకాహార పదార్థాలతో పాటు విటమిన్-సి ఉండే తాజా పండ్లు... జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
 
 ద్రవాహారం...
 
 రుతుస్రావం అవుతున్న సమయంలో ద్రవాహారం పుష్కలంగా లభించేలా ఎక్కువ నీళ్లు తాగుతూ, కొబ్బరినీళ్లు తీసుకోవడం కూడా మంచిదే.
 
 పరిమితంగా మాత్రమే తీసుకోవలసినవి...
 ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటివాటినీ, కొవ్వులు ఉండే ఆహారాలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
 
 కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా పరిమితంగా తీసుకోవాలి.
 
 వ్యాయామం...
 అన్నిటికంటే ముఖ్యంగా ఆ సమయంలోనూ తేలికపాటి వ్యాయామం చేయడం అవసరమని గుర్తుంచుకోండి.
 
 అస్సలు తీసుకోకూడనివి...
 బేకరీ ఐటమ్స్ అయిన చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాల వంటి జంక్‌ఫుడ్‌తో పాటు కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు.
 
 నిర్వహణ: యాసీన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement