ఆకాశాన్నంటిన ఆహార ధరలు
21 నెలల గరిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ జోరుగా ఉందని సంకేతాలు ఇస్తూ.. అంచనా వేసిన దానికంటే అధికంగా నమోదైన గత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాల ఉత్సాహం ఎన్నో రోజులు నిలవలేదు. సోమవారం విడుదలైన వినియోగదారుల సూచీ గణాంకాలు, మంగళవారం రిలీజ్ చేసిన టోకు ధరల సూచీ రెండూ పైకి ఎగిశాయి. మే నెల టోకు ధరల ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెల కూడా పెరిగి, 21 నెలల గరిష్ట స్థాయికి నమోదైందని గణాంకాలు తెలిపాయి. ఆహార ధరలు పెరగడంతో మే నెల టోకు ధరల ద్రవ్బోల్బణం 5.78శాతానికి ఎగిసింది. కూరగాయలు ధరలు రెండంకెల సంఖ్యలో పెరిగాయని, పప్పులు, గుడ్లు, మాంసాలు, ఫిష్ వంటి ధరలు మే నెలలో ఒక్కసారిగా ఎగిసి, మార్కెట్లో చుక్కలు చూపించాయని గణాంకాల్లో వెల్లడైంది.
పప్పు ధాన్యాలను మినహాయిస్తే, ఆహార ఉత్పత్తుల ధరలేమీ రుతుపవనాలపై ఆధారపడవని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఎకనామిస్ట్ సునీల్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్ బీఐ రేట్ల కోతకు విఘాతం కలిగిస్తున్నాయి. 2017 జనవరి వరకు ద్రవ్యోల్బణం 5శాతానికి దించాలని ఆర్ బీఐ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ గా కమోడిటీ ధరలు తగ్గడంతో గత రెండేళ్ల నుంచి తక్కువ ద్రవ్యోల్బణంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటూ వస్తోంది. అయితే ఒక్కసారిగా ఈ ధరలు పెరుగుతుండటంతో మోదీ ప్రభుత్వానికి ఇది అతిపెద్ద సవాలుగా మారనుంది. ఈ పెరుగుదలతో ఆర్థిక శాఖ విశ్లేషకులు భయాందోళను వ్యక్తంచేస్తున్నారు. మే 1నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు 5శాతం పెరిగాయి. ఆహార ధరలు కూడా గతనెల పైకి ఎగిశాయి.