చివర్లో కొనుగోళ్ల జోష్
ముందురోజుకు విరుద్ధంగా స్టాక్ మార్కెట్లు వారాంతాన పుంజుకున్నాయి. చివర్లో అమాంతం ఊపందుకున్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 173 పాయింట్లు ఎగసింది. ఇది గత నెల రోజుల్లోనే అత్యధిక లాభంకాగా 20,367 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 47 పాయింట్లు ఎగసి 6,048 వద్ద స్థిరపడింది. గురువారం 255 పాయింట్లు నష్టపోవడం ద్వారా సెన్సెక్స్ నాలుగు నెలల కనిష్టం వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, జనవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్టమైన 5%కు ఉపశమించడంతో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇన్వెస్టర్లలో అంచనాలు పెరిగాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే రిటైల్ ద్రవ్యోల్బణం సైతం రెండేళ్ల కనిష్టానికి చేరిన విషయం విదితమే. ఇక మరోవైపు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాలతో ట్రేడవడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని తెలిపారు.
ఐటీ, ఆయిల్ ఓకే
ఐటీ, ఆయిల్ రంగాలు 1% చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్ అత్యధికంగా 3.3% ఎగసింది. జనవరిలో జేఎల్‌ఆర్ విక్రయాలు పుంజుకోవడం సహకరించింది. ఇక గెయిల్, ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.5-1.5% మధ్య లాభపడ్డాయి. అయితే బజాజ్ ఆటో, భెల్, సిప్లా, హీరో మోటో, ఎస్‌బీఐ 3.5-1.5% మధ్య డీ లాపడ్డాయి. చిన్న షేర్లలో ఆమ్టెక్ ఆటో, సింఫనీ, ఆమ్టెక్ ఇండియా, టాటా ఎలక్సీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్, కాక్స్ అండ్ కింగ్స్, ఫైనాన్షియల్ టెక్, పీసీ జ్యువెలర్స్ 19-5% మధ్య దూసుకెళ్లాయి