దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతకుముందు రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో కీలక స్టాక్స్‌లో మదుపర్లు లాభాలను స్వీకరించారు.
మరోవైపు నిన్న వెలువడ్డ ఇన్ఫోసిస్ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. నిఫ్టీలో దీని వాటా అధికంగా ఉండడంతో ఇది సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో సెప్టెంబరులో రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠమైన 5.02 శాతంగా నమోదైంది. ఇది ఒకింత మార్కెట్‌కు పాజిటివ్ విషయం. అయినప్పటికీ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.
నిఫ్టీ గత ముగింపుతో పోలిస్తే 140 పాయింట్లు నష్టంతో ప్రారంభమై ఉదయం 9:37 వరకు కొంత పుంజుకుని 19721 వద్ద ట్రేడవుతుంది. సెన్సెక్స్ 286 పాయింట్ల నష్టపోయి 66,121.52 వద్ద ట్రేడవుతుంది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22కు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, యాక్సిక్‌బ్యాంక్, ఎస్‌బీఐ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీలు మాత్రం నష్టంలో ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అక్కడ వెలువడిన సెప్టెంబరు నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు మదుపర్లను నిరాశపర్చాయి. ఐరోపా సూచీలు మాత్రం లాభాల్లో స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 86.48 డాలర్లకు చేరింది.
టాటా స్టీల్ లాంగ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సాయి సిల్క్స్ కళామందిర్, డెన్ నెట్‌వర్క్స్, ఆదిత్య బిర్లా మనీ, మిత్తల్ లైఫ్ స్టైల్ కంపెనీలు ఈరోజు ఫలితాలు ప్రకటించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment