ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి అర్ధభాగంలో అటూఇటుగా పనితీరు చూపిన టైర్ల తయారీ కంపెనీలు ఇకపై పుంజుకోనున్నాయి. ఇందుకు ప్రధానంగా ముడివ్యయాలు తగ్గుతుండటం, డిమాండు ఊపందుకోనుండటం దోహదపడనుంది. వెరసి టైర్ల కంపెనీల షేర్లు ఇకపై జోరందుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..
ఇటీవలే ముగిసిన ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో టైర్ల తయారీ కంపెనీలు మిశ్రమ ఫలితాలు సాధించాయి. అయితే భవిష్యత్లో అమ్మకాలు బలపడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వాహన తయారీ దిగ్గజాల(ఓఈఎం) నుంచి ఆర్డర్లు పెరగడంతోపాటు.. సెకండరీ(రీప్లేస్‌మెంట్) మార్కెట్ నుంచి టైర్లకు డిమాండు మెరుగుపడుతోంది. ఇది విక్రయాలకు ఊపునివ్వనుంది.
ఇవికాకుండా మరోవైపు ముడిచమురు ధరలు దిగిరావడంతో సంబంధిత ముడిసరుకుల వ్యయాలు తగ్గుతున్నాయి. దీనికి నేచురల్ రబ్బర్ ధరలు నీరసించడం జత కలుస్తోంది. అమ్మకాలతో పోలిస్తే టైర్ల తయారీలో ఈ రెండింటి సంబంధ ముడివ్యయాలే 60 శాతాన్ని ఆక్రమిస్తుంటాయి. దీంతో లాభదాయకత మెరుగుపడేందుకు వీలుంటుంది.
ముడివ్యయాల ఎఫెక్ట్
త్రైమాసికవారీగా చూస్తే క్యూ2లో సియట్ స్థూల మార్జిన్లను 0.82 శాతం, అపోలో టైర్స్ 0.1 శాతం చొప్పున మెరుగుపరచుకున్నాయి. అయితే మరో దిగ్గజం ఎంఆర్‌ఎఫ్ మార్జిన్లు మాత్రం 1.8 శాతం నీరసించాయి. భారీగా పెరిగిన ముడివ్యయాల ధరలను కస్టమర్లకు పూర్తిస్థాయిలో బదిలీ చేయకపోవడం ప్రభావం చూపింది. ఎగుమతులపై అధికంగా ఆధారపడే ఆఫ్‌రోడ్ టైర్ల దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్థూల మార్జిన్లు త్రైమాసికవారీగా 2.2 శాతం క్షీణించాయి. ప్రధానంగా ముడిసరుకులు, రవాణా వ్యయాలు పెరగడంతో టైర్ల పరిశ్రమ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు మార్జిన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తెలియజేసింది. అయితే చమురు డెరివేటివ్స్, రబ్బర్ ధరలు వెనకడుగు వేస్తుండటంతో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్–మార్చి)లో మార్జిన్లు బలపడవచ్చని అంచనా వేసింది. జులై నుంచి దిగివస్తున్న ముడిచమురు ధరలు మార్చిలో నమోదైన చరిత్రాత్మక గరిష్టం నుంచి 35 శాతం క్షీణించాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనలతో రబ్బర్ ధరలు సైతం కొన్నేళ్ల కనిష్టాలను తాకుతున్నాయి. కోవిడ్–19 ప్రభావంతో చైనా నుంచి టైర్లకు డిమాండు తగ్గడం ప్రభావం చూపుతోంది.
మార్జిన్లకు బలిమి
మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ అంచనా ప్రకారం నేచురల్, సింథటిక్ రబ్బర్, కార్బన్ బ్లాక్ ధరలు 10 శాతం తగ్గితే.. నిర్వహణ లాభ మార్జిన్లు 1.6 శాతం, 0.8 శాతం, 1 శాతం చొప్పున బలపడతాయి. కాగా.. యూరోపియన్ మార్కెట్లలో అనిశ్చితుల కారణంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ఇటీవల నీర సించగా.. మార్జిన్ల ప్రభావంతో నెల రోజులుగా ఎంఆర్‌ఎఫ్ స్టాక్ హెచ్చుతగ్గుల మధ్య అక్కడక్కడే అన్నట్లుగా కదులుతోంది. ఇదే కాలంలో అపోలో టైర్స్, జేకే టైర్స్ సైతం ఒడిదొడుకులు ఎదుర్కోగా గత ఆరు నెలల కాలంలో ఈ రెండు స్టాక్స్ 17–47 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే గత మూడు నెలల్లో సియట్ షేరు 27 శాతం లాభపడటం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment