2021లో పెట్టుబడికి 6 స్టాక్స్‌ | 6 Stock recommendations for 2021 from brokerages | Sakshi
Sakshi News home page

2021లో పెట్టుబడికి 6 స్టాక్స్‌

Published Sat, Jan 2 2021 2:30 PM | Last Updated on Sat, Jan 2 2021 4:49 PM

6 Stock recommendations for 2021 from brokerages - Sakshi

ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను కోవిడ్‌-19 కలవర పెట్టినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు ఏడాది కాలంలో బలంగా పుంజుకున్నాయి. మార్చిలో నమోదైన మూడేళ్ల కనిష్టాల నుంచి 79 శాతం ర్యాలీ చేయగా.. ఇటీవల సరికొత్త గరిష్ట రికార్డులను సైతం సాధించాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అమలు చేసిన సహాయక ప్యాకేజీలతో లిక్విడిటీ భారీగా పెరిగింది. దీనికితోడు.. ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడనున్న అంచనాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి 2021లోనూ మార్కెట్లు లాభాల దౌడు తీసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే కొంతమేర కన్సాలిడేషన్‌ జరిగే వీలున్నట్లు చెప్పారు. (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!)

ప్లస్‌- మైనస్‌..
రికవరీ బాటపట్టిన ఆర్థిక వ్యవస్థ కారణంగా కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలుంది. మరోవైపు కోవిడ్‌-19 కట్టడికి ఇప్పటికే యూకే, యూఎస్‌, భారత్‌సహా పలు దేశాలు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు బుల్‌ ట్రెండ్‌లో కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది(2021)లో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 15,000 పాయింట్ల సమీపానికి చేరుకోగలదని రీసెర్చ్‌ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేసింది. ఫండమెంటల్‌ విలువలో చూస్తే 13,500 స్థాయిలో నిఫ్టీకి బలమైన సపోర్ట్‌ లభించగలదని అభిప్రాయపడింది. ఒకవేళ రిస్కులు పెరిగి ఈక్విటీలలో అమ్మకాల పరిస్థితి తలెత్తితే నిఫ్టీ 11,600 వరకూ తిరోగమించే అవకాశమున్నదని వివరించింది. 2020 నవంబర్‌వరకూ చూస్తే గత 12 నెలల కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 17.7 బిలియన్‌ డాలర్లను పంప్‌ చేశారు. ఒక్క నవంబర్‌లోనే ఏకంగా 8.3 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేశారు. ఇందుకు చౌక వడ్డీ రేట్లతో భారీగా లభిస్తున్న నిధులు కారణమైనట్లు రీసెర్చ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇది కొనసాగితే మార్కెట్లు మరింత పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది. అయితే పెట్టుబడుల ట్రెండ్‌ యూటర్న్‌ తీసుకుంటే.. మార్కెట్లు పతనమయ్చే చాన్స్‌ కూడా ఉన్నదని తెలియజేసింది. (రికవరీ అంచనాలను మించుతోంది: ఆర్‌బీఐ)

అప్రమత్తత అవసరం
ప్రస్తుతం మార్కెట్లు కొంతమేర ఖరీదుగా ఉన్నట్లు బ్రోకింగ్‌ సంస్థ షేర్‌ఖాన్‌ పేర్కొంది. 22- 23 రెట్లు పీఈ(అధిక విలువ)లో కదులుతున్నట్లు తెలియజేసింది. ఫలితంగా మార్కెట్లలో కరెక్షన్స్‌ వచ్చినప్పుడు మాత్రమే ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్ట్‌ చేయడం మేలని బ్రోకింగ్‌ సంస్థలు సూచించాయి. ప్రధానంగా ఫార్మా, ఐటీ, ఇంజినీరింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని  షేర్‌ఖాన్‌ అభిప్రాయపడింది. రీసెర్చ్‌ సంస్థల పెట్టుబడి సలహాలు పరిశీలిద్దాం..

బంధన్‌ బ్యాంక్
దేశవ్యాప్తంగా 20 శాతం వాటాతో మైక్రో ఫైనాన్స్‌ విభాగం(ఎంఎఫ్‌ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా వాటాను సొంతం చేసుకుంది. కార్యకలాపాల వృద్ధితో బ్యాలన్స్‌షీట్‌ను పటిష్ట పరచుకుంది. 2 కోట్ల కస్టమర్లు, రూ. 76,000 కోట్ల లోన్‌బుక్‌ను కలిగి ఉంది. గృహ ఫైనాన్స్‌ విలీనం తదుపరి లోన్‌బుక్‌లో మార్టిగేజ్‌ విభాగం వాటా 26 శాతానికి చేరింది. రానున్న ఐదేళ్ల కాలంలో పూర్తిస్థాయి బ్యాంకింగ్‌ సౌకర్యాల ద్వారా మధ్య, తక్కువస్థాయి ఆదాయ గ్రూప్‌లో పట్టుసాధించాలని ప్రణాళికలు వేసింది.

బిర్లా కార్పొరేషన్‌
దేశీ సిమెంట్‌ పరిశ్రమలో 4.2 శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుంది. ప్రధానంగా మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌ మార్కెట్లలో పట్టుసాధించింది. పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రలలోనూ పటిష్ట కార్యకలాపాలు కలిగి ఉంది. సిమెంట్‌ తయారీ సామర్థ్యాన్ని విస్తరించే ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతమున్న 15.6 ఎంటీపీఏ సామర్థ్యాన్ని 2025కల్లా 25 ఎంటీపీఏకు పెంచుకోవాలని చూస్తోంది.

హెచ్‌యూఎల్‌
ఎఫ్‌ఎంసీజీ రంగంలో పలు విభాగాలలో మార్కెట్‌ లీడర్‌గా నిలుస్తోంది‌. 70 లక్షలకుపైగా ఔట్‌లెట్లతో విస్తృత పంపిణీ నెట్‌వర్క్‌ కంపెనీ సొంతం. రుణ రహితమేకాకుండా రూ. 5,100 కోట్లకుపైగా నగదు నిల్వలు కలిగి ఉంది. ఇటీవలే జీఎస్‌కే కన్జూమర్‌ బిజినెస్‌ను చేజిక్కించుకుంది. తద్వారా రానున్న రెండు, మూడేళ్లలో మరింత లబ్ది పొందనుంది. 2020 సెప్టెంబర్‌కల్లా హైజీన్‌ విభాగంలో 100 ఎస్‌కేయూలను ప్రవేశపెట్టింది. వీటికితోడు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార బ్రాండ్లు సగటున 10 శాతం వృద్ధిని చూపుతున్నాయి. 

- హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ నివేదిక

హాకిన్స్‌ కుకర్స్‌
ప్రధానంగా ప్రెజర్‌ కుకర్స్‌, కుక్‌వేర్‌ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ రంగంలోని పోటీ కంపెనీలతో పోలిస్తే ఆదాయంలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది. మార్కెట్‌ వాటాను పెంచుకుంటూ వస్తోంది. వంటగ్యాస్‌ కనెక్షన్లు పెరగడం, కంపెనీకున్న బ్రాండ్‌ ప్రాచుర్యం, విస్తృత నెట్‌వర్క్‌ వంటి అంశాల రీత్యా భవిష‍్యత్‌లోనూ పటిష్ట అమ్మకాలు సాధించే వీలుంది. కోవిడ్‌-19 నేపథ్యంలో కిచెన్‌ ప్రొడక్టులకు పెరిగిన డిమాండ్‌ కంపెనీకి మేలు చేయనుంది.

వర్ల్‌పూల్‌ ఇండియా
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండిషనర్లు, మైక్రోవేవ్‌ ఒవెన్లు తదితర పలు వైట్‌గూడ్స్‌ ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తోంది. అంతేకాకుండా చిన్నతరహా అప్లయెన్సెస్‌ను సైతం రూపొందిస్తోంది. దేశ, విదేశీ మార్కెట్లో వీటిని మార్కెటింగ్‌ చేస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు ప్రొడక్టులకు దేశీ మార్కెట్లలో అధిక అవకాశాలున్నాయి. మరోవైపు అధిక డిమాండ్‌ కనిపిస్తున్న వాటర్‌ ప్యూరిఫయర్‌, ఏసీలు, కిచెన్‌ చిమ్నీల తయారీలోకీ ప్రవేశించింది. సుప్రసిద్ధ బ్రాండ్‌కావడం, విస్తార పంపిణీ నెట్‌వర్క్‌, పటిష్ట పోర్ట్‌ఫోలియో,  సామర్థ్య విస్తరణ వంటి అంశాలు కంపెనీ బలాలుగా చెప్పవచ్చు.

రాడికో ఖైతాన్‌
ఐఎంఎఫ్‌ఎల్‌ తయారీకి దేశీ సంస్థలలో ముందు వరుసలో నిలుస్తోంది. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కలిగి ఉంది. మ్యాజిక్‌ మొమెంట్స్‌ వోడ్కా, 8 పీఎం ప్రీమియం బ్లాక్‌ విస్కీ తదితర బ్రాండ్లు సుప్రసిద్ధం. సెప్టెంబర్‌ క్వార్టర్‌(క్యూ2)లో పోటీ సంస్థల ఆదాయాలు క్షీణతను నమోదు చేసినప్పటికీ అమ్మకాలలో 11 శాతం వృద్ధిని సాధించడం గమనించదగ్గ అంశం. కొత్త ప్రొడక్టుల విడుదల, మార్కెట్‌ వాటాను పెంచుకుంటుండటం, ప్రీమియం బ్రాండ్లపై దృష్టి, విస్తృత పంపిణీ నెట్‌వర్క్‌ వంటి అంశాలు కంపెనీకి మద్దతిస్తున్నాయి. 

- అమర్‌జీత్‌ మౌర్య, ఏవీపీ(మిడ్‌క్యాప్స్‌), ఏంజెల్‌ బ్రోకింగ్‌

(గమనిక: ఇవి రీసెర్చ్‌ సంస్థల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దిగేముందు సంబంధిత నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement