stock investors
-
వచ్చే వారం మార్కెట్లకు ఐటీ జోష్
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగ దిగ్గజాలు జోష్‌నిచ్చే వీలుంది. వారాంతాన పటిష్ట ఫలితాలు సాధించడం ద్వారా నంబర్ వన్ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో గత వారం(4-8) మార్కెట్లు 2 శాతం ఎగశాయి. వెరసి సెన్సెక్స్ 913 పాయింట్లు లాభపడి 48,782 వద్ద నిలవగా.. నిఫ్టీ 329 పాయింట్లు ఎగసి 14,347 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. 2009 తదుపరి వరుసగా 10 వారాలపాటు లాభాలతో నిలిచిన రికార్డును సైతం మార్కెట్లు సాధించాయి. గత వారాంతానికి బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి దాదాపు రూ. 196 లక్షల కోట్లను తాకడం విశేషం! ఇకపై మార్కెట్లు మరింత జోరందుకునే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యూ3(అక్టోబర్- డిసెంబర్) ఫలితాలు ప్రకటించనుండటంతో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు పేర్కొంటున్నారు. చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్) జాబితా ఇలా నేడు(9న) డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ క్యూ3 ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇన్ఫోసిస్, విప్రో 13న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 15న పనితీరును వెల్లడించనున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో జీడీపీ 7.7 శాతమే క్షీణించనున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు దాదాపు ఏడాది గరిష్టాలకు చేరాయి. ఇది కొంతమేర ఆందోళనకర అంశమే అయినప్పటికీ యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు చేపట్టనుండటం, తద్వారా ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి తెరతీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. (యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్) ఎఫ్‌పీఐల దన్ను గత వారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో రూ. 8,758 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఎఫ్‌పీఐలు గత రెండు నెలల్లోనూ రికార్డు స్థాయిలో 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పంప్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2021 తొలి వారంలోనూ దేశీ మార్కెట్లు రికార్డుల ర్యాలీ బాటలో కొనసాగుతున్నాయి. ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో అంతరర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో స్వల్ప కరెక్షన్ల నడుమ మార్కెట్లు మరింత వృద్ధి చూపుతున్నట్లు తెలియజేశారు. -
2021లో పెట్టుబడికి 6 స్టాక్స్
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను కోవిడ్-19 కలవర పెట్టినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు ఏడాది కాలంలో బలంగా పుంజుకున్నాయి. మార్చిలో నమోదైన మూడేళ్ల కనిష్టాల నుంచి 79 శాతం ర్యాలీ చేయగా.. ఇటీవల సరికొత్త గరిష్ట రికార్డులను సైతం సాధించాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అమలు చేసిన సహాయక ప్యాకేజీలతో లిక్విడిటీ భారీగా పెరిగింది. దీనికితోడు.. ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడనున్న అంచనాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి 2021లోనూ మార్కెట్లు లాభాల దౌడు తీసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే కొంతమేర కన్సాలిడేషన్ జరిగే వీలున్నట్లు చెప్పారు. (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) ప్లస్- మైనస్.. రికవరీ బాటపట్టిన ఆర్థిక వ్యవస్థ కారణంగా కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలుంది. మరోవైపు కోవిడ్-19 కట్టడికి ఇప్పటికే యూకే, యూఎస్, భారత్‌సహా పలు దేశాలు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది(2021)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 15,000 పాయింట్ల సమీపానికి చేరుకోగలదని రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేసింది. ఫండమెంటల్ విలువలో చూస్తే 13,500 స్థాయిలో నిఫ్టీకి బలమైన సపోర్ట్ లభించగలదని అభిప్రాయపడింది. ఒకవేళ రిస్కులు పెరిగి ఈక్విటీలలో అమ్మకాల పరిస్థితి తలెత్తితే నిఫ్టీ 11,600 వరకూ తిరోగమించే అవకాశమున్నదని వివరించింది. 2020 నవంబర్వరకూ చూస్తే గత 12 నెలల కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 17.7 బిలియన్ డాలర్లను పంప్ చేశారు. ఒక్క నవంబర్లోనే ఏకంగా 8.3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందుకు చౌక వడ్డీ రేట్లతో భారీగా లభిస్తున్న నిధులు కారణమైనట్లు రీసెర్చ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది కొనసాగితే మార్కెట్లు మరింత పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది. అయితే పెట్టుబడుల ట్రెండ్ యూటర్న్ తీసుకుంటే.. మార్కెట్లు పతనమయ్చే చాన్స్ కూడా ఉన్నదని తెలియజేసింది. (రికవరీ అంచనాలను మించుతోంది: ఆర్బీఐ) అప్రమత్తత అవసరం ప్రస్తుతం మార్కెట్లు కొంతమేర ఖరీదుగా ఉన్నట్లు బ్రోకింగ్ సంస్థ షేర్‌ఖాన్ పేర్కొంది. 22- 23 రెట్లు పీఈ(అధిక విలువ)లో కదులుతున్నట్లు తెలియజేసింది. ఫలితంగా మార్కెట్లలో కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్ట్ చేయడం మేలని బ్రోకింగ్ సంస్థలు సూచించాయి. ప్రధానంగా ఫార్మా, ఐటీ, ఇంజినీరింగ్, ఎన్బీఎఫ్సీ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని షేర్‌ఖాన్ అభిప్రాయపడింది. రీసెర్చ్ సంస్థల పెట్టుబడి సలహాలు పరిశీలిద్దాం.. బంధన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 20 శాతం వాటాతో మైక్రో ఫైనాన్స్ విభాగం(ఎంఎఫ్ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా వాటాను సొంతం చేసుకుంది. కార్యకలాపాల వృద్ధితో బ్యాలన్స్‌షీట్‌ను పటిష్ట పరచుకుంది. 2 కోట్ల కస్టమర్లు, రూ. 76,000 కోట్ల లోన్‌బుక్‌ను కలిగి ఉంది. గృహ ఫైనాన్స్ విలీనం తదుపరి లోన్‌బుక్‌లో మార్టిగేజ్ విభాగం వాటా 26 శాతానికి చేరింది. రానున్న ఐదేళ్ల కాలంలో పూర్తిస్థాయి బ్యాంకింగ్ సౌకర్యాల ద్వారా మధ్య, తక్కువస్థాయి ఆదాయ గ్రూప్‌లో పట్టుసాధించాలని ప్రణాళికలు వేసింది. బిర్లా కార్పొరేషన్ దేశీ సిమెంట్ పరిశ్రమలో 4.2 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ప్రధానంగా మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మార్కెట్లలో పట్టుసాధించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోనూ పటిష్ట కార్యకలాపాలు కలిగి ఉంది. సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించే ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతమున్న 15.6 ఎంటీపీఏ సామర్థ్యాన్ని 2025కల్లా 25 ఎంటీపీఏకు పెంచుకోవాలని చూస్తోంది. హెచ్‌యూఎల్ ఎఫ్ఎంసీజీ రంగంలో పలు విభాగాలలో మార్కెట్ లీడర్‌గా నిలుస్తోంది. 70 లక్షలకుపైగా ఔట్లెట్లతో విస్తృత పంపిణీ నెట్వర్క్ కంపెనీ సొంతం. రుణ రహితమేకాకుండా రూ. 5,100 కోట్లకుపైగా నగదు నిల్వలు కలిగి ఉంది. ఇటీవలే జీఎస్కే కన్జూమర్ బిజినెస్‌ను చేజిక్కించుకుంది. తద్వారా రానున్న రెండు, మూడేళ్లలో మరింత లబ్ది పొందనుంది. 2020 సెప్టెంబర్‌కల్లా హైజీన్ విభాగంలో 100 ఎస్‌కేయూలను ప్రవేశపెట్టింది. వీటికితోడు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార బ్రాండ్లు సగటున 10 శాతం వృద్ధిని చూపుతున్నాయి. - హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదిక హాకిన్స్ కుకర్స్ ప్రధానంగా ప్రెజర్ కుకర్స్, కుక్వేర్ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ రంగంలోని పోటీ కంపెనీలతో పోలిస్తే ఆదాయంలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది. మార్కెట్ వాటాను పెంచుకుంటూ వస్తోంది. వంటగ్యాస్ కనెక్షన్లు పెరగడం, కంపెనీకున్న బ్రాండ్ ప్రాచుర్యం, విస్తృత నెట్వర్క్ వంటి అంశాల రీత్యా భవిష్యత్‌లోనూ పటిష్ట అమ్మకాలు సాధించే వీలుంది. కోవిడ్-19 నేపథ్యంలో కిచెన్ ప్రొడక్టులకు పెరిగిన డిమాండ్ కంపెనీకి మేలు చేయనుంది. వర్ల్‌పూల్ ఇండియా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు తదితర పలు వైట్‌గూడ్స్ ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తోంది. అంతేకాకుండా చిన్నతరహా అప్లయెన్సెస్‌ను సైతం రూపొందిస్తోంది. దేశ, విదేశీ మార్కెట్లో వీటిని మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు ప్రొడక్టులకు దేశీ మార్కెట్లలో అధిక అవకాశాలున్నాయి. మరోవైపు అధిక డిమాండ్ కనిపిస్తున్న వాటర్ ప్యూరిఫయర్, ఏసీలు, కిచెన్ చిమ్నీల తయారీలోకీ ప్రవేశించింది. సుప్రసిద్ధ బ్రాండ్కావడం, విస్తార పంపిణీ నెట్వర్క్, పటిష్ట పోర్ట్‌ఫోలియో, సామర్థ్య విస్తరణ వంటి అంశాలు కంపెనీ బలాలుగా చెప్పవచ్చు. రాడికో ఖైతాన్ ఐఎంఎఫ్ఎల్ తయారీకి దేశీ సంస్థలలో ముందు వరుసలో నిలుస్తోంది. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కలిగి ఉంది. మ్యాజిక్ మొమెంట్స్ వోడ్కా, 8 పీఎం ప్రీమియం బ్లాక్ విస్కీ తదితర బ్రాండ్లు సుప్రసిద్ధం. సెప్టెంబర్ క్వార్టర్(క్యూ2)లో పోటీ సంస్థల ఆదాయాలు క్షీణతను నమోదు చేసినప్పటికీ అమ్మకాలలో 11 శాతం వృద్ధిని సాధించడం గమనించదగ్గ అంశం. కొత్త ప్రొడక్టుల విడుదల, మార్కెట్ వాటాను పెంచుకుంటుండటం, ప్రీమియం బ్రాండ్లపై దృష్టి, విస్తృత పంపిణీ నెట్వర్క్ వంటి అంశాలు కంపెనీకి మద్దతిస్తున్నాయి. - అమర్జీత్ మౌర్య, ఏవీపీ(మిడ్‌క్యాప్స్), ఏంజెల్ బ్రోకింగ్ (గమనిక: ఇవి రీసెర్చ్ సంస్థల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దిగేముందు సంబంధిత నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి) -
2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నుంచి దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. ప్రధానంగా ఈక్విటీలలో ఇప్పటివరకూ 22.6 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. ఇవి 2019లో నమోదైన 14.23 బిలియన్ డాలర్లతో పోలిస్తే 58 శాతం అధికంకావడం విశేషం! తద్వారా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులను ఆకట్టుకున్న దేశంగా చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇప్పటివరకూ చైనాకు 104 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలి వెళ్లాయి. అయితే 2019లో చైనా ఆకట్టుకున్న 132.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 21 శాతానికిపైగా తక్కువకావడం గమనార్హం! కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రూపొందించిన గణాంకాలివి. కాగా.. 2019లో 4.4 కోట్ల బిలియన్ డాలర్లను ఆకట్టుకున్న రష్యా 2020లో మరింత అధికంగా 12.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టింది. తద్వారా మూడో ర్యాంకులో నిలిచింది. చదవండి: (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ఏప్రిల్ నుంచీ జోరు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ రెండో వారంవరకూ చూస్తే దేశీ ఈక్విటీలలోకి రూ. 2 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు ప్రవహించాయి. వీటిలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం రూ. 63,000 కోట్లను ఆకట్టుకోగా.. రూ. 47,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంకింగ్ అగ్రభాగాన నిలిచింది. కోవిడ్-19 కారణంగా నిజానికి ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. అయితే నవంబర్‌లో గత 12 ఏళ్లలోలేని విధంగా 8.1 బిలియన్ డాలర్లను ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. ఇదే నెలలో భారత్ తదుపరి బ్రెజిల్(6.2 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా(5.2 బిలియన్ డాలర్లు), తైవాన్(4.5 బిలియన్ డాలర్లు) జాబితాలో చేరాయి. ఇక డిసెంబర్‌లోనూ ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలోకి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించడం ప్రస్తావించదగ్గ అంశం! 80 శాతం జూమ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కల్లోలంతో మార్చిలో స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. తదుపరి పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో విదేశీ పెట్టుబడులు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ 75 శాతానికిపైగా ర్యాలీ చేసి సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 47,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు చూస్తోంది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 81 శాతం దూసుకెళ్లి 31,000 సమీపానికి చేరింది. ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ 80 శాతం స్థాయిలో ఎగశాయి. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) చైనా వెనకడుగు ఈ ఏడాది(2020)లో చైనా, హాంకాంగ్‌ల నుంచి ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ నిధులు భారీగా క్షీణించాయి. ఈ రెండు ప్రాంతాల నుంచి దేశానికి తరలివచ్చిన పెట్టుబడులు 2019తో పోలిస్తే 72 శాతం పడిపోయాయి. 95.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాదిలో 340 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం మెయిన్‌ల్యాండ్ చైనా నుంచి 64 శాతం తక్కువగా 37.7 కోట్ల డాలర్లు, హాంకాంగ్ నుంచి 75 శాతం తక్కువగా 57.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. కాగా.. చైనీస్ సంస్థలు దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు దాఖలు చేసిన 150 అప్లకేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఖైటాన్ అండ్ కో తెలియజేసింది. పెట్టుబడులు తగ్గడానికి ప్రధానంగా ప్రెస్ నోట్3 నిబంధనలు కారణమైనట్లు లా సంస్థ ఖైటాన్ అభిప్రాయపడింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్‌లో ప్రభుత్వం పీఎన్3ను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం భారత్‌తో సరిహద్దు కలిగిన విదేశీ సంస్థలు ప్రభుత్వ అనుమతితోనే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని తెలియజేసింది. -
టెస్లా కార్లూ, షేర్లూ- మనకు భలే ఆసక్తి
ముంబై, సాక్షి: ఎలక్ట్రిక్ కార్ల యూఎస్ దిగ్గజం టెస్లా ఇంక్ తయారీ కార్లపై దేశీయంగా పలువురు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన టెస్లా ఇంక్ కౌంటర్లోనూ పెట్టుబడులకు దేశీ ఇన్వెస్టర్లు క్యూకడుతున్నారు. నిజానికి దేశీయంగా టెస్లా తయారీ కార్లు అందుబాటులో లేనప్పటికీ అటు కంపెనీ కార్లు కొనేందుకు, ఇటు షేర్లలో పెట్టుబడులకు పలువురు భారతీయులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు చూద్దాం. కొత్త ఫేవరెట్ ఈ ఏడాది(2020) దేశీ ఇన్వెస్టర్లు అమెరికన్ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మరింత ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ తదితర టెక్ దిగ్గజాల షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఇటీవల ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ కౌంటర్‌పై దృష్టిసారించినట్లు తెలియజేశారు. యాపిల్, అమెజాన్, ఫేస్బుక్ తదితర దిగ్గజాలు దేశీయంగా ఇన్వెస్టర్లు, వినియోగదారులకు చిరపరిచతమే అయినప్పటికీ టెస్లా ఇంక్ పట్ల ఆసక్తి చూపడం విశేషమని ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. వెరసి దేశీ ఇన్వెస్టర్లకు తాజాగా టెస్లా ఇంక్ షేరు హాట్ ఫేవరెట్‌గా మారినట్లు తెలియజేశారు. (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?) పెట్ట్టుబడులు.. నవంబర్‌లో టెస్లా ఇంక్ కౌంటర్లో ఇన్వెస్టర్లు 2.5 మిలియన్ డాలర్లను(రూ. 18 కోట్లకుపైగా) ఇన్వెస్ట్ చేసినట్లు దేశీ బ్రోకింగ్ సంస్థ వెస్టెడ్ ఫైనాన్స్ వెల్లడించింది. మార్చి చివరికల్లా ఈ పెట్టుబడులు 76,000 డాలర్లుగా మాత్రమే నమోదైనట్లు తెలియజేసింది. ఇదేకాలంలో టెస్లా ఇంక్‌లో దేశీ పెట్టుబడులు 10 మిలియన్ డాలర్లకు(రూ. 73 కోట్లకుపైగా) చేరినట్లు మరో బ్రోకింగ్ సంస్థ స్టాకాల్ వెల్లడించింది. ఈ కాలంలో టెస్లా ఇంక్ షేరు 450 శాతం దూసుకెళ్లడం గమనార్హం! కాగా.. కొంతమంది ఇన్వెస్టర్లు టెస్లా ఇంక్‌లో పెట్టుబడుల కోసమే ఖాతాలను తెరచినట్లు వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో వీరమ్ షా పేర్కొన్నారు. దేశీయంగా ఉనికిలేనప్పటికీ ఒక కంపెనీలో ఈ స్థాయి పెట్టుబడులను ఊహించలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. (టెస్లా షేరు జెట్ స్పీడ్- ఎందుకంట?) 1000 డాలర్లు టెస్లా ఇంక్ సీఈవో ఎలన్ మస్క్ ఇటీవల భారత్‌లోనూ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇటీవల ఈ కంపెనీ కార్లు, షేర్లపై ఆసక్తి పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో కార్లను విడుదల చేయనున్నట్లు మస్క్ అక్టోబర్‌లో ట్వీట్ ద్వారా ప్రస్తావించారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఎలన్ తాజాగా భారత్ మార్కెట్‌పై దృష్టి పెట్టి ఉండవచ్చని ఆటో వర్గాలు అభిప్రాయపడ్డాయి. .(టెస్లా జోరు- ఇక ఎస్అండ్పీలో చోటు!) 33 ఏళ్ల గౌరవ్ జున్‌జున్‌వాలా అనే వ్యక్తి టెస్లా ఇంక్ తయారీ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు కోసం ముందుస్తుగా 1,000 డాలర్లను బుకింగ్ ఫీజుగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ బయోగ్రఫీని చదివిన గౌరవ్.. టెస్లా ఇంక్పట్ల మక్కువను పెంచుకున్నట్లు బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మే నెలలో టెస్లా ఇంక్ షేర్లలో 1,000 డాలర్లు ఇన్వెస్ట్ చేసిన గౌరవ్ తదుపరి 30 షేర్ల చొప్పున సిప్కింద కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. టెస్లాలో పెట్టుబడులు తదితర అంశాలపై గౌరవ్ స్పందిస్తూ.. మస్క్ బాటలోనే తాను ఆలోచిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం! -
లాభాలతో షురూ- కొత్త గరిష్టాలకు మార్కెట్లు
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 238 పాయింట్లు జంప్‌చేసి 45,665కు చేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు పెరిగి 13,418 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,675 వద్ద, నిఫ్టీ 13,426 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి! ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో మెటల్(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఆటో 1.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, యూపీఎల్, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, గెయిల్, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్ 2.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, గ్రాసిమ్, ఐవోసీ, ఐసీఐసీఐ 1.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్, పీఎన్బీ, బీవోబీ, ఎక్సైడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూబీఎల్, ఐడియా 7.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు లుపిన్, జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,566 లాభపడగా.. 621 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే. -
కొత్త ఎఫ్‌పీఐలు పెరుగుతున్నాయ్!
దేశీయ మార్కెట్లో బలహీనత కొనసాగుతున్నా, కొత్తగా భారత్‌లో రిజిస్ట్రేషన్‌కు వస్తున్న విదేశీ ఫండ్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఒకపక్క ఉన్న ఎఫ్‌పీఐలు ఇబ్బడిముబ్బడిగా విక్రయాలకు దిగుతున్న సమయంలో కొత్తగా ఎఫ్‌పీఐలు రిజిస్టర్ కావడం పెరిగింది. మార్చి నుంచి ఇప్పటివరకు సెబి వద్ద దాదాపు 200కి పైగా కొత్త ఎఫ్‌పీఐలు రిజిస్టరయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 70--80 అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. వచ్చే రెండు మూడువారాల్లో వీటికి లైసెన్సులు మంజూరు కావచ్చు. ప్రస్తుతం ఇండియాలో రిజిస్టరయిన ఎఫ్‌ఐఐఉ 9789కి చేరాయి. గతమార్చిలో వీటి సంఖ్య 9533. మరోవైపు మార్చి నుంచ ఇప్పటివరకు ఉన్న ఎఫ్‌పీఐలు దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరిపాయి. దీంతో సూచీలు దాదాపు 25 శాతం పతనమయ్యాయి. డెట్‌మార్కెట్లలో విక్రయాలు కూడా కలిపితే దేశీయంగా ఎఫ్ఐఐల విక్రయాలు రూ. 1.43 లక్షల కోట్లకు చేరతాయి. ప్రస్తుతం కొత్తగా రిజిస్టరయితున్న ఎఫ్ఐఐల్లో ఎక్కువ శాతం మిడ్‌సైజ్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ ఎక్కువగా లాంగ్‌టర్మ్ ధృక్పథంతో ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నాయి. దేశీయ మార్కెట్లోకి గతేడాదిలో నెలకు కొత్తగా వచ్చే ఎఫ్ఐఐల సరాసరి సంఖ్య 87 కాగా, ఈ ఏడాది ఇది 114కు చేరిందని డాయిష్‌బ్యాంక్ తెలిపింది. విదేశీ నిధుల నిబంధనలను కొంతమేర సడలించడం, దేశీయ ఎకానమీపై బలమైన నమ్మకం, దీర్ఘకాలిక ధృక్పధంతో కొత్త విదేశీ ఫండ్స్ భారత్‌లోకి వస్తున్నాయని వివరించింది. ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇస్తాయన్న నమ్మకంతో విదేశీ ఫండ్స్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుంటున్నాయని ఖైతాన్ అండ్ కో ప్రతినిధి మోయిన్ లధా చెప్పారు. ఇలా రిజిస్టరయిన ఎఫ్‌పీఐల కారణంగా క్రమంగా తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. -
మార్కెట్లలో ‘కమల’వికాసం!
ఈ వారం మొదటిరోజే స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించనున్నాయని అత్యధిక శాతం మంది నిపుణులు అంచనా వేశారు. 4 ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడం సెంటిమెంట్‌కు జోష్‌నిస్తుందని అభిప్రాయపడ్డారు. వెరసి సోమవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు భారీ లాభాలతో(గ్యాపప్) ప్రారంభమయ్యే చాన్స్ ఉందన్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ 21,300 పాయింట్లను అధిగమించవచ్చునని చెప్పారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 2008లో నమోదు చేసుకున్న 6,357 పాయింట్ల ఇంట్రాడే రికార్డును చెరిపివేసే అవకాశం ఉందని వివరించారు. సమీపకాలానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లకు టానిక్‌లా పనిచేస్తాయని తెలిపారు. మొదట్లోనే రికార్డ్: సోమవారం ట్రేడింగ్‌లో ఇండె క్స్లు కచ్చితంగా లాభాలతో ప్రారంభమవుతాయని ఆశికా స్టాక్ బ్రోకర్స్ రీసెర్చ్ హెడ్ పరస్ బోత్రా అంచనా వేశారు. దీంతో మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేస్తాయని పేర్కొన్నారు. 2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు తదుపరి దశలో మార్కెట్లను నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేసిన గజేంద్ర నాగ్‌పాల్ ప్రస్తుతం సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నదని చెప్పారు. అయితే అధిక స్థాయిలవద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టే అవకాశమున్నదని తెలిపారు. ఆగ్మెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సీఈవో అయిన నాగ్‌పాల్ కేంద్రంలోనూ గుజరాత్ తరహా పాలన కోసం ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బీజేపీనా అన్న విషయాన్ని మార్కెట్లు పట్టించుకోవని, స్థిరమైన ప్రభుత్వమా కాదా అనేదే ముఖ్యమని ఇనామ్ ఫైనాన్షియల్ నిపుణులు వల్లభ్ భన్సాలీ వ్యాఖ్యానించారు. సంస్కరణల అమలులో వెనుకబడ్డ ప్రస్తుత ప్రభుత్వంపై మార్కెట్లలో వ్యతిరేకత ఉన్నదని చెప్పారు. 12న గణాంకాలు: వచ్చే గురువారం(12న) అక్టోబర్ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలతోపాటు, నవంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గ ణాంకాలు వెలువడనున్నాయి. ఇక 18న ఇటు రిజర్వ్ బ్యాంక్, అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) పరపతి విధాన సమీక్షలను చేపట్టనున్నాయి. దేశీయ ఎన్నికల ఫలితాలతోపాటు, అమెరికా ఆర్థిక గణాంకాల ఆధారంగా మార్కెట్లు కదులుతాయని కొటక్ సెక్యూరిటీస్‌కు చెందిన దీపేన్ షా చెప్పారు. కాగా, ఆర్థిక రికవరీని సూచిస్తూ నవంబర్ నెలకు అమెరికా ఉద్యోగ గణాంకాలు మెరుగ్గా వెలువడ్డాయి. దీంతో ఫెడ్ సహాయక ప్యాకేజీలలో కోతపై ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెల నుంచే ప్యాకేజీలో కోతను ఫెడ్ అమలు చేయవచ్చునని వెరాసిటీ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి అభిప్రాయపడ్డారు. ఇది దేశీయ మార్కెట్లను ఒత్తిడికి లోను చేస్తుందని చెప్పారు. గత శుక్రవారం సెన్సెక్స్ దాదాపు 21,000 పాయింట్ల వద్ద నిలవగా, నిఫ్టీ 6,260 వద్ద స్థిరపడింది.