ముంబై, సాక్షి: ఎలక్ట్రిక్ కార్ల యూఎస్ దిగ్గజం టెస్లా ఇంక్ తయారీ కార్లపై దేశీయంగా పలువురు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన టెస్లా ఇంక్ కౌంటర్లోనూ పెట్టుబడులకు దేశీ ఇన్వెస్టర్లు క్యూకడుతున్నారు. నిజానికి దేశీయంగా టెస్లా తయారీ కార్లు అందుబాటులో లేనప్పటికీ అటు కంపెనీ కార్లు కొనేందుకు, ఇటు షేర్లలో పెట్టుబడులకు పలువురు భారతీయులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు చూద్దాం.
కొత్త ఫేవరెట్
ఈ ఏడాది(2020) దేశీ ఇన్వెస్టర్లు అమెరికన్ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మరింత ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ తదితర టెక్ దిగ్గజాల షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఇటీవల ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ కౌంటర్‌పై దృష్టిసారించినట్లు తెలియజేశారు. యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ తదితర దిగ్గజాలు దేశీయంగా ఇన్వెస్టర్లు, వినియోగదారులకు చిరపరిచతమే అయినప్పటికీ టెస్లా ఇంక్ పట్ల ఆసక్తి చూపడం విశేషమని ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. వెరసి దేశీ ఇన్వెస్టర్లకు తాజాగా టెస్లా ఇంక్ షేరు హాట్ ఫేవరెట్‌గా మారినట్లు తెలియజేశారు. (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?)
పెట్ట్టుబడులు..
నవంబర్‌లో టెస్లా ఇంక్ కౌంటర్లో ఇన్వెస్టర్లు 2.5 మిలియన్ డాలర్లను(రూ. 18 కోట్లకుపైగా) ఇన్వెస్ట్ చేసినట్లు దేశీ బ్రోకింగ్ సంస్థ వెస్టెడ్ ఫైనాన్స్ వెల్లడించింది. మార్చి చివరికల్లా ఈ పెట్టుబడులు 76,000 డాలర్లుగా మాత్రమే నమోదైనట్లు తెలియజేసింది. ఇదేకాలంలో టెస్లా ఇంక్‌లో దేశీ పెట్టుబడులు 10 మిలియన్ డాలర్లకు(రూ. 73 కోట్లకుపైగా) చేరినట్లు మరో బ్రోకింగ్ సంస్థ స్టాకాల్ వెల్లడించింది. ఈ కాలంలో టెస్లా ఇంక్ షేరు 450 శాతం దూసుకెళ్లడం గమనార్హం! కాగా.. కొంతమంది ఇన్వెస్టర్లు టెస్లా ఇంక్‌లో పెట్టుబడుల కోసమే ఖాతాలను తెరచినట్లు వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో వీరమ్ షా పేర్కొన్నారు. దేశీయంగా ఉనికిలేనప్పటికీ ఒక కంపెనీలో ఈ స్థాయి పెట్టుబడులను ఊహించలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. (టెస్లా షేరు జెట్ స్పీడ్- ఎందుకంట?)
1000 డాలర్లు
టెస్లా ఇంక్ సీఈవో ఎలన్ మస్క్ ఇటీవల భారత్‌లోనూ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇటీవల ఈ కంపెనీ కార్లు, షేర్లపై ఆసక్తి పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో కార్లను విడుదల చేయనున్నట్లు మస్క్ అక్టోబర్‌లో ట్వీట్ ద్వారా ప్రస్తావించారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఎలన్ తాజాగా భారత్ మార్కెట్‌పై దృష్టి పెట్టి ఉండవచ్చని ఆటో వర్గాలు అభిప్రాయపడ్డాయి. .(టెస్లా జోరు- ఇక ఎస్‌అండ్‌పీలో చోటు!)
33 ఏళ్ల గౌరవ్ జున్‌జున్‌వాలా అనే వ్యక్తి టెస్లా ఇంక్ తయారీ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు కోసం ముందుస్తుగా 1,000 డాలర్లను బుకింగ్ ఫీజుగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ బయోగ్రఫీని చదివిన గౌరవ్.. టెస్లా ఇంక్‌పట్ల మక్కువను పెంచుకున్నట్లు బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మే నెలలో టెస్లా ఇంక్ షేర్లలో 1,000 డాలర్లు ఇన్వెస్ట్ చేసిన గౌరవ్ తదుపరి 30 షేర్ల చొప్పున సిప్‌కింద కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. టెస్లాలో పెట్టుబడులు తదితర అంశాలపై గౌరవ్ స్పందిస్తూ.. మస్క్ బాటలోనే తాను ఆలోచిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment