MMM Azani: MMM Announced India First Electric Supercar Azani Details In Telugu - Sakshi
Sakshi News home page

మన కారు ముందు ‘టెస్లా’ దిగదుడుపే!

Published Fri, Aug 6 2021 2:02 PM | Last Updated on Fri, Aug 6 2021 4:00 PM

MMM Announced India First Electric Supercar Azani Details - Sakshi

రౌద్రం, రణం, రుధిరం సింపుల్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ భారతీయ మూవీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. మీన్‌ మెటల్‌ మోటార్‌ సింపుల్‌గా ఎంఎంఎం. ఇండియన్‌ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో తాజాగా ఆసక్తి రేపిన స్టార్టప్‌. ఫస్ట్‌ ఇండియన్‌ సూపర్‌ కార్‌ తెస్తామంటూ రూట్‌మ్యాప్‌ ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన టెస్లాతో ఢీ అంటే ఢీ అంటున్నాడు భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్త శర్‌తక్‌పాల్‌. టెస్లా ఎస్‌ ప్లెయిడ్‌ 3ని మించిన ఫీచర్లతో కారు తయారు చేయబోతున్నట్టు ప్రకటించారు. టెస్లాకు సవాల్‌ విసిరాడు.

సాక్షి, వెబ్‌డెస్క్‌: రెండు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకునే నేర్పు... గరిష్ట వేగం గంటకి 350 కిలోమీటర్లు.... 100 హార్స్‌ పవర్‌ కలిగిన శక్తివంతమైన ఇంజన్‌.... ఒక్క సారి రీఛార్జీ చేస్తే చాలు 700 కి.మీల ప్రయాణం చేయగల సామర్థ్యం, .. ఇవన్నీ చదువుతుంటే టెస్లా కంపెనీ ఎస్‌ ప్లెయిడ్‌ 3 ఎలక్ట్రిక్‌ కారు గుర్తొస్తుందా.. కానీ ఇది ఎస్‌ ప్లెయిడ్‌ కాదు ఎంఎంఎం అజానీ ఎలక్ట్రిక్‌ కారు. తయారు చేస్తోంది ఏ విదేశీ కంపెనీయో కాదు పక్కా భారతీయ సంస్థ. దాని ఓనర్‌ శర్‌తక్‌పాల్‌.

ఇండియా వర్సెస్‌ టెస్లా
భారత్‌లో దిగుమతి సుంకాలు ఎక్కువని, వాటిని తగ్గిస్తే ఇండియాలో టెస్లా ఈవీ కార్లనె తెస్తామంటూ టెస్లా ఓనర్‌ ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు. దీనికి ప్రతిగా ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పెడితే పన్ను రాయితీ గురించి ఆలోచిస్తామంటూ భారత ప్రభుత్వం ఫీలర్‌ వదిలింది. మరోవైపు ఈవీ వెహికల్స్‌ తయారు చేసే సత్తా భారతీయులకు ఉందంటూ ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అధినేత భవీష్‌ అగర్వాల్‌ స్పందించారు.

టెస్లాకి సవాల్‌
ఈవీ వాహనాలు.. ఎలన్‌మస్క్‌... భారత్‌ల మధ్య రాజుకున్న వేడి ఇంకా చల్లారలేదు. ఇంతలోనే ఎలన్‌మస్క్‌కు షాక్‌ ఇచ్చే న్యూస్‌ మరో భారతీయుడైన శర్‌తక్‌పాల్‌ నుంచి వచ్చింది. ఎలన్‌మస్క్‌ తనకు ఆదర్శమని, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మార్కెట్‌లో టెస్లా ఓ బ్రాండ్‌ అని.. కానీ తాము బ్రాండ్‌ కిల్లర్‌ అంటూ సవాల్‌కు సై అన్నాడు. త్వరలో తన కంపెనీ నుంచి రాబోతున్న సూపర్‌ ఎలక్ట్రిక్‌ కారు విశేషాలను తెలియజేశాడు. భారత సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. 

ఎంఎంఎం
మీన్‌ మెటల్‌ మోటార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. సింపుల్‌గా ఎంఎంఎం. ఈ స్టార్టప్‌ని ముగ్గురు మిత్రులతో కలిసి 19 ఏళ్ల శర్‌తక్‌పాల్‌ 2012లో  నెలకొల్పాడు. ఆ తర్వాత 2014లోనే భవిష్యత్తును అంచనా వేసి  అజానీ అనే ‍ బ్రాండ్‌ నేమ్‌తో ఇండియన్‌ మేడ్‌ ఫాస్టెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కారును తయారు చేయాలని ఎంఎంఎ లక్ష్యంగా పెట్టుకుంది.  అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టార్టప్‌లో శ్రమిస్తున్న వారి సంఖ్య నాలుగు నుంచి ఇరవైరెండుకి పెరగగా.... ఫాస్టెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కారు కాన్సెప్టు  చివరి చేరుకుంది. త్వరలోనే అజానీ కారుతో సంచలనాలు సృష్టిస్తామంటూ తమ మార్కెట్‌ స్ట్రాటజీని ఇటీవల ఎంఎంఎ వెల్లడించింది.  

ఎంఎంఎం అజానీ
ఎంఎఎం ప్రైవేట్‌ లిమిలెడ్‌ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం... ఫస్ట్‌ ఇండియన్‌​ ఎలక్ట్రిక్‌ కారుగా వస్తోన్న అజానీ గరిష్ట వేగం గంటలకు 350 కిలోమీటర్లు, ఇందులో అమర్చిన 120 కిలోవాట్‌ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే చాలు స్పీడ్‌ మోడ్‌లను బట్టి కనిష్టంగా 550 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 700 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 986 బ్రేక్‌హార్స్‌ పవర్‌ ఇంజన్‌తో కేవలం రెండు సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడు అందుకోగల నేర్పు దీని స్వంతం. మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తోన్న స్పోర్ట్స్‌ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కారుని డిజైన్‌ ఉంటుంది. కంపెనీ రిలీజ్‌ చేసిన ఫోటోలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

మార్కెట్‌కి వచ్చేది అప్పుడే
అజానీ కారు 2022 ద్వితియార్థంలో అజానీ ప్రొటోటైప్‌ సిద్ధమవుతుందని ఎంఎంఎం ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలిపింది. అనంతరం 2023 ప్రారంభంలో యూకేలో ఈ కారుని ఫస్ట్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఆ మరుసటి ఏడాది యూఏఈలో అందుబాటులోకి తేనున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో జెండా పాతిన తర్వాత 2025లో ఇండియాకు అజానీని తీసుకువస్తామని చెబుతున్నారు. ఇండియాలో ఈ కారు ధర ఇండియాలో కనిష్టంగా 89 లక్షల నుంచి  రూ. 1.50 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.

అన్నింటా భిన్నమే
ప్రస్తుతం కార్‌ మాన్యుఫ్యా‍క్లరింగ్‌ యూనిట్లో ఐదో వంతు ఉండే యూనిట్‌తోనే అజానీ కార్లు తయారు చేయబోతున్నట్టు ఎంఎంఎం ప్రకటించింది. ఈ మేరకు కారు ఎయిరోడైనమిక్స్‌, రీసెచ్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లకు సంబంధించి ఎంఎంఎం టీమ్‌ సభ్యులు అమెరికా, జర్మనీలకు చెందిన ఇంజనీర్లతో  కలసికట్టుగా పని చేస్తున్నారు. వెంచర్‌ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు సమీకరిస్తున్నారు.

రెండేళ్లలో మార్పు
ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పట్ల ఇటు ప్రభుత్వం, అటు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నా.. మౌలిక సదుపాయల కొరత ఎక్కువని ఎంఎంఎం సీఈవో శర్‌తక్‌పాల్‌ అంటున్నారు. రెండేళ్లలో ఈ సమస్య తీరిపోతుందని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి సంబంధించి పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇండియా వెనుకబడి ఉందని,  అజానీ రాకతో ఈ పరిస్థితులో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement