దేశీయ మార్కెట్లో బలహీనత కొనసాగుతున్నా, కొత్తగా భారత్‌లో రిజిస్ట్రేషన్‌కు వస్తున్న విదేశీ ఫండ్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఒకపక్క ఉన్న ఎఫ్‌పీఐలు ఇబ్బడిముబ్బడిగా విక్రయాలకు దిగుతున్న సమయంలో కొత్తగా ఎఫ్‌పీఐలు రిజిస్టర్ కావడం పెరిగింది. మార్చి నుంచి ఇప్పటివరకు సెబి వద్ద దాదాపు 200కి పైగా కొత్త ఎఫ్‌పీఐలు రిజిస్టరయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 70--80 అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. వచ్చే రెండు మూడువారాల్లో వీటికి లైసెన్సులు మంజూరు కావచ్చు. ప్రస్తుతం ఇండియాలో రిజిస్టరయిన ఎఫ్‌ఐఐఉ 9789కి చేరాయి. గతమార్చిలో వీటి సంఖ్య 9533. మరోవైపు మార్చి నుంచ ఇప్పటివరకు ఉన్న ఎఫ్‌పీఐలు దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరిపాయి. దీంతో సూచీలు దాదాపు 25 శాతం పతనమయ్యాయి. డెట్‌మార్కెట్లలో విక్రయాలు కూడా కలిపితే దేశీయంగా ఎఫ్‌ఐఐల విక్రయాలు రూ. 1.43 లక్షల కోట్లకు చేరతాయి.
ప్రస్తుతం కొత్తగా రిజిస్టరయితున్న ఎఫ్‌ఐఐల్లో ఎక్కువ శాతం మిడ్‌సైజ్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ ఎక్కువగా లాంగ్‌టర్మ్ ధృక్పథంతో ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నాయి. దేశీయ మార్కెట్లోకి గతేడాదిలో నెలకు కొత్తగా వచ్చే ఎఫ్‌ఐఐల సరాసరి సంఖ్య 87 కాగా, ఈ ఏడాది ఇది 114కు చేరిందని డాయిష్‌బ్యాంక్ తెలిపింది. విదేశీ నిధుల నిబంధనలను కొంతమేర సడలించడం, దేశీయ ఎకానమీపై బలమైన నమ్మకం, దీర్ఘకాలిక ధృక్పధంతో కొత్త విదేశీ ఫండ్స్ భారత్‌లోకి వస్తున్నాయని వివరించింది. ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇస్తాయన్న నమ్మకంతో విదేశీ ఫండ్స్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుంటున్నాయని ఖైతాన్ అండ్ కో ప్రతినిధి మోయిన్ లధా చెప్పారు. ఇలా రిజిస్టరయిన ఎఫ్‌పీఐల కారణంగా క్రమంగా తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment