మార్కెట్లలో ‘కమల’వికాసం!
ఈ వారం మొదటిరోజే స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించనున్నాయని అత్యధిక శాతం మంది నిపుణులు అంచనా వేశారు. 4 ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడం సెంటిమెంట్‌కు జోష్‌నిస్తుందని అభిప్రాయపడ్డారు. వెరసి సోమవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు భారీ లాభాలతో(గ్యాపప్) ప్రారంభమయ్యే చాన్స్ ఉందన్నారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 21,300 పాయింట్లను అధిగమించవచ్చునని చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 2008లో నమోదు చేసుకున్న 6,357 పాయింట్ల ఇంట్రాడే రికార్డును చెరిపివేసే అవకాశం ఉందని వివరించారు. సమీపకాలానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లకు టానిక్‌లా పనిచేస్తాయని తెలిపారు.
మొదట్లోనే రికార్డ్: సోమవారం ట్రేడింగ్‌లో ఇండె క్స్‌లు కచ్చితంగా లాభాలతో ప్రారంభమవుతాయని ఆశికా స్టాక్ బ్రోకర్స్ రీసెర్చ్ హెడ్ పరస్ బోత్రా అంచనా వేశారు. దీంతో మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేస్తాయని పేర్కొన్నారు. 2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు తదుపరి దశలో మార్కెట్లను నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేసిన గజేంద్ర నాగ్‌పాల్ ప్రస్తుతం సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నదని చెప్పారు. అయితే అధిక స్థాయిలవద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టే అవకాశమున్నదని తెలిపారు. ఆగ్మెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సీఈవో అయిన నాగ్‌పాల్ కేంద్రంలోనూ గుజరాత్ తరహా పాలన కోసం ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బీజేపీనా అన్న విషయాన్ని మార్కెట్లు పట్టించుకోవని, స్థిరమైన ప్రభుత్వమా కాదా అనేదే ముఖ్యమని ఇనామ్ ఫైనాన్షియల్ నిపుణులు వల్లభ్ భన్సాలీ వ్యాఖ్యానించారు. సంస్కరణల అమలులో వెనుకబడ్డ ప్రస్తుత ప్రభుత్వంపై మార్కెట్లలో వ్యతిరేకత ఉన్నదని చెప్పారు.
12న గణాంకాలు: వచ్చే గురువారం(12న) అక్టోబర్ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలతోపాటు, నవంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గ ణాంకాలు వెలువడనున్నాయి. ఇక 18న ఇటు రిజర్వ్ బ్యాంక్, అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) పరపతి విధాన సమీక్షలను చేపట్టనున్నాయి. దేశీయ ఎన్నికల ఫలితాలతోపాటు, అమెరికా ఆర్థిక గణాంకాల ఆధారంగా మార్కెట్లు కదులుతాయని కొటక్ సెక్యూరిటీస్‌కు చెందిన దీపేన్ షా చెప్పారు. కాగా, ఆర్థిక రికవరీని సూచిస్తూ నవంబర్ నెలకు అమెరికా ఉద్యోగ గణాంకాలు మెరుగ్గా వెలువడ్డాయి. దీంతో ఫెడ్ సహాయక ప్యాకేజీలలో కోతపై ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెల నుంచే ప్యాకేజీలో కోతను ఫెడ్ అమలు చేయవచ్చునని వెరాసిటీ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి అభిప్రాయపడ్డారు. ఇది దేశీయ మార్కెట్లను ఒత్తిడికి లోను చేస్తుందని చెప్పారు. గత శుక్రవారం సెన్సెక్స్ దాదాపు 21,000 పాయింట్ల వద్ద నిలవగా, నిఫ్టీ 6,260 వద్ద స్థిరపడింది.