షాక్ మార్కెట్ | Algo-Trading Sent Sensex Crashing 723 Points Today: 10 Facts | Sakshi
Sakshi News home page

షాక్ మార్కెట్

Published Thu, May 7 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

షాక్ మార్కెట్

షాక్ మార్కెట్

సెన్సెక్స్...27,000 దిగువకు...723 పాయింట్లు క్రాష్
228 పాయింట్లు పడిన నిఫ్టీ... 8,100 కిందికి
ఈ ఏడాది  కనిష్ట స్థాయిలకు సూచీలు

భారత స్టాక్ మార్కెట్ బుధవారం  ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. జీఎస్‌టీ ఇతర ఆర్థిక సంస్కరణలు ఆశించినంతే వేగంగా లేవని ఆందోళన చెందిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 723 పాయింట్లు క్షీణించి, 26,717 పాయింట్లకు పడిపోయింది.

ఇక నిఫ్టీ 228 పాయింట్లు(2.74 శాతం) నష్టపోయి 8,097 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు సూచీలకు ఈ ఏడాది ఇదే అత్యంత కనిష్ట స్థాయిలు. నాలుగు నెలల్లో సెన్సెక్స్ ఒక్క రోజులో అధికంగా నష్టపోయింది కూడా ఇదే. కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో అతి పెద్ద పతనం. లోక్‌సభలో జీఎస్‌టీ బిల్లు గట్టెక్కినప్పటికీ, రాజకీయ వ్యతిరేకత బాగా ఉండటంతో సంస్కరణల ప్రక్రియ ఆలస్యమవుతుందనే ఆందోళనతో ఎఫ్‌ఐఐల అమ్మకాలు వరదలా వెల్లువెత్తాయి.

సేవల, తయారీ రంగాల్లో మందగమనం చోటు చేసుకోవడం, ఎఫ్‌ఐఐల పన్ను ఆందోళనలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరడం, అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే ఉండడం ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న రెండు వారాల్లో దాదాపు రెండు డజన్ల చైనా కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఈ ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడానికి విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నారని నిపుణులంటున్నారు. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌ఐఐల రూ.9,000 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.

ప్రపంచవ్యాప్తంగా సావరిన్ బాండ్ల విక్రయాలు పెరగడం కూడా భారత స్టాక్ మార్కెట్ పతన కారణాల్లో ఒకటి. అల్గోరిథమ్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై ట్రేడర్లు పిచ్చెత్తినట్లుగా అమ్మకాలు జరపడం కూడా స్టాక్ మార్కెట్ పతనానికి ఒక కారణమని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) జిగ్నేశ్ చౌదురి వ్యాఖ్యానించారు. నిఫ్టీకి కీలకమైన మద్దతుగా భావించిన 200 రోజుల సగటు కంటే నిఫ్టీ దిగువకు పడిపోవడంతో అల్గోరిథమ్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలు వెల్లువెత్తాయని వివరించారు.
 
ఐదు నెలల కనిష్ట స్థాయికి సెన్సెక్స్
కీలక బిల్లులపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విభేదాల పట్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. బుధవారం సెన్సెక్స్ స్వల్ప లాభాలతో (27,473 పాయింట్ల వద్ద) ప్రారంభమైంది. ఆతర్వాత 27,501 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో 27,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 26,678 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 723 పాయింట్ల (2.63 శాతం) భారీ నష్టంతో 26,717 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్‌జీసీ, సిప్లా, ఐటీసీ తదితర బ్లూ చిప్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ 228 పాయింట్లు(2.74 శాతం) నష్టపోయి 8,097 పాయింట్ల వద్ద ముగిసింది.
 
ఎదురీదిన ఎయిర్‌టెల్...
ఎంఎస్‌సీఐ గ్లోబల్ స్టాండర్ట్ ఇండెక్సెస్ సంస్థ ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్ వెయిటేజీని 1.3 శాతం నుంచి 2.6 శాతానికి పెంచిందన్న వార్తల కారణంగా 0.8 శాతం లాభంతో  భారతీ ఎయిర్‌టెల్ 390కు పెరిగింది. సెన్సెక్స్ షేర్లలో పెరిగిన ఏకైక షేర్ ఇదే. ఇక మొత్తం 12 రంగాల బీఎస్‌ఈ సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, విద్యుత్, బ్యాంక్, లోహ, రిఫైనరీ, ఆరోగ్య సంరక్షణ రంగాల షేర్లు బాగా పతనమయ్యాయి. ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీలు 3-6% రేంజ్‌లో పడిపోయాయి.

ఓఎన్‌జీసీ 3%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.5% చొప్పున పడ్డాయి.  భెల్ 6.21% నష్టపోయింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా పతనమైన షేర్ ఇదే. ఇదే బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ 4.9%, ఎల్ అండ్ టీ 4.6%, మారుతీ సుజుకీ 4.2%, ఎన్‌టీపీసీ 4 శాతం, సిప్లా 3.9 శాతం, ఓఎన్‌జీసీ 3.9%, యాక్సిస్ బ్యాంక్ 3.8%, టాటా పవర్ 3.7% చొప్పున పడిపోయాయి. 2,147 షేర్లు నష్టపోగా, 590 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,565 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.20,654 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్‌లో రూ. 2,94,267 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,700 కోట్లు నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1,455 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
 
రూ.2.89 లక్షల కోట్లు ఆవిరి...
సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ.2.89 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.99.11 లక్షల కోట్లకు చేరింది.
 
3 వారాల్లో 2,400 పాయింట్లు డౌన్

సంస్కరణలు జోరు పెరుగుతుందనే అంచనాలతో గత 9 నెలలుగా స్టాక్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 30,000 పాయింట్ల(జీవిత కాల గరిష్ట స్థాయి)కు కూడా చేరింది. అయితే ఎఫ్‌ఐఐల పన్ను ఆందోళనలు, సంస్కరణల జోష్ తగ్గడంతో గరిష్ట స్థాయి నుంచి 3,300 పాయింట్లు నష్టపోయింది. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వత లాభపడిన పాయింట్లలో సగం హరించుకుపోయింది.

గత మూడు వారాల్లోనే దాదాపు 2,400 పాయింట్లు(8%)పతనమైంది. ఎఫ్‌ఐఐల కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) ఆందోళనలు, నిరాశకు గురిచేస్తున్న కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, సగటు కన్నా తక్కువగానే ఈ ఏడాది వర్షాలు ఉంటాయన్న అంచనాలు దీనికి ప్రధాన కారణాలని  రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ (రీసెర్చ్) హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు.
 
సల్మాన్‌కు శిక్షతో తగ్గిన ఈరోస్, మంధన..
ప్రముఖ హిందీ సినిమా నటుడు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు శిక్ష పడిన నేపథ్యంలో ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా, మంధన ఇండస్రీస్ షేర్లు క్షీణించాయి. మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైన 2002 నాటి కేసులో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష పడింది. దీంతో ఆయనతో సంబంధమున్న ఈ రెండు కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈరోస్ ఇంటర్నేషనల్ షేర్ 6 శాతం క్షీణించి రూ.380కు, మంధన ఇండస్ట్రీస్ 3.5 శాతం తగ్గి రూ.265కు పడిపోయాయి.

ఈరోస్ మార్కెట్ క్యాప్ రూ.213 కోట్లు క్షీణించి రూ.3,523 కోట్లకు, మంధన ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.38 కోట్లు క్షీణించి రూ.876  కోట్లకు తగ్గింది.  సల్మాన్ ఖాన్ స్వచ్ఛంద సేవా సంస్థ బీయింగ్ హ్యుమన్ దుస్తుల డిజైనింగ్, మార్కెటింగ్, పంపిణీలకు మంధన ఇండస్ట్రీస్‌కు ఎక్స్‌క్లూజివ్ లెసైన్స్ ఒప్పందం ఉంది. ఇక ఈరోస్... సల్మాన్ ఖాన్‌తో రెండు సినిమాలు.. భజరంజి భాయ్‌జాన్, హీరో సినిమాలను నిర్మిస్తామని గత ఏడాది డిసెంబర్‌లో ప్రకటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement