ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు ఆరోరోజూ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు పెరిగి 56వేల స్థాయిపైన 56,072 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16,700 స్థాయిని అందుకొని 114 పాయింట్లు పెరిగి 16,719 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు మూడునెలల గరిష్టం. రూపాయి రికవరీతో డాలర్ల రూపంలో లాభాలను ఆర్జించే ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.675 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.739 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఐదు పైసలు పతనమై 79.90 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
వారం రోజుల్లో రూ.9.08 లక్షల కోట్లు: స్టాక్ మార్కెట్ ఈ వారమంతా లాభాలను గడించింది. సెన్సెక్స్ 2311 పాయింట్లు, నిఫ్టీ 670 పాయింట్లు లాభపడ్డాయి. గతేడాది(2021) ఫిబ్రవరి తర్వాత సూచీలు ఒక వారంలో ఈ స్థాయిలో ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 4% దూసుకెళ్లడంతో బీఎస్‌ఈలో రూ.9.08 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.261 లక్షల కోట్లకు ఎగసింది.
సెన్సెక్స్ ఉదయం 119 పాయింట్ల లాభంతో 55,801 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 16,661 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో తడబడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలతో తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 501 పాయింట్ల రేంజ్‌లో 55,685 వద్ద కనిష్టాన్ని, 56,186. వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 141 పాయింట్ల పరిధిలో 16,752 – 16,611 శ్రేణిలో ట్రేడైంది.
మూడు నెలల గరిష్టంలో ముగింపు
Published Sat, Jul 23 2022 1:45 AM | Last Updated on Sat, Jul 23 2022 9:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment