ఈ వారం స్టాక్‌ మార్కెట్ ఎలా ఉండబోతుంది? | weekly stock market analysis | Sakshi
Sakshi News home page

ఈ వారం స్టాక్‌ మార్కెట్ ఎలా ఉండబోతుంది?

Published Mon, Jul 18 2022 6:41 AM | Last Updated on Mon, Jul 18 2022 6:41 AM

weekly stock market analysis - Sakshi

ముంబై: స్టాక్‌ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ స్థిరీకరణ దిశగా సాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, కార్పొరేట్‌ ఫలితాలు సూచీలకు దిశానిర్దేశం చేయోచ్చంటున్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు క్రూడాయిల్, కమోడిటీ ధరలు, పార్లమెంట్‌వర్షాకాల సమావేశాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించవచ్చు.   

‘‘ఇటీవల క్రూడాయిల్‌తో పాటు కమోడిటీ ధరలు దిగివచ్చాయి. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల ఉధృతి తగ్గింది. మరోవైపు ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో స్టాక్‌ సూచీలు మరికొంత పాటు పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ స్థిరీకరణ దిశగా సాగొచ్చు. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన మద్దతు 16,00 స్థాయిపైన ముగిసింది. కొనుగోళ్లు కొనసాగితే జూన్‌ నెల గరిష్టం 16,275 స్థాయి వద్ద నిరోధం ఎదుర్కోనుంది. అటు పిదప 16,400–16,500 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే  నిఫ్టీకి 15,858 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,700–15,500 రేంజ్‌లో మద్దతు లభించొచ్చు’’ రిలిగేర్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. 
ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్టానికి దిగిరావడం, ఇప్పటి వరకు విడుదలైన కార్పొరేట్‌ క్యూ1 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ద్రవ్యోల్బణ పెరగడంతో ఫెడ్‌ రిజర్వ్‌ అంచనాలకు మించి వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలతో గతవారం స్టాక్‌ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌ 721 పాయింట్లు, నిఫ్టీ 171 పాయింట్లు చొప్పున క్షీణించాయి. 

మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే..,  

కీలక దశలో కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు  
ముందుగా నేడు మార్కెట్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది.  ఇక వారంలో సుమారు 200కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, బంధన్‌ బ్యాంక్, విప్రో, ఆల్ట్రాటెక్‌ సిమెంట్, అంబుజా సిమెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్, హావెల్స్‌ ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, సీఎస్‌బీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్,  జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తదితర కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. 

ప్రపంచ పరిణామాలు 
అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తే.., యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రేపు ద్రవ్య విధానాన్ని వెల్లడించనుంది. వడ్డీరేట్ల పెంపుకే మొగ్గు చూపవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నాయి. యూరో కరెన్సీ పదేళ్ల కనిష్టానికి దిగివచ్చని నేపథ్యంలో ఈసీబీ కఠినతర వైఖరి అనుసరించే వీలుందంటున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్‌ కేంద్ర బ్యాంక్‌ గురువారం ద్రవ్య పాలసీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు.    

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు 
భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఈ జూలై తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,432 కోట్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుత నెలలో సైతం అమెరికా డాలర్‌ బలపడటం, అమెరికా మాంద్యంపై పెరుగుతున్న ఆందోళనలు ఇందుకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 2.25 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. కాగా  గత నెల జూన్‌లో రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐ అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ.., కొనుగోలు చేసే ప్రత్యేక పరిస్థితులేవీ లేకపోవడంతో అమ్మకాల ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement