మోదీ టైమ్ బావుంది..!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మళ్లీ రిపీట్ అయ్యింది. సోమవారం మరోసారి భారత స్టాక్ మార్కెట్ సరికొత్త గరిష్టస్థాయిని నమోదుచేసింది. రోజుకో కొత్త రికార్డును నెలకొల్పడం సూచీలకు పరిపాటి అయిపోయింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనువేగంతో ప్రవేశపెట్టిన సంస్కరణలో, మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా టర్న్ ఎరౌండ్ అయిపోవడమో ఇందుకు కారణం కాదు. పలు ప్రపంచదేశాల బ్యాంకుల ‘ఈజీ మనీ పాలసీ’ ఫలితంగా అమెరికా నుంచి ఇటు జపాన్ వరకూ మార్కెట్ సూచీలన్నీ ఎగసిపోతున్నాయి.
బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి పొందిన చౌక డాలరు రుణాల్ని ఇన్వెస్టర్లు పలు దేశాల మార్కెట్లలోకి మళ్లిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు 40 బిలియన్ డాలర్లు కుమ్మరించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ‘శుభదినాలు(మోదీ భాషలో అచ్ఛాదిన్)’ ఇంకా రాకపోయినా, బీఎస్‌ఈ సెన్సెక్స్ 28,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించడానికి కారణమిదే.
వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతున్నదన్న సంకేతాలేవీ ఇప్పటికీ కన్పించలేదు. దేశపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 5.7 శాతానికే పరిమితమైంది. సెప్టెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 2.5 శాతానికి పడిపోయింది. అక్టోబర్‌లో ఎగుమతుల వృద్ధి 5 శాతానికి తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వపు పన్ను వసూళ్లు పూర్తి ఆర్థిక సంవత్సరపు లక్ష్యంలో 37 శాతమే జరిగాయి. అందుకే వసూళ్లను పెంచుకునేందుకు డీజిల్, పెట్రోల్‌పై అదనపు ఎక్సయిజ్ సుంకం వడ్డించింది.
మే నెలలో అధికారం చేపట్టిన ఎన్‌డీఏ ప్రభుత్వం , గత యూపీఏ ప్రభుత్వం అర్థాంతరంగా వదిలిపెట్టిన, ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో పడిన కొన్ని అంశాలపై (బీమా రంగంలో ఎఫ్‌డీఐని పెంచడం, సహజవాయువు ధరను పెంచడం వంటివి) నిర్ణయాలను ప్రకటించింది తప్ప, ఇప్పటివరకూ కొత్తగా తీసుకున్న విధాన చర్యలేవీ లేవు. రైల్వే బడ్జెట్లోగానీ, సాధారణ బడ్జెట్లో గానీ ప్రతిపాదించిన సంస్కరణలేవీ లేవు. దేశీయ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రతిబింబించే ఇన్‌ఫ్రా, పవర్ రంగాలు మెరుగుపడకపోగా, మరింత కుదేలైపోయాయి.
ఆర్థిక రంగం వృద్ధిబాట పడుతున్నదన్నడానికి స్పష్టమైన సంకేతంగా భావించే బ్యాంకుల రుణ వితరణ పెరగలేదు. పైగా మూలధనం అవసరమైన రంగాల నుంచి రుణాలకు డిమాండ్ పడిపోయింది కూడా. ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటే కరెన్సీ కూడా బలపడేది. డాలరు బలాన్ని ఎదిరించలేక రూపాయి విలువ 8 నెలల కనిష్టస్థాయికి క్షీణించింది. అయినా మోదీ టైమ్ మాత్రం బావుంది. అంతర్జాతీయ స్టాక్, కమోడిటీ మార్కెట్ల అనుకూల ప్రభావం భారత్‌పై బాగా ప్రసరించింది.
భారత్ అధికంగా దిగుమతి చేసుకునే చమురు, బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లో గత కొద్ది నెలల్లో 30, 20 శాతం చొప్పున పడిపోయాయి. ఈ రెండు కమోడిటీల ధరల క్షీణతతో దిగుమతుల బిల్లు గణనీయంగా తగ్గిపోయింది. దాంతో పాటు కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వచ్చే డాలర్లు, చెల్లించే డాలర్ల మధ్య వ్యత్యాసం) ఆశ్చర్యకరంగా 1.7 శాతానికి పడిపోయింది. చెల్లింపుల సమతౌల్యస్థితి మెరుగుపడింది. ఇప్పుడు రిజర్వుబ్యాంక్ వద్ద 8 నెలలకు సరిపడా అవసరమైన డాలరు నిల్వలున్నాయి.
ప్రపంచ కమోడిటీ మార్కెట్ల పుణ్యమా అని డీజిల్ ధరను భారీగా తగ్గించడంతో పాటు ఆ ఇంధనంపై నియంత్రణలు ఎత్తివేసిన ఘనతను మోదీ ప్రభుత్వం పొందగలిగింది. మనం అధికంగా దిగుమతి చేసుకునే వంటనూనెల ధరలు సైతం ప్రపంచ మార్కెట్లో తగ్గడంతో ఇక్కడ కూడా తగ్గు ముఖం పట్టాయి. చక్కెర, గోధుమలు, జొన్న వంటి వ్యవసాయోత్పత్తులు, వెండి, రాగి తదితర లోహాల ధరలు కూడా అంతర్జాతీయంగా పడిపోవడంతో దేశీయ ద్రవ్యోల్బణం గత కొద్ది సంవత్సరాల్లో ఎన్నడూ చూడనంత కనిష్టస్థాయికి పడిపోయింది. అక్టోబర్‌లో వినియోగ ద్రవ్యోల్బణం రేటు 5.5 శాతానికి తగ్గిపోయింది.
టోకు ద్రవ్యోల్బణం రేటు 1.77 శాతానికి క్షీణించింది. ధరలు తగ్గిన ఫలితమంతా నరేంద్ర మోదీ ఖాతాలోకి వచ్చిచేరింది. ఆరేళ్ల నుంచి యూపీఏ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ప్రపంచ కమోడిటీ మార్కెట్లు మోది పగ్గాలు చేపట్టిన తర్వాత నాటకీయంగా చల్లబడ్డాయి. కానీ కేవలం కమోడిటీ ధరలు తగ్గినంత మాత్రాన దేశానికి మోదీ చెపుతున్న శుభదినాలు వస్తాయో రావో చెప్పలేం గానీ, ప్రస్తుతం ప్రధాని టైమ్ బావుందని చెప్పొచ్చు.