The financial system
-
మోదీ టైమ్ బావుంది..!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మళ్లీ రిపీట్ అయ్యింది. సోమవారం మరోసారి భారత స్టాక్ మార్కెట్ సరికొత్త గరిష్టస్థాయిని నమోదుచేసింది. రోజుకో కొత్త రికార్డును నెలకొల్పడం సూచీలకు పరిపాటి అయిపోయింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనువేగంతో ప్రవేశపెట్టిన సంస్కరణలో, మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా టర్న్ ఎరౌండ్ అయిపోవడమో ఇందుకు కారణం కాదు. పలు ప్రపంచదేశాల బ్యాంకుల ‘ఈజీ మనీ పాలసీ’ ఫలితంగా అమెరికా నుంచి ఇటు జపాన్ వరకూ మార్కెట్ సూచీలన్నీ ఎగసిపోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి పొందిన చౌక డాలరు రుణాల్ని ఇన్వెస్టర్లు పలు దేశాల మార్కెట్లలోకి మళ్లిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు 40 బిలియన్ డాలర్లు కుమ్మరించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ‘శుభదినాలు(మోదీ భాషలో అచ్ఛాదిన్)’ ఇంకా రాకపోయినా, బీఎస్ఈ సెన్సెక్స్ 28,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించడానికి కారణమిదే. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతున్నదన్న సంకేతాలేవీ ఇప్పటికీ కన్పించలేదు. దేశపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 5.7 శాతానికే పరిమితమైంది. సెప్టెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 2.5 శాతానికి పడిపోయింది. అక్టోబర్‌లో ఎగుమతుల వృద్ధి 5 శాతానికి తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వపు పన్ను వసూళ్లు పూర్తి ఆర్థిక సంవత్సరపు లక్ష్యంలో 37 శాతమే జరిగాయి. అందుకే వసూళ్లను పెంచుకునేందుకు డీజిల్, పెట్రోల్‌పై అదనపు ఎక్సయిజ్ సుంకం వడ్డించింది. మే నెలలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం , గత యూపీఏ ప్రభుత్వం అర్థాంతరంగా వదిలిపెట్టిన, ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో పడిన కొన్ని అంశాలపై (బీమా రంగంలో ఎఫ్‌డీఐని పెంచడం, సహజవాయువు ధరను పెంచడం వంటివి) నిర్ణయాలను ప్రకటించింది తప్ప, ఇప్పటివరకూ కొత్తగా తీసుకున్న విధాన చర్యలేవీ లేవు. రైల్వే బడ్జెట్లోగానీ, సాధారణ బడ్జెట్లో గానీ ప్రతిపాదించిన సంస్కరణలేవీ లేవు. దేశీయ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రతిబింబించే ఇన్ఫ్రా, పవర్ రంగాలు మెరుగుపడకపోగా, మరింత కుదేలైపోయాయి. ఆర్థిక రంగం వృద్ధిబాట పడుతున్నదన్నడానికి స్పష్టమైన సంకేతంగా భావించే బ్యాంకుల రుణ వితరణ పెరగలేదు. పైగా మూలధనం అవసరమైన రంగాల నుంచి రుణాలకు డిమాండ్ పడిపోయింది కూడా. ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటే కరెన్సీ కూడా బలపడేది. డాలరు బలాన్ని ఎదిరించలేక రూపాయి విలువ 8 నెలల కనిష్టస్థాయికి క్షీణించింది. అయినా మోదీ టైమ్ మాత్రం బావుంది. అంతర్జాతీయ స్టాక్, కమోడిటీ మార్కెట్ల అనుకూల ప్రభావం భారత్‌పై బాగా ప్రసరించింది. భారత్ అధికంగా దిగుమతి చేసుకునే చమురు, బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లో గత కొద్ది నెలల్లో 30, 20 శాతం చొప్పున పడిపోయాయి. ఈ రెండు కమోడిటీల ధరల క్షీణతతో దిగుమతుల బిల్లు గణనీయంగా తగ్గిపోయింది. దాంతో పాటు కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వచ్చే డాలర్లు, చెల్లించే డాలర్ల మధ్య వ్యత్యాసం) ఆశ్చర్యకరంగా 1.7 శాతానికి పడిపోయింది. చెల్లింపుల సమతౌల్యస్థితి మెరుగుపడింది. ఇప్పుడు రిజర్వుబ్యాంక్ వద్ద 8 నెలలకు సరిపడా అవసరమైన డాలరు నిల్వలున్నాయి. ప్రపంచ కమోడిటీ మార్కెట్ల పుణ్యమా అని డీజిల్ ధరను భారీగా తగ్గించడంతో పాటు ఆ ఇంధనంపై నియంత్రణలు ఎత్తివేసిన ఘనతను మోదీ ప్రభుత్వం పొందగలిగింది. మనం అధికంగా దిగుమతి చేసుకునే వంటనూనెల ధరలు సైతం ప్రపంచ మార్కెట్లో తగ్గడంతో ఇక్కడ కూడా తగ్గు ముఖం పట్టాయి. చక్కెర, గోధుమలు, జొన్న వంటి వ్యవసాయోత్పత్తులు, వెండి, రాగి తదితర లోహాల ధరలు కూడా అంతర్జాతీయంగా పడిపోవడంతో దేశీయ ద్రవ్యోల్బణం గత కొద్ది సంవత్సరాల్లో ఎన్నడూ చూడనంత కనిష్టస్థాయికి పడిపోయింది. అక్టోబర్‌లో వినియోగ ద్రవ్యోల్బణం రేటు 5.5 శాతానికి తగ్గిపోయింది. టోకు ద్రవ్యోల్బణం రేటు 1.77 శాతానికి క్షీణించింది. ధరలు తగ్గిన ఫలితమంతా నరేంద్ర మోదీ ఖాతాలోకి వచ్చిచేరింది. ఆరేళ్ల నుంచి యూపీఏ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ప్రపంచ కమోడిటీ మార్కెట్లు మోది పగ్గాలు చేపట్టిన తర్వాత నాటకీయంగా చల్లబడ్డాయి. కానీ కేవలం కమోడిటీ ధరలు తగ్గినంత మాత్రాన దేశానికి మోదీ చెపుతున్న శుభదినాలు వస్తాయో రావో చెప్పలేం గానీ, ప్రస్తుతం ప్రధాని టైమ్ బావుందని చెప్పొచ్చు. -
వృద్ధి పరుగు గ్యారంటీ
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ రికవరీ బాట పట్టిందని, రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి మరింత మెరుగుపడగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనల సడలింపుతో విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడిందని, అలాగే తయారీ రంగానికి ఊతమివ్వడం వంటి చర్యలతో ద్రవ్యోల్బణమూ దిగొస్తోందని ఆయన చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జైట్లీ ఈ విషయాలు పేర్కొన్నారు. పన్నుపరమైన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయడం తదితర చర్యల కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంటులో కూడా మార్పు వచ్చిందని, వారు భారత్‌లోని పెట్టుబడి అవకాశాలపై ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పారు. స్థల సమీకరణకు సంబంధించిన కొత్త చట్టాలు తదితర అంశాల పరిష్కారంపైన నిర్ణయాలు తీసుకునే కొద్దీ వృద్ధి మెరుగుపడేందుకు మరిన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో సాధించిన 5.7 శాతం వృద్ధి ప్రోత్సాహకరంగానే ఉందన్నారు. వృద్ధికి తోడ్పడేలా వడ్డీ రేట్లు తగ్గించే అంశంపై స్పందిస్తూ.. రిజర్వ్ బ్యాంక్ తాజా పరిణామాలను సమీక్షిస్తోందని, తగు నిర్ణయం తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక లక్ష్యాలు, వస్తు సేవల పన్నుల విధానం అమలు వంటివి ప్రకటించబోతున్నామని జైట్లీ చెప్పారు. జన ధనతో 2.14 కోట్ల ఖాతాలు.. ఈ నెల 28న ప్రవేశపెట్టిన జన ధన యోజన కింద ఇప్పటిదాకా 2.14 సేవింగ్స్ ఖాతాలు తెరిచినట్లు జైట్లీ చెప్పారు. ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు కూడా ఆలోగా తమ బ్యాంకు శాఖల నుంచి రూపే కార్డు తీసుకుంటే జన ధన యోజన కింద ఇస్తున్న రూ. 1 లక్ష ప్రమాద బీమా, రూ. 30,000 జీవిత బీమా పొందడానికి అర్హులవుతారని చెప్పారు. లక్ష్యంలో 61.2 శాతానికి ద్రవ్యలోటు ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై ముగింపు నాటికి ద్రవ్యలోటు రూ.3.24 లక్షల కోట్లను దాటింది. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో ఇది 61.2 శాతానికి సమానం. జీడీపీ పరిమాణంతో పోల్చితే 4.1 శాతానికి ఈ మొత్తం మించరాదని (రూ.5.31 లక్షల కోట్లు) 2014-15 బడ్జెట్ నిర్దేశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఈ మొత్తం రూ.5.08 లక్షల కోట్లు. ఆ సంవత్సరం జీడీపీలో 4.5 శాతానికి ఇది సమానం. ఒక నిర్దిష్ట కాలంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయానికి మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. -
ఎబోలాతో ఉత్తరాఫ్రికా ఆర్థిక వ్యవస్థ కుదేలు
మొన్రోవియా(లైబీరియా): ఉత్తరాఫ్రికాను వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి ఎబోలా అక్కడి లైబీరియా, సియోర్రాలిన్, గినియా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలనూ తీవ్రంగా దెబ్బతీస్తోంది. చెమట, రక్తం తదితర శరీర ద్రవాల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కార్మికులకు సోకుతుందనే భయంతో పలు కంపెనీలను మూసేస్తున్నారు. గనులు కూడా మూతపడుతున్నాయి. కూలీలు పొలాలకు వెళ్లకపోవడంతో పంటలు పొలాల్లోనే నాశనమవుతున్నాయి. కాగా, సియెర్రా లియోన్‌లోని ఒక బ్రిటిష్ ఆరోగ్య కార్యకర్తకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యనిపుణుడికి ఎబోలా సోకింది. -
25,550కు చేరిన సెన్సెక్స్
ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న సంకేతాలతో స్టాక్ మార్కెట్లకు జోష్వచ్చింది. చౌక ధరల గృహాలు, ఇన్ఫ్రా ఫైనాన్సింగ్‌కు ఆర్బీఐ మరింత వెసులుబాటును కల్పించడం దీనికి జత కలిసింది. వెరసి సెన్సెక్స్ గత రెండు వారాల్లోలేని విధంగా 321 పాయింట్లు ఎగసింది. వారం రోజుల గరిష్టం 25,550 వద్ద ముగిసింది. ఇంతక్రితం జూలై 2న మాత్రమే సెన్సెక్స్ ఈ స్థాయిలో 325 పాయింట్లు పుంజుకుంది. ఇక నిఫ్టీ కూడా 98 పాయింట్లు జంప్‌చేసి 7,624 వద్ద నిలిచింది. ద్రవ్యోల్బణం క్షీణించడం, పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడానికితోడు తాజాగా ఎగుమతులు పురోగమించడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల్లో సెన్సెక్స్ 543 పాయింట్లు జమ చేసుకుందని చెప్పారు. చౌక ధరల గృహాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల ఫైనాన్సింగ్ నిబంధనలను ఆర్బీఐ సరళీకరించడంతో రియల్టీ ఇండెక్స్ 4.3% జంప్‌చేయగా, మెట ల్, బ్యాంకింగ్ రంగాలు సైతం 2.5% స్థాయిలో పురోగమించాయి. ఐడీఎఫ్సీ దూకుడు ఇన్ఫ్రా ఫైనాన్స్‌కు లభించిన ప్రోత్సాహంతో ఐడీఎఫ్సీ దాదాపు 9% ఎగసింది. ఇన్ఫ్రా షేర్లు ఐఆర్బీ, జేపీ అసోసియేట్స్, పుంజ్‌లాయిడ్, ఐవీఆర్సీఎల్, జీవీకే పవర్, ల్యాంకో ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రా, ఎల్అండ్టీ 6-2% మధ్య పుంజుకున్నాయి. రియల్టీలో కోల్టేపాటిల్, యూనిటెక్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, అనంత్‌రాజ్, ఇండియాబుల్స్, హెచ్‌డీఐఎల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మహీంద్రా లైఫ్ 8-3% మేరు పెరిగాయి. బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, బీఓఐ, ఎస్బీఐ, కెనరా, యస్ బ్యాంక్ 5-2% మధ్య లాభపడ్డాయి. మెటల్లో హిందాల్కో, టాటా స్టీల్, సెసాస్టెరిలైట్, జిందాల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4-2% మధ్య పెరిగాయి. ఆటో దిగ్గజాలు మారుతీ, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ సైతం 2% స్థాయిలో బలపడ్డాయి. బీఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా... సెన్సెక్స్‌లో కేవలం5షేర్లు అదికూడా నామమాత్రంగా నష్టపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5%, 2% ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,990 లాభపడితే, 952 నష్టపోయాయి. -
కత్తిమీద సాము
రాష్ట్ర విభజన కారణంగా తలెత్తే పరిణామాలు తీవ్రంగానే ఉండబోతున్నారుు. ఖర్చులు పెరగనున్నారుు. అందుకు తగ్గట్టుగా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే జనమంతా కష్టాల్లో ఉన్నారు. వ్యవసాయం సహా ఉత్పత్తి రంగాలన్నీ నష్టాల ఊబిలో చిక్కుకున్నారుు. సంక్షేమ పథకాలు పడకేశారుు. పాలన గాడి తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగారుు. కొత్త పాలకులొచ్చారు. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత వారి భుజస్కంధాలపైనే ఉంది. వాళ్లేంచేస్తారు. ఈ సవాళ్లను అధిగమించగలుగుతారా. చేతులెత్తేసి ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టేస్తారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. సాక్షి, ఏలూరు : ఎన్నికల్లో గెలిచి కొత్తగా పదవులు చేపడుతున్న ప్రజాప్రతినిధులకు పాలన కత్తిమీద సాము కానుంది. ఎన్నో ఏళ్లుగా గ్రామ స్థాయినుంచి జిల్లాస్థాయి వరకూ పరిపాలన కుంటుపడింది. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుతోపాటు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాబడిపై కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. కేంద్రం ఇచ్చే రాయితీలు, నిధులు ఎప్పుడు అందుతాయనే దానిపై స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక నిధులతోనే సౌకర్యాలు మెరుగుపర్చుకోవాలి. అవసరాలు తీర్చుకోవాలి. ఇదంతా కొత్త పాల కుల పనితీరుపైనే ఆధారపడి ఉంది. సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకూ ప్రతీ నాయకుడు ప్రజా సమస్యలను సవాళ్లుగా స్వీకరించక తప్పదు. ఆర్థిక వ్యవస్థ తిరోగమనం జిల్లాలో పాలన పడకేయడంతో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం బాటపట్టింది. ప్రభుత్వ విభాగాల ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. చాలావరకూ బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఆర్టీసీ, గనులు, విద్యుత్, పురపాలక, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 884 పంచాయతీల నుంచి రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. కేవలం రూ.60 కోట్లకే పరి మితమైంది. ఏలూరు నగరం, ఎనిమిది మునిసిపాలిటీలు భారీగా ఆర్థిక లోటులో కూరుకుపోయూరుు. వీటికి రావాల్సిన రూ.60కోట్ల ఆదాయానికి గండిపడింది. జిల్లాలో దాదాపు 80 శాతం జనాభా సేద్యంపైనే ఆధారపడి బతుకుతున్నారు. రైతులు నాలుగేళ్లు నుంచి వరుసగా పంటల్ని నష్టపోతున్నారు. ఇప్పటివరకూ దాదాపు రూ.1,500 కోట్ల విలువైన పంటలు కోల్పోయారు. వ్యవసాయానికి రోజుకు 7గంటలు ఉచిత విద్యుత్ ఇప్పటికీ అందడం లేదు. భారం ఇంతింత కాదయూ... జిల్లాలో ద్విచక్ర వాహనాలు సుమారు 5లక్షల వరకు ఉన్నాయి. ట్రక్లు, ఆటోల సంఖ్య 12వేల 415. వీటికితోడు 20వేల కార్లు ఉన్నాయి. లారీలు, బస్సుల సంగతి సరేసరి వీటి అవసరాలకు రోజుకు 5లక్షల లీటర్ల వరకూ పెట్రోల్ వినియోగం అవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నారుు. ఇది ప్రత్యక్షంగా వాహనదారులకు భారంగా పరిణమించగా.. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఇదో కారణమైంది. బియ్యం, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతంతో పోలిస్తే బియ్యం ధర బస్తాకు దాదాపు రూ.200 పెరిగింది. జిల్లాలో 48 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో దాదాపు రూ.7.4 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ ధర రూ.425కు పెరిగింది. బ్లాక్ మార్కెట్లో రూ.850 నుంచి రూ.1,050 వరకూ విక్రయిస్తున్నారు. పండగ వేళ రూ.1,200 నుంచి రూ.1,500 పెట్టనిదే గ్యాస్ దొరకదు. ధరల్ని తగ్గించడంతో పాటు బ్లాక్‌మార్కెట్‌ను నిరోధించాల్సింది. జిల్లాలో 11, 81,672 మంది విద్యుత్ వినియోగదారులపై ఏటా చార్టీల భారం పెరుగుతోంది. భరోసా ఇవ్వగలరా! జిల్లా ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 100 రోజులకుపైగా ఉద్యమం చేశారు. పిల్లల చదువులకు, ఉద్యోగాలకు దారేదని కన్నీరు పెట్టుకున్నారు. వారికి భరోసా ఇచ్చేలా కొత్త రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పన ఉండాలి. జిల్లాలోని పేదలకు గూడు లేదు. ఇళ్లు పొందిన కొందరికి వాటిపై హక్కులేదు. ఇళ్లకు పక్కా డాక్యుమెంట్లు ఇవ్వడంతోపాటు వాటిపై పావలా వడ్డీకే రుణాలు కూడా ఇవ్వాలని పేదలు కోరుతున్నారు. పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల మెట్టు ఎక్కేలా చేసిన ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతుందా లేదా అనే భయం ప్రజల్లో ఏర్పడింది. వారికి ధైర్యాన్నివ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి లేని పారదర్శక పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. కొత్త పాలకులు వీటిపై దృష్టిసారించి ప్రాధాన్యతా రంగాలను గాడిన పెడితే తప్ప ప్రజలు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.