25,550కు చేరిన సెన్సెక్స్
ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న సంకేతాలతో స్టాక్ మార్కెట్లకు జోష్‌వచ్చింది. చౌక ధరల గృహాలు, ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్‌కు ఆర్‌బీఐ మరింత వెసులుబాటును కల్పించడం దీనికి జత కలిసింది. వెరసి సెన్సెక్స్ గత రెండు వారాల్లోలేని విధంగా 321 పాయింట్లు ఎగసింది. వారం రోజుల గరిష్టం 25,550 వద్ద ముగిసింది. ఇంతక్రితం జూలై 2న మాత్రమే సెన్సెక్స్ ఈ స్థాయిలో 325 పాయింట్లు పుంజుకుంది.
ఇక నిఫ్టీ కూడా 98 పాయింట్లు జంప్‌చేసి 7,624 వద్ద నిలిచింది. ద్రవ్యోల్బణం క్షీణించడం, పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడానికితోడు తాజాగా ఎగుమతులు పురోగమించడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల్లో సెన్సెక్స్ 543 పాయింట్లు జమ చేసుకుందని చెప్పారు. చౌక ధరల గృహాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల ఫైనాన్సింగ్ నిబంధనలను ఆర్‌బీఐ సరళీకరించడంతో రియల్టీ ఇండెక్స్ 4.3% జంప్‌చేయగా, మెట ల్, బ్యాంకింగ్ రంగాలు సైతం 2.5% స్థాయిలో పురోగమించాయి.
ఐడీఎఫ్‌సీ దూకుడు
ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌కు లభించిన ప్రోత్సాహంతో ఐడీఎఫ్‌సీ దాదాపు 9% ఎగసింది. ఇన్‌ఫ్రా షేర్లు ఐఆర్‌బీ, జేపీ అసోసియేట్స్, పుంజ్‌లాయిడ్, ఐవీఆర్‌సీఎల్, జీవీకే పవర్, ల్యాంకో ఇన్‌ఫ్రా, జీఎంఆర్ ఇన్‌ఫ్రా, ఎల్‌అండ్‌టీ 6-2% మధ్య పుంజుకున్నాయి.
రియల్టీలో కోల్టేపాటిల్, యూనిటెక్, డీఎల్‌ఎఫ్, ఒబెరాయ్, అనంత్‌రాజ్, ఇండియాబుల్స్, హెచ్‌డీఐఎల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మహీంద్రా లైఫ్ 8-3% మేరు పెరిగాయి.
బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, బీఓఐ, ఎస్‌బీఐ, కెనరా, యస్ బ్యాంక్ 5-2% మధ్య లాభపడ్డాయి. మెటల్‌లో హిందాల్కో, టాటా స్టీల్, సెసాస్టెరిలైట్, జిందాల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4-2% మధ్య పెరిగాయి.
ఆటో దిగ్గజాలు మారుతీ, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్ సైతం 2% స్థాయిలో బలపడ్డాయి.
బీఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా... సెన్సెక్స్‌లో కేవలం5షేర్లు అదికూడా నామమాత్రంగా నష్టపోయాయి.
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5%, 2% ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,990 లాభపడితే, 952 నష్టపోయాయి.