అమ్మకాల సునామీ
కుప్పకూలిన మార్కెట్లు
రూ. 31 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్ 4,390 పాయింట్ల పతనం
1,379 పాయింట్లు పడిన నిఫ్టీ
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్‌డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.
ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!!
పీఎస్‌యూ షేర్లు ఫట్
మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్‌ఈసీ 24 శాతం, పీఎఫ్‌సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్‌ఈఎల్ 19%, హెచ్‌ఏఎల్ 17%, ఓఎన్‌జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్‌వీఎన్‌ఎల్ 13%, ఐఆర్‌సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, ఎస్‌బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్‌ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది.
ఎదురీదిన ఎఫ్‌ఎంసీజీ..
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్‌అండ్‌టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్‌ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.
అదానీ గ్రూప్ బేర్..
అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్‌ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్‌డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment