capital goods
-
మార్కెట్ అల్లకల్లోలం
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
స్వల్ప లాభాలతో ముగింపు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. ఐటీ, టెక్నాలజీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 179 పాయింట్లు పెరిగి 72,026 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు బలపడి 21,711 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధంలో స్థిరమైన లాభాలతో ట్రేడయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 309 పాయింట్లు బలపడి 72,156 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 21,750 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. అయితే మిడ్ సెషన్లో తలెత్తిన అనూహ్య అమ్మకాలతో సూచీలు లాభాలన్నీ కోల్పోయాయి. ట్రేడింగ్ చివర్లో మరోసారి కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, బ్యాంకింగ్, షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్‌తో బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు వరుసగా 0.61%, 0.19% చొప్పున రాణించాయి. ► డిసెంబర్ క్వార్టర్ ఫలితాల వెల్లడికి ముందు(గురువారం నుంచి) ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కోఫోర్జ్, టీసీఎస్ షేర్లు 2% పెరిగాయి. ఎల్టీఐఎం, ఎంఫసీస్, పర్సిస్టెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో షేర్లు ఒక శాతం లాభపడ్డాయి. ► ఎవర్ రెన్యూ ఎనర్జీ లిమిటెడ్ నుంచి 225 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఆర్డర్‌ను దక్కించుకోవడంతో సుజ్లాన్ ఎనర్జీ షేరు 5% లాభపడి రూ.41 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. -
పారిశ్రామికోత్పత్తి డౌన్
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి మార్చిలో మందగించింది. విద్యుత్, తయారీ రంగాల పేలవ పనితీరుతో అయిదు నెలల కనిష్టానికి పడిపోయి.. 1.1%గా నమోదైంది. చివరిసారిగా 2022 అక్టోబర్‌లో అత్యంత తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. అప్పట్లో ఐఐపీ 4.1% క్షీణించింది. గతేడాది మార్చిలో ఇది 2.2% కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.8%గా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) డేటా ప్రకారం ... ► విద్యుదుత్పత్తి రంగం 6.1 శాతం వృద్ధి నుండి 1.6 శాతం క్షీణత నమోదు చేసింది. ► తయారీ రంగం వృద్ధి 1.4 శాతం నుంచి 0.5 శాతానికి నెమ్మదించింది. ► మైనింగ్ రంగం ఉత్పత్తి 3.9 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి 2.4 శాతం నుంచి 8.1 శాతానికి ఎగిసింది. ► ప్రైమరీ గూడ్స్ వృద్ధి గత మార్చిలో 5.7% ఉండగా ప్రస్తుతం 3.3%గా నమోదైంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మైనస్ 3.1 శాతం నుంచి మైనస్ 8.4 శాతానికి పడిపోయింది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ తాజాగా మైనస్ 3.1%కి చేరింది. ► ఇన్ఫ్రా/ నిర్మాణ ఉత్పత్తుల వృద్ధి 5.4 శాతంగా ఉంది. గత మార్చిలో ఇది 6.7 శాతం. ► 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఐఐపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 11.4%. -
పరిశ్రమలు.. కకావికలం!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదు చేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –1.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2012 నవంబర్‌లో ఐఐపీ –1.7 శాతాన్ని నమోదుచేసుకున్న తరువాత, ఇదే స్థాయి తీవ్ర ప్రతికూలత తాజా సమీక్షా నెల (2019 ఆగస్టు)లో చోటుచేసుకుంది. 2018 ఆగస్టులో ఐఐపీ వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను రంగాల వారీగా చూస్తే... ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో అసలు వృద్ధి నమోదుకాలేదు. –1.2 శాతం క్షీణత నెలకొంది. ఈ కీలక విభాగంలో ఇలాంటి ఫలితం చూడ్డం ఐదేళ్ల తరువాత (2014 అక్టోబర్‌లో –1.8 శాతం క్షీణత) తొలిసారి. 2018 ఆగస్టులో తయారీ విభాగంలో 5.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. ► విద్యుత్: ఈ రంగంలో కూడా అసలు వృద్ధిలేకపోగా –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఆగస్టులో ఈ రంగం ఏకంగా 7.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి రేటు యథాతథంగా 0.1 శాతంగా ఉంది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే ఈ విభాగం ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా భారీగా –21 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టులో ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 10.3 శాతంగా ఉంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి దీర్ఘకాలం మన్నే ఉత్పత్తులకు సంబంధించి ఈ విభాగం కూడా –9.1 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2018 ఇదే నెల్లో ఈ విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా/నిర్మాణం: పేలవ పనితనాన్ని ప్రదర్శించిన రంగాల్లో ఇది ఒకటి. ఈ విభాగంలో 8 శాతం వృద్ధి (2018 ఆగస్టు) రేటు –4.5 శాతం క్షీణత (2019 ఆగస్టు)లోకి జారింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, సిగరెట్ల ఉత్పత్తి వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించిన ఈ విభాగంలో మాత్రం వృద్ధి 4.1 శాతంగా ఉంది. అయితే 2018 ఆగస్టులో ఈ విభాగంలో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. ► ఐదు నెలల్లోనూ డౌన్: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఏప్రిల్–ఆగస్టు మధ్య 2.4%గా ఉంది. 2018 ఇదే కాలంలో ఈ వృద్దిరేటు 5.3 శాతం. రెండవ త్రైమాసికంపై నీలినీడలు... ‘ఏప్రిల్–జూన్ క్వార్టర్లో వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 5%కి పyì ంది. రెండో క్వార్టర్లో వృద్ధి మెరుగుపడకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి’ అని ఆర్థికవేత్త అదితి నయ్యర్ పేర్కొన్నారు. -
జారుడు బల్లపైకి పారిశ్రామిక ఉత్పత్తి!
♦ జూన్ నెల్లో వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణత ♦ ఈ తరహా ఫలితం ఏడాదిలో ఇదే తొలిసారి ♦ తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల బలహీనత ♦ మరింత రేటు కోత తప్పదంటున్న ♦ పారిశ్రామిక ప్రతినిధులు న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం ఉత్పత్తి జూన్ నెల్లో అత్యంత నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణతలోకి జారిపోయింది. అంటే 2016 జూన్ నెల ఉత్పత్తితో పోల్చితే 2017 జూన్ నెలలో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణించిందన్నమాట. 2016 జూన్ నెలలో వృద్ధి భారీగా 8 శాతంగా ఉంది. గడచిన 12 నెలల కాలాన్ని చూస్తే, ‘క్షీణ’ ఫలితం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. ఇక ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) చూసినా, వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 2 శాతానికి పడిపోయింది. తాజా ఫలితం నేపథ్యంలో తక్షణం పావుశాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) తప్పదని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. . అన్ని రంగాలూ నేలచూపే... ⇔ తయారీ: 2016 జూన్ నెలలో 7.5 శాతం వృద్ధి 2017 జూన్‌లో ఏకంగా –0.4 శాతం క్షీణతకు జారింది. ఇక త్రైమాసికంగా చూస్తే ఈ రేటు 6.7 శాతం నుంచి 1.8 శాతానికి పడింది. ఈ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాన్ని చూశాయి. ⇔ మైనింగ్: నెలలో వృద్ధి రేటు 10.2 శాతం నుంచి 0.4 శాతానికి జారింది. మూడు నెలల్లో ఈ రేటు 6.7 శాతం నుంచి 1.8 శాతానికి చేరింది. ⇔ విద్యుత్: వృద్ధి రేటు నెల్లో 9.8 శాతం నుంచి 2.1 శాతానికి చేరింది. త్రైమాసికంలో రేటు 10 శాతం నుంచి 5.3 శాతానికి పడిపోయింది. ⇔ కేపిటల్ గూడ్స్: భారీ పరిశ్రమల వస్తు ఉత్పత్తికి, డిమాండ్‌కు సూచిక అయిన ఈ రంగంలో రేటు 14.8 శాతం వృద్ధి నుంచి 6.8 శాతం క్షీణతకు పడిపోయింది. ⇔ వినియోగం: కన్జూమర్ డ్యూరబుల్స్‌లో – 2.1 శాతం క్షీణ వృద్ధి నమోదయితే, నాన్–డ్యూరబుల్స్ విషయంలో 4.9 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. -
ఏడురోజుల నష్టాలకు బ్రేక్...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో స్వల్ప లాభాలతో ముగిశాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడినా, వరుసగా ఏడు సెషన్ల నష్టాలకు చెక్ పెట్టి చివరకు సెన్సెక్స్, నిఫ్టీలు పాజిటివ్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 61పాయింట్ల లాభంతో 26,040వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో్ 7,985.75 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మరోసారి 26వేల పాయింట్ల కీలక స్థాయిలో, నిఫ్టీ 8 వేలకు దిగువన ముగిసింది. కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు లాభాలను ఆర్జించాయి. దివీస్ కు షాక్ నేపథ్యంలో ఫార్మా నష్టపోగా ఐటీ, టెక్నాలజీ షేర్లతో పాటు స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ రంగాలు కూడా నష్టపోయాయి.రోజంతా సెన్సెక్స్ నారో బ్యాండ్ లోట్రేడ్ అయింది. దీంతో ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నట్టు విశ్లేషకుల అంచనా. సిప్లా, బాష్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, సన్ ఫార్మా టాప్‌గెయినర్స్‌గా, హెచ్‌సీఎల్ టెక్ యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ అరబిందో ఫార్మా టెక్ మహీంద్రా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 16 పైసల లాభంతో రూ.67.83 వదఉంది. అలాగే ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ.33 క్షీణించి, రూ.26,935 వద్ద ఆకర్షణీయంగా ఉంది. -
భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి బూస్ట్!
2025 నాటికి 2 కోట్లకుపైగా కొత్త ఉద్యోగాలు * జాతీయ విధానానికి కేంద్రం ఆమోద ముద్ర * ప్రస్తుత ఉత్పత్తి పరిమాణం రూ.2.30 లక్షల కోట్లు * 2025 నాటికి రూ.7.50 లక్షల కోట్ల ఉత్పత్తి లక్ష్యం న్యూఢిల్లీ: వ్యవస్థలో డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్ గూడ్స్ రంగం పునరుత్తేజానికి కేంద్రం చర్యలు మొదలెట్టింది. భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంబంధించిన ఈ రంగం కోసం తొలిసారిగా ఒక జాతీయ విధానాన్ని తెచ్చింది. బుధవారం దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2014-15లో ఈ రంగం ఉత్పత్తి విలువ దాదాపు రూ.2,30,000 కోట్లు. దీన్ని 2025 నాటికి రూ.7,50,000 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. అదే విధంగా ఈ రంగం నుంచి ప్రస్తుతం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 84 లక్షల మందికాగా, ఈ సంఖ్యను మూడు కోట్లకు పెంచాలని కూడా కేంద్రం భావిస్తోంది. అంటే ఈ విధానం విజయవంతమైతే 2025 నాటికి 2 కోట్ల మంది కొత్తగా ఈ రంగంలో ఉపాధి పొందుతారు. కాగా, కేంద్రం విధాన నిర్ణయంపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదించిన విధానంలో మరిన్ని ముఖ్యాంశాలివీ... * ప్రస్తుతం క్యాపిటల్ గూడ్స్ రంగం 14 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. దీనిని 2025 నాటికి 50 లక్షలకు పెంచాలన్నది లక్ష్యం. ఇక పరోక్ష ఉపాధి కల్పన అవకాశాలను ప్రస్తుత 70 లక్షల నుంచి 2.5 కోట్లకు పెంచుతారు. * క్యాపిటల్ గూడ్స్ డిమాండ్‌లో దేశీయ ఉత్పత్తి వాటా ప్రస్తుతం 60 శాతం. దీన్ని 80కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. * దేశీ ఉత్పత్తిలో ప్రస్తుతం 27 శాతం ఎగుమతులు జరుగుతుండగా, దీనిని 40 శాతానికి పెంచాలని లక్ష్యించారు. మొత్తం తయారీ రంగంలో ఈ రంగం వాటా ప్రస్తుతం 12 శాతం. దీన్ని 20కి పెంచాలని తాజా విధానం నిర్దేశిస్తోంది. * మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
పరిశ్రమలు.. జూలైలో జూమ్!
పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 4.2% - తయారీ, కేపిటల్ గూడ్స్ రంగాల దన్ను న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక ఉత్పత్తి జూలై గణాంకాలు కూడా ఉత్సాహాన్ని అందించాయి. ఈ నెలలో ఉత్పత్తి వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 జూలై పారిశ్రామిక ఉత్పత్తి విలువతో పోల్చితే... 2015 జూలైలో ఉత్పత్తి విలువ 4.2 శాతం అధికంగా ఉన్నదన్నమాట. 2014 జూలైలో ఈ రేటు 0.9 శాతం మాత్రమే. 2015 జూన్‌లో 4.4 శాతం. అంటే వార్షికంగా చూస్తే వృద్ధి రేటు పెరిగినా- నెలవారీగా తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం, అలాగే వ్యవస్థలో పెట్టుబడులను, డిమాండ్‌ను సూచించే కేపిటల్ గూడ్స్ రంగాలు మంచి ఫలితాలను సాధించడం మొత్తం గణాంకాలను తగిన స్థాయిలో నిలిపాయి. కాగా ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (2015-16, ఏప్రిల్-జూలై)లో ఐఐపీ వృద్ధి రేటు 3.6 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది (2014-15, ఏప్రిల్-జూలైతో పోల్చి). కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రంగాల వారీగా వివరాలు... తయారీ: ఈ రంగం 2014 జూలైలో అసలు వృద్ధిలేకపోగా -0.3% క్షీణతను నమోదుచేసుకుంది. అయితే 2015 జూలైలో భారీగా 4.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. తయారీ రంగంలోని మొత్తం 22 విభాగాల్లో 12 సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి. కాగా నాలుగు నెలల కాలంలో ఈ రంగం వృద్ధి రేటు 2.8% నుంచి 4%కి ఎగసింది. కేపిటల్ గూడ్స్: ఈ రంగం కూడా - 3 శాతం క్షీణత నుంచి భారీగా 10.6 శాతం వృద్ధి బాటకు మళ్లింది. మైనింగ్: జూలైలో వృద్ధి 0.1 శాతం నుంచి 1.3 శాతానికి ఎగియగా, నాలుగు నెలల్లో ఈ రేటు 2.3 శాతం నుంచి 0.6 శాతానికి పడింది. విద్యుత్: వృద్ధి రేటు 11.7 శాతం నుంచి 3.5 శాతానికి దిగింది. నాలుగు నెలల్లో కూడా ఈ రేటు 11.4% నుంచి 2.6 శాతానికి చేరింది. వినియోగ వస్తువుల ఉత్పత్తి: -5.9 శాతం క్షీణబాట నుంచి 1.3 శాతం వృద్ధి బాటకు మళ్లింది. రేట్లు తగ్గిస్తే మరింత వృద్ది ‘జూన్‌కన్నా జూలై వృద్ధి రేటు తక్కువగా ఉంది. సెప్టెంబర్ 29 పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గిస్తే- వృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. ధరల పెరుగుదల స్పీడ్ తక్కువగా ఉండడం కూడా ఇందుకు దోహదపడే అంశం’ అని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. గ్రోత్ ఇంజన్ ‘తయారీ’: కేంద్రం తయారీ రంగం భారత్ పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించి గ్రోత్ ఇంజన్ కానుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఐపీ, క్యాడ్, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు భారత్ స్థిర వృద్ధి తీరుకు సంకేతంగా నిలుస్తున్నట్లు ప్రకటన విశ్లేషించింది. కాగా వృద్ధి పటిష్టతకు తాజా ఐఐపీ గణాంకాలు అద్దం పడుతున్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ ట్వీట్ చేశారు. -
తయారీ రంగం జోరు..
జూన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.8 శాతం ♦ నాలుగు నెలల గరిష్ట స్థాయి ♦ తయారీ, వినియోగ వస్తువుల విభాగం దన్ను ♦ మిగిలిన పరిశ్రమలు అన్నీ నిరాశే! న్యూఢిల్లీ : పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) జూన్‌లో ఫర్వాలేదనిపించింది. ఉత్పత్తి వృద్ధి రేటు 3.8 శాతంగా నమోదయ్యింది. గడచిన 4 నెలల్లో ఈ స్థాయిలో ఉత్పత్తి వృద్ధి రేటు నమోదుకాలేదు. తయారీ రంగం పురోగతి మొత్తం సూచీపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. అయితే మిగిలిన రంగాలు పెద్దగా పురోగతి సాధించకపోవడం గమనార్హం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... తయారీ : మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం ఉత్పత్తి 2014 జూన్ నెలతో పోల్చితే 2015 జూన్‌లో 4.6 శాతం ఎగసింది. 2014 జూన్ నెలలో ఈ రేటు 2.9 శాతం. కాగా ఈ విభాగంలోని మొత్తం 22 రంగాల్లో 16 సానుకూల ఫలితాలను అందజేశాయి మైనింగ్ : ఈ రంగంలో వృద్ధి అసలు లేకపోగా, - 0.3 శాతం క్షీణించింది. గత ఏడాది జూన్‌లో ఈ రేటు 4.8 శాతం విద్యుత్ : వృద్ధి రేటు 15.7 శాతం నుంచి 1.3 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ : డిమాండ్, పెట్టుబడులకు ప్రతిబింబమైన భారీ యంత్రపరికరాల తయారీకి సంబంధించి క్యాపిటల్ గూడ్స్ విభాగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా -3.6 శాతం క్షీణించింది. 2014 జూన్‌లో ఈ రంగం వృద్ధి రేటు 23.3 శాతం. వినియోగ వస్తువులు : ఉత్పత్తి క్షీణ బాట నుంచి వృద్ధికి మారింది. -8.8 శాతం క్షీణత నుంచి 6.6 శాతం వృద్ధికి ఎగసింది. త్రైమాసికంగా చూస్తే... క్యూ1లో ఐఐపీ 4.5% నుంచి 3.2%కి తగ్గింది. విభాగాల వారీగా చూస్తే... తయారీ రంగం వృద్ధి రేటు 3.9% నుంచి 3.6 శాతానికి పడింది. మైనిం గ్లో ఈ రేటు 2.9 శాతం నుంచి 0.7 శాతానికి పడింది. విద్యుత్ ఉత్పత్తి 11.3%నుంచి 2.3 శాతానికి దిగింది. క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి 13.7% నుంచి 1.5%కి పడిపోయింది. -
పారిశ్రామిక ఉత్పత్తి... జోరు
ఫిబ్రవరిలో ఐఐపీ 5 శాతం వృద్ధి 9 నెలల గరిష్ట స్థాయి తయారీ, మైనింగ్ , కేపిటల్ గూడ్స్ దన్ను పారిశ్రామిక పునరుత్తేజానికి సంకేతం! న్యూఢిల్లీ: ఆర్థిక వేత్తలు, విధాన నిర్ణేతలకు ఉత్సాహాన్నిస్తూ ఫిబ్రవరి పారిశ్రామిక ఉత్పత్తి జోరందుకుంది. 2014 ఫిబ్రవరితో పోల్చితే 2015 ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి 5 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఇది తొమ్మిది నెలల గరిష్ట స్థాయి. ఈ నెలలో తయారీ, మైనింగ్, కేపిటల్ గూడ్స్ రంగాలు మంచి పనితీరు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిపై సానుకూల ప్రభావం చూపింది. ఫిబ్రవరి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసింది. 2014 ఫిబ్రవరిలో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా (అంతక్రితం ఏడాది అంటే 2013 ఫిబ్రవరితో పోల్చితే) 2 శాతం క్షీణత (మైనస్)లో ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 5 శాతం వృద్ధి కనపర్చడం విశేషం. జనవరి వృద్ధి పెంపు... మరోవైపు 2015 జనవరి ఐఐపీ 2.6 శాతం ప్రాథమిక వృద్ధి గణాంకాలను 2.77 శాతానికి పెంచారు. కీలక రంగాల తీరు... తయారీ: మొత్తం సూచీలో 75 శాతం వాటా కలిగిన ఈ రంగం వృద్ధి రేటు ఫిబ్రవరిలో 5.2 శాతంగా ఉంది. 2014 ఇదే నెలలో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా 3.9 శాతం క్షీణించింది. 11నెలల కాలంలో చూసినా ఈ రంగం 0.7 శాతం క్షీణత నుంచి 2.2 శాతం వృద్ధి బాటకు మళ్లింది. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో.... 16 ఫిబ్రవరిలో సానుకూల వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. మైనింగ్: ఫిబ్రవరిలో ఈ రంగం వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. 11 నెలల కాలంలో 0.7 శాతం క్షీణ రేటు నుంచి 1.5 శాతం వృద్ధి బాటకు ఎగసింది. ► కేపిటల్ గూడ్స్: డిమాండ్ బాగుందనడానికి సంకేతంగా, భారీ వస్తువుల ఉత్పత్తికి సూచికగా ఉన్న ఈ రంగం అత్యధికంగా 8.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2014 ఇదే నెలలో ఈ రంగం భారీగా 17.6 శాతం క్షీణతలో ఉంది. 11 నెలల కాలంలో సైతం ఈ రంగం 2.6 శాతం క్షీణ రేటు నుంచి 6 శాతం వృద్ధి రేటుకు మారింది. ► విద్యుత్: ఇక కీలకమైన విద్యుత్ (ఉత్పత్తి) రంగం వృద్ధి రేటు ఫిబ్రవరిలో 11.5 % నుంచి 5.9 శాతానికి తగ్గింది. 11 నెలల్లో మాత్రం విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటు 6.2% నుంచి 9.1 శాతానికి ఎగసింది. ► వినియోగ వస్తువులు: ఈ విభాగంలో నెలవారీగా వృద్ధి రేటు 5.2 శాతం క్షీణ రేటు నుంచి 5.2 శాతం వృద్ధికి మారింది. 11 నెలల కాలంలో చూస్తే మాత్రం ఈ విభాగం క్షీణతలోనే ఉంది. పైగా ఈ మైనస్ రేటు 2.9 శాతం నుంచి 3.7 శాతానికి పెరిగింది. ► దీర్ఘకాలం వినియోగానికి ఉద్దేశించిన వినియోగ వస్తువుల ఉత్పత్తి ఫిబ్రవరిలో క్షీణతలోనే ఉంది. అయితే క్షీణత (మైనస్) రేటు 9.8 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గింది. మొత్తంగా ఈ విభాగం ఇంకా విధాన నిర్ణేతలకు నిరాశ కలిగించే అంశం. ►ఇదే నెలలో స్వల్పకాల వినియోగానికి ఉద్ధేశించిన ఉత్పత్తుల వృద్ధి రేటు మాత్రం భారీగా 10.7 శాతం పెరిగింది. 2014 ఇదే నెలలో ఈ రేటు మైనస్‌లో 2 శాతంగా (క్షీణత) ఉంది. 11 నెలల్లో... 2014-15 ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో (ఏప్రిల్-ఫిబ్రవరి) ఐఐపీ వృద్ధి 2.8 శాతంగా ఉంది. 2013-14 ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 0.1 శాతం క్షీణత (మైనస్)లో ఉంది. పెట్టుబడులు పెరుగుతున్నాయ్... డిమాండ్‌కు సంకేతమైన కేపిటల్ గూడ్స్ మంచి పనితీరు పారిశ్రామిక రంగం మెరుగుపడిందనడానికి సంకేతం. కొత్త వ్యాపారం, విదేశీ ఆర్డర్ల ప్రోత్సాహకర ధోరణికి ఇది సంకేతం - సుమిత్ మజుందార్, సీఐఐ దేశాభివృద్ధికి బాట... వ్యాపార వాతావరణం మెరుగుపడుతోందనడానికి ఈ గణాంకాలు చక్కటి ఉదాహరణ. ప్రత్యేకించి కేపిటల్ రంగాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఈ క్రమం దేశాభివృద్ధికి సైతం దోహదపడుతుంది - అలోక్ శ్రీరామ్, పీహెచ్డీ చాంబర్ విశ్వాసం ఇంకా కుదరాలి... గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వృద్ధి పునరుత్తేజం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే వినియోగ వస్తువుల విభాగంలో ఇంకా నిరాశ నెలకొంది. ఈ రంగం పూర్తిగా పుంజుకుంటేనే వృద్ధిపై పూర్తి విశ్వాసం - రాణా కపూర్, అసోచామ్ రుణ రేట్లు తగ్గితేనే..! వృద్ధి క్రమం, పురోగతి సాధించడానికి, పెట్టుబడులు పెరగడానికి, డిమాండ్ మెరుగుపడ్డానికి వడ్డీరేట్లు మరింత తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో వృద్ధిని పరుగులు పెట్టించడానికి తగిన చర్యలను తీసుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టాలి - దిదార్ సింగ్, ఫిక్కీ -
పరిశ్రమలకు తయారీ బూస్ట్
- జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2.6 శాతం - ఏప్రిల్-జనవరి మధ్య ఈ రేటు 2.5 శాతం న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి 2015 జనవరిలో 2.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అంటే 2014 జనవరితో పోల్చితే తాజాగా జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి 2.6 శాతం పెరిగిందన్నమాట. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటును లెక్కిస్తారు. సూచీలో దాదాపు 75 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం పనితీరు బాగుండడం తాజా సానుకూల ఫలితానికి ఒక కారణం. డిమాండ్‌కు ప్రతిబింబంగా భావించే భారీ యంత్రపరికరాల (క్యాపిటల్ గూడ్స్) ఉత్పత్తి మెరుగ్గా ఉండడం కూడా ఊరటనిచ్చే వృద్ధి రేటుకు కారణం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ గడచిన 10 నెలల కాలంలో ఈ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 0.1 శాతం. 2014 జనవరిలో ఈ వృద్ధి రేటు 1.1 శాతం. 2014 డిసెంబర్లో 3.23 శాతం. తొలి అంచనాల ప్రకారం ఈ రేటు 1.7 శాతంగా ఉన్నా... తాజాగా దీనిని 3.23 శాతంగా సవరించారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) తాజా లెక్కలను విడుదల చేసింది. వివిధ రంగాల పనితీరును చూస్తే... - జనవరిలో తయారీ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 0.3% నుంచి 3.3 శాతానికి ఎగసింది. మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 14 సానుకూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో ఈ రంగం వృద్ధి రేటు 1.7 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా 0.3 శాతం క్షీణించింది (మైనస్). - కేపిటల్ గూడ్స్ ఉత్పత్తి కూడా 3.9 క్షీణ దశ నుంచి 12.8 శాతం వృద్ధి బాటకు మళ్లింది. 10 నెలల కాలంలో కూడా ఉత్పత్తి -0.8 శాతం (క్షీణత) నుంచి 5.7 శాతం వృద్ధికి నడిచింది. - విద్యుత్ ఉత్పాదకత వృద్ధి రేటు 6.5% నుంచి 2.7 శాతానికి తగ్గింది. 10 నెలల్లో మాత్రం ఈ వృద్ధి రేటు 5.7% నుంచి 9.3%కి ఎగసింది. - మైనింగ్ రంగం కూడా 2.7 శాతం వృద్ధి నుంచి 2.8 శాతం క్షీణతలోకి జారింది. 10 నెలల కాలంలో మాత్రం ఈ రంగం ఉత్పత్తి 1.1 శాతం క్షీణత నుంచి 1.3 శాతం వృద్ధికి మళ్లింది. వినియోగ వస్తువుల రంగం నిరాశ... వినియోగ వస్తువుల ఉత్పత్తి 0.5 శాతం క్షీణత లోంచి మరింతగా 1.9 శాతం క్షీణతలోకి జారింది. 10 నెలల కాలంలో కూడా 2.7 శాతం క్షీణత మరింతగా 4.7 శాతం క్షీణతలోకి పడింది. ఇందులో ఒక భాగమైన దీర్ఘకాలిక వినియోగ వస్తువుల ఉత్పత్తి సైతం జనవరిలో క్షీణతలోనే ఉంది. అయితే క్షీణత 8.3 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది. 10 నెలల కాలంలో సైతం క్షీణత 12.5 శాతం నుంచి 14.2 శాతానికి పెరిగింది. స్వల్పకాలిక వినియోగ వస్తువుల విభాగంలో 4.5 శాతం వృద్ధి 0.1 శాతం క్షీణతలోకి పడింది. 10 నెలల కాలంలో చూస్తే వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 1.9 శాతానికి దిగింది. -
పరిశ్రమలు ట్రాక్‌లోకి..!
నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 3.8 శాతం ⇒ఐదు నెలల గరిష్ట స్థాయి ఇది... ⇒తయారీ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్ దన్ను న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో రికవరీ ఆశలకు ఊతమిచ్చింది. వృద్ధి రేటు 3.8 శాతంగా నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా ఈ రేట్లను లెక్కిస్తారు. 2013 నవంబర్‌లో ఈ సూచీలో అసలు వృద్ధిలేకపోగా 1.3% (మైనస్) క్షీణించింది. 2014 అక్టోబర్‌లో (2013 అక్టోబర్‌తో పోల్చితే) అసలు వృద్ధి లేకపోగా 4.2 శాతం క్షీణించిన ఈ రేటు, నవంబర్‌లో ఐదు నెలల గరిష్ట స్థాయిలో నమోదుకావడం పట్ల ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తయారీ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ వంటి రంగాల సానుకూల ఫలితాలు మొత్తం ఐఐపీ సంతృప్తికర వృద్ధికి కారణమైంది. కేంద్ర గణాంకాల కార్యాలయం తాజా గణాంకాలను విడుదల చేసింది. ముఖ్య రంగాలను చూస్తే... తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన ఈ రంగం వృద్ధి రేటు నవంబర్‌లో 3 శాతంగా ఉంది. 2013 ఇదే నెలలో ఈ రేటులో అసలు వృద్ధి లేకపోగా -0.4 శాతం క్షీణించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 నవంబర్‌లో సానుకూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు ప్రతిబింబంగా, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ రంగం వృద్ధి రేటు 1.6 శాతం నుంచి 3.4 శాతానికి చేరింది. విద్యుత్: ఈ రంగం మంచి ఫలితాలను నమోదుచేసుకుంది. నెలవారీగా ఈ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 10 శాతానికి చేరింది. వినియోగ వస్తువులు: వినియోగ వస్తు ఉత్పత్తి క్షీణతలోనే (-2.2%) కొనసాగుతోంది. అయితే 2013 ఇదే నెలతో పోల్చితే క్షీణ రేటు తగ్గడం (-8.9%) కొం తలో కొంత ఊరట. ఆరు నెలల్లో: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 2.2% నమోదయ్యింది. 2013-14 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 0.1 శాతం. దీర్ఘకాలం కొనసాగాలి.. పరిశ్రమలు: నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఇదే ధోరణి ఇకముందూ కొనసాగాలని ఆకాం క్షించాయి. ఇందుకు ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుత ధోరణి మరింత స్థిరపడ్డానికి, పెట్టుబడులు పెరగడానికి, వ్యాపార విశ్వాసం మెరుగుపడ్డానికి పాలసీరేటు తగ్గింపును కోరుతున్నట్లు సీఐఐ సెక్రటరీ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్, ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరీ తదితరులు తెలిపారు. -
పరిశ్రమలు కుదేల్!
⇒ అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి 4.2% క్షీణత ⇒తయారీ, క్యాపిటల్ గూడ్స్,వినియోగ ఉత్పత్తుల రంగాలు పేలవం ⇒రేట్ల కోత తప్పదంటున్న పారిశ్రామిక రంగం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో దారుణ ఫలితాన్ని నమోదుచేసుకుంది. 2013 అక్టోబర్‌లో నమోదయిన విలువతో పోల్చి, 2014 అక్టోబర్ విలువను చూస్తే, అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదు చేసుకుంది. ఈ క్షీణత రేటు -4.2 శాతంగా ఉంది. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి. ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత గణాంకాలను విడుదల చేసింది. వడ్డీరేట్ల కోతకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం ఇక తప్పదని, తద్వారానే పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి సాధ్యమవుతుందని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతంగా ఉన్న ఐఐపీ సెప్టెంబర్‌లో కనీసం 2.8 శాతం వృద్ధినైనా సాధించింది. అయితే ఆ మరుసటి నెలలోనే ఏకంగా క్షీణతలోకి జారిపోవడం పారిశ్రామిక, పాలనా వర్గాలను నిరాశకు గురిచేసింది. అక్టోబర్‌లో తయారీ రంగంసహా, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్, వినియోగ ఉత్పత్తుల విభాగం పేలవ పనితీరును నమోదుచేసుకున్నాయి. ఆయా రంగాల పనితీరును పరిశీలిస్తే... ⇒మొత్తం ఐఐపీ సూచీలో 75 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో అక్టోబర్‌లో అసలు వృద్ధి లేకపోగా -7.6 క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఈ క్షీణత 1.3 శాతమే. ఈ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 అక్టోబర్‌లో ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. కాగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 7 నెలల కాలంలో చూస్తే మాత్రం వృద్ధి రేటు కొంత మెరుగుదలతో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే - 0.1 శాతం క్షీణత నుంచి 0.7 శాతం వృద్ధికి చేరింది. ⇒క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి గత ఏడాది అక్టోబర్‌లో కనీసం 2.5 శాతం వృద్ధిని సాధిస్తే, ఈ ఏడాది ఇదే నెలలో ఈ రేటు ఏకంగా -2.3 క్షీణతలోకి జారిపోయింది. అయితే 7 నెలల కాలంలో ఈ రంగం 0.2 శాతం క్షీణత నుంచి 4.8 శాతం వృద్ధికి మళ్లింది. ⇒ వినియోగ వస్తువుల ఉత్పత్తిలో క్షీణత - 5 శాతం నుంచి మరింతగా -18.6 శాతానికి జారింది. ఏడు నెలల కాలంలో కూడా ఈ క్షీణత రేటు -1.7 శాతం నుంచి -6.3 శాతానికి దిగింది. ⇒విద్యుత్ ఉత్పత్తి మాత్రం మంచి పురోగతి సాధించింది. వృద్ధి రేటు 1.3 శాతం నుంచి ఈ రంగం 13.3 శాతం వృద్ధికి పురోగమించింది. ఏడు నెలల కాలంలో సైతం ఈ రేటు 5.3 శాతం నుంచి 10.7 శాతానికి ఎగసింది. ⇒మైనింగ్ రంగంలో కూడా మంచి పనితీరుతో -2.9 శాతం క్షీణత నుంచి 5.2 శాతం వృద్ధి బాటకు మళ్లింది. ఏడు నెలల్లో కూడా -2.6 క్షీణత రేటు 2.4 శాతం వృద్ధికి మళ్లింది. 7 నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 1.9 శాతానికి మెరుగ్గా ఉంది. అయితే రానున్న నెలల గణాంకాల్లో తాజా క్షీణ ధోరణే పునరావృతం అయితే ఈ స్వల్ప వృద్ధి రేటు సైతం కరిగిపోయే అవకాశం ఉంది. -
స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 20 పాయింట్లు పడిపోయి 27,186కు చేరుకుంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 8,137 వద్ద ట్రేడవుతోంది. మదుపుదారులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. రియాల్టీ, కన్జుమర్ డ్యురబుల్, కేపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ, మెటల్ వాటాలు బాగా నష్టపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లతో బలహీన ట్రెండ్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు. -
9 రోజుల ర్యాలీకి బ్రేక్
గత తొమ్మిది రోజులుగా లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు గురువారం తొలిసారి వెనకడుగు వేశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 54 పాయింట్లు క్షీణించి 27,086 వద్ద నిలవగా, 19 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 8,096 వద్ద స్థిరపడింది. ఇటీవల వరుస లాభాలను నమోదు చేస్తున్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు పాల్పడ్డారని నిపుణులు విశ్లేషించారు. గత తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 826 పాయింట్లు జమ చేసుకున్న సంగతి తెలిసిందే. రియల్టీ బోర్లా: బీఎస్ఈలో ప్రధానంగా రియల్టీ ఇండెక్స్ 4.5% పతనమైంది. డీఎల్ఎఫ్ దాదాపు 9% దిగజారి రూ. 167 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 2,803 కోట్లు తగ్గి రూ. 29,809 కోట్లకు పరిమితమైంది. డీఎల్ఎఫ్కు హర్యానాలోని వజీరాబాద్‌లో 350 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 2010లో చేసిన ప్రతిపాదనను పంజాబ్, హర్యానా హైకోర్ట్ తాజాగా కొట్టివేయడంతో షేరు పతనమైంది. ఈ ప్రాజెక్ట్‌ను విడిగా(ఇండిపెండెంట్) అభివృద్ధి చేయతలపెట్టినందున ఈ ప్రభావం ఇతర ఏ ప్రాజెక్ట్‌లపైనా ఉండదని కంపెనీ పేర్కొంది. కాగా, ఈ భూమిని నెల రోజుల్లోగా అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా వేలం వేయాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. బిడ్డింగ్‌లో డీఎల్‌ఎఫ్‌కూ అవకాశముంటుందని తెలిపింది. ఈ భూమిలో గోల్ఫ్ విల్లాలను నిర్మించాలని డీఎల్ఎఫ్ ప్రణాళికలు వేసింది. ఇక ఈ బాట లో యూనిటెక్, ఒబెరాయ్, డీబీ, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్ 6-4% మధ్య నీరసించాయి. జేపీ 18% డౌన్: మరోపక్క కన్స్ట్రక్షన్ దిగ్గజం జేపీ అసోసియేట్స్ షేరు 18% కుప్పకూలింది. రూ. 38 వద్ద ముగిసింది. ప్రమోటర్ సంస్థ జేపీ ఇన్ఫ్రా వెంచర్స్ రూ. 62.4 కోట్ల విలువైన 1.45% వాటా(1.34 కోట్ల షేర్లు)ను ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించడం దీనికి కారణమైంది. అయితే సామాజిక కోణంతోనే ప్రమోటర్లు షేర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీలో ప్రమోటర్లకు 29.75% వాటా(72.36 కోట్ల షేర్లు) ఉన్నదని, తాజా అమ్మకంతో ఈ వాటా నామమాత్రంగా తగ్గి 28.3%కు చేరినట్లు తెలిపింది. ప్రమోటర్లకు కంపెనీపట్ల పూర్తి విశ్వాసం ఉన్నదని, ఇన్వెస్టర్లు, వాటాదారులు సైతం యాజమాన్యంపై నమ్మకముంచాలని కోరింది. -
సెన్సెక్స్ 96 పాయింట్లు ప్లస్
26,000కు పైన ముగింపు రెండు రోజుల నష్టాలకు చెక్ చివరి గంటన్నరలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నాయి. తొలుత స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 140 పాయింట్ల వరకూ జారింది. 25,850 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. రోజులో అధిక భాగం నీరసించినప్పటికీ చివర్లో జరిగిన షార్ట్ కవరింగ్ కారణంగా లాభాల్లోకి మళ్లినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ట్రేడింగ్ ముగిసేసరికి 96 పాయింట్ల లాభంతో 26,087 వద్ద నిలిచింది. వెరసి రెండు రోజుల నష్టాలకు చెక్ పడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 280 పాయింట్లు పడ్డ సంగతి తెలిసిందే. కాగా, నిఫ్టీ కూడా 43 పాయింట్లు పుంజుకుని 7,791 వద్ద ముగిసింది. జూలై డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయని నిపుణులు తెలిపారు. స్పైస్‌జెట్ షేరు 16% పతనం : కాగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందన్న వార్తల కారణంగా స్పైస్‌జెట్ షేరు బీఎస్ఈలో 16% దిగజారింది. రూ. 14 వ ద్ద ముగిసింది. -
లాభాలతో పరుగులు పెట్టిన సెన్సెక్స్!
కాపిటల్ గూడ్స్, బ్యాంక్, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో నాలుగు రోజుల నష్టాలకు తెరదించుతూ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 337 పాయింట్ల లాభంతో 25368 వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల వృద్ధితో 7580 పాయింట్ల వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బీపీసీఎల్, గెయిల్, డీఎల్ఎఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్ ఎమ్ డీసీ కంపెనీలు భారీగా సుమారు 4 శాతం లాభపడ్డాయి. కొటాక్ మహీంద్ర, సన్ ఫార్మా, ఇన్పోసిస్, కెయిర్న్ ఇండియా, టెక్ మహీంద్ర కంపెనీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
ఎల్అండ్టీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: క్యాపిటల్ గూడ్స్ దిగ్గజం ఎల్అండ్టీ గత ఆర్థిక సంవత్సరం(2013-14) జనవరి-మార్చి(క్యూ4) కాలానికి ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. నికర లాభం 69% జంప్‌చేసి రూ. 2,723 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 1,610 కోట్లను మాత్రమే ఆర్జించింది. మౌలిక సదుపాయాలు, భారీ ఇంజనీరింగ్ విభాగాల పనితీరు ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ ఫలితాలివి. ఇదే కాలంలో నికర అమ్మకాలు 10% పుంజుకుని రూ. 20,079 కోట్లకు ఎగశాయి. గతంలో రూ. 18,076 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎల్అండ్టీ హైడ్రోకార్బన్‌కు 2013 ఏప్రిల్ నుంచి హైడ్రోకార్బన్ బిజినెస్‌ను బదిలీ చేసినందున ఫలితాలలో వీటిని కలపలేదని ఎల్అండ్టీ తెలిపింది. కొత్త ప్రభుత్వంపై ఆశలు... కేంద్రంలో మోడీ అధ్యక్షతన ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి అజెండా ఆశావహంగా ఉన్నదని, తద్వారా వృద్ధికి అనువైన వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీకి కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగాలకు వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్నాయని, స్పష్టమైన విధానాలు, వాటి అమలు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. భారీ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఆదాయం 47% ఎగసి రూ. 1,348 కోట్లకు చేరగా, ఇన్ఫ్రా విభాగం నుంచి రూ. 13,260 కోట్లు లభించింది. ఇది 17% వృద్ధి. ఆర్డర్‌బుక్ విలువ 13% పుంజుకుని రూ. 1,62,952 కోట్లకు చేరింది. దీనిలో విదేశీ ఆర్డర్ల వాటా 21%. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు యథాతథంగా రూ. 1,549 వద్ద ముగిసింది. -
వారం రోజుల కనిష్టం
ఉక్రెయిన్‌పై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి.సెన్సెక్స్ 56 పాయింట్లు క్షీణించి 22,632 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల కనిష్టంకాగా, నిఫ్టీ సైతం 21 పాయింట్లు తగ్గి 6,761 వద్ద నిలిచింది. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు నీరసించాయి. ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాలు 1% చొప్పున నష్టపోగా, హెల్త్‌కేర్ దాదాపు 2% లాభపడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టడంతో గడిచిన శుక్రవారం సైతం సెన్సెక్స్ 188 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే. విదేశీ సంకేతాలు, సార్వత్రిక ఎన్నికలపై ఆశావహ అంచనాలతో ఇటీవల మార్కెట్లలో వచ్చిన ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యాపై ఆంక్షలు పెరిగే అవకాశముండటంతో ఆసియా మార్కెట్లు కూడా నష్టపోయాయని, ఇది కూడా అమ్మకాలకు కారణమైందని వివరించారు. సిప్లా 3% అప్ ఎఫ్ఐఐలు రూ. 77 కోట్లను మాత్రమే ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 370 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో గెయిల్, భెల్, ఎల్అండ్టీ, హీరోమోటో, టాటా మోటార్స్, హిందాల్కో, కోల్ ఇండియా 2-1.5% మధ్య నష్టపోగా, సిప్లా 3%పైగా ఎగసింది. ఈ బాటలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఎస్బీఐ 2-1% మధ్య పుంజుకున్నాయి. కాగా, మిడ్ క్యాప్ షేర్లకు డిమాండ్ కొనసాగింది. యునెటైడ్ ఫాస్ఫరస్, అడ్వాంటా, కిర్లోస్కర్ బ్రదర్స్, జేపీ ఇన్ఫ్రా, జైన్ ఇరిగేషన్, ఇండియాబుల్స్ హౌసింగ్, వోకార్డ్, నైవేలీ లిగ్నైట్, సింఫనీ, క్లారిస్ లైఫ్ తదితరాలు 20-6% మధ్య పురోగమించాయి. అయితే ఎతిహాద్ నుంచి ఓపెన్ ఆఫర్ ఉండదన్న వార్తలతో జెట్ ఎయిర్వేస్ 3% క్షీణించింది. -
మళ్లీ మార్కెట్ల దూకుడు
కొత్త రికార్డుల వెల్లువ 136 పాయింట్లు ప్లస్ 22,765 వద్దకు సెన్సెక్స్ 6,800 అధిగమించిన నిఫ్టీ ఎఫ్ఐఐల పెట్టుబడులు ఓకే మార్కెట్ల దూకుడు కొనసాగుతోంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయ్. దీంతో సంస్కరణలు జోరందుకుంటాయన్న ఆశలు సెంటిమెంట్‌కు జోష్‌నిస్తున్నాయి. వెరసి మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. తద్వారా మరోసారి కొత్త రికార్డులకు తెరలేపాయి. సెన్సెక్స్ 136 పాయింట్లు పుంజుకుని 22,765 వద్ద ముగియగా, 38 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 6,818 వద్ద నిలిచింది. ఈ బాటలో ఇంట్రాడేలో సెన్సెక్స్ 22,795ను తాకగా, నిఫ్టీ 6,825కు చేరింది. ఇవన్నీ కొత్త రికార్డులే కావడం విశేషం! గురువారం రూ. 433 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 213 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్ రూ. 218 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీ సాధిస్తుందన్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేషకుల తెలిపారు. క్యాపిటల్ గూడ్స్ జోరు బీఎస్ఈలో ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగాలు 3-1.5% మధ్య లాభపడ్డాయి. గోవాలో ముడిఇనుము మైనింగ్‌పై ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీం కోర్టు తొలగించడంతో సెసాస్టెరిలైట్ దాదాపు 5% ఎగసింది. చిన్న షేర్లకు డిమాండ్ ట్రేడైన షేర్లలో 1,761 లాభపడితే, కేవలం 1,029 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో బోనస్ షేర్ల జారీ అంచనాలతో బయోకాన్ 10% జంప్ చే యగా..ప్రమోటర్లకు ప్రిఫరెన్స్ షేర్ల జారీ వార్తలతో షషున్ ఫార్మా 20% దూసుకెళ్లింది. ఇక కోపగ్జోన్ జనరిక్ ఔషధాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువడటంతో నాట్కో ఫార్మా 7.5% ఎగసింది. ప్రోత్సాహకర ఫలితాలతో లిబర్టీ షూస్ 14% జంప్‌చేయగా, హెచ్ సీఎల్ ఇన్ఫో, జిందాల్ సౌత్, కల్పతరు పవర్, సింఫనీ, డిష్‌మ్యాన్, ఐవీఆర్సీఎల్, సుజ్లాన్, జేబీ కెమ్, నవభారత్, ఆర్కిడ్ కెమ్ 11-6% మధ్య ఎగశాయి. -
రుతుపవన అంచనాల ఎఫెక్ట్
వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టపోయాయి. అయితే గత రెండు రోజులతో పోలిస్తే బుధవారం ట్రేడింగ్‌లో అమ్మకాలు పెరిగాయి. వెరసి సెన్సెక్స్ 208 పాయింట్లు క్షీణించి 22,277 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల కనిష్టంకాగా, మూడు రోజుల్లో 438 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ కూడా 58 పాయింట్లు పతనమై 6,675 వద్ద నిలిచింది. ప్రధానంగా రియల్టీ, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 4-2.5% మధ్య దిగజారాయి. హోల్‌సేల్, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు పుంజుకోవడంతో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలకు గండిపడిందని, దీంతో వడ్డీ ప్రభావిత రంగాలలో అమ్మకాలు పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ స్థాయిలో రుతుపవనాల ప్రభావం ఉంటుందంటూ తాజాగా వెలువడ్డ అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయని తెలిపారు. ఇక పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, ఎన్నికల అంచనాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారని విశ్లేషించారు. ఇటీవల మార్కెట్లలో వచ్చిన ర్యాలీ దిద్దుబాటుకు కారణమైనట్లు తెలిపారు. ఐటీ నేలచూపులు మంగళవారం ఉదయం ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడికాగా, బుధవారం సాయంత్రం టీసీఎస్ ఫలితాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఐటీ దిగ్గజ షేర్లు డీలాపడ్డాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3% స్థాయిలో నష్టపోయాయి. ఇక క్యాపిటల్ గూడ్స్ షేర్లు భెల్, ఎల్అండ్టీ, సీమెన్స్ సైతం 3% చొప్పున నీరసించాయి. ఈ బాటలో రియల్టీ షేర్లు అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, యూనిటెక్, డీఎల్ఎఫ్, డీబీ 6.5-4.5% మధ్య పతనమయ్యాయి. కాగా, సెన్సెక్స్ దిగ్గజాలలో ఐటీసీ, టాటా స్టీల్ 1.5% చొప్పున లాభపడ్డాయి. ఎఫ్ఐఐలు వరుసగా రెండో రోజు స్వల్ప స్థాయిలో అమ్మకాలకు కట్టుబడగా, దేశీయ ఫండ్స్ మరోసారి రూ. 348 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. చిన్న షేర్లలో అమ్మకాలు సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1%పైగా క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1,654 నష్టపోతే, కేవలం 1,088 బలపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో ఇండియా సిమెంట్స్, జేపీ పవర్, గృహ్ ఫైనాన్స్, నెట్వర్క్18, ఐవీఆర్సీఎల్, మహారాష్ట్ర సీమ్‌లెస్, జేపీ అసోసియేట్స్, ప్రాజ్, స్టెరిలైట్ టెక్, షిప్పింగ్ కార్పొరేషన్, జెట్ ఎయిర్వేస్, డీసీబీ, జేకే లక్ష్మీ సిమెంట్ తదితరాలు 10-6% మధ్య తిరోగమించాయి. -
స్వల్పంగా పెరిగిన సూచీలు
ముంబై: రెండు రోజుల పతనానికి అడ్డుకట్ట వేస్తూ అక్టోబర్ నెల మొదటి రోజు సూచీలు లాభాలతో ముగిశాయి. ఆటో రంగ అమ్మకాలు బాగుండటానికి తోడు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగొస్తుండటంతో ఆటో, రియల్టీ, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు సూచీలను పైకి తీసుకెళ్ళాయి. దీంతో సోమవారం ముగింపుతో పోలిస్తే సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 19,517 వద్ద ముగియగా, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 5,780 వద్ద క్లోజయ్యింది. వ్యయ నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో 16 సంవత్సరాల తర్వాత అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఒకానొక దశలో మార్కెట్లు పతనమైనా ఆ తర్వాత వెనువెంటనే కోలుకున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ మూడు వారాల కనిష్ట స్థాయి 19,264 పాయింట్లకు పడిపోయినా, హెచ్‌డీఎఫీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బీహెచ్ఈఎల్ షేర్లు మూడు శాతం పెరగ్గా, ఓఎన్జీసీ, సెసా గోవా, ఎన్టీపీసీ, టాటాపవర్ రెండు నుంచి నాలుగు శాతం నష్టపోయాయి. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 514 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. 12 నుంచి రోజువారి సర్క్యూట్ బ్రేకర్స్ ప్రస్తుతం మూడు నెలల ట్రేడింగ్ పరిమాణం ఆధారంగా నిర్ణయిస్తున్న సూచీల ట్రేడింగ్ హాల్ట్ సర్క్యూట్ బ్రేకర్స్‌ను అక్టోబర్ 11 నుంచి రోజువారీ ట్రేడింగ్ పరిమాణం ఆధారంగా నిర్ణయించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. అక్టోబర్ 11 వరకు సెన్సెక్స్ ఒక రోజులో 1,950 పాయింట్లు పెరిగినా లేక తగ్గినా ఒక గంట పాటు ట్రేడింగ్‌ను ఆపే విధంగా సర్క్యూట్ బ్రేకర్ అమలులో ఉంటుందని, ఆ తర్వాత నుంచి ఈ సర్క్యూట్ బ్రేకర్‌ను రోజువారీ నిర్ణయిస్తారని సెబీ మంగళవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. అక్టోబర్ 11 వరకు 10 %, 15%, 20% సర్క్యూట్ బ్రేకర్స్‌ను సెప్టెంబర్ 30 నాటి మూడు నెలల ట్రేడింగ్ పరిమాణం పరంగా లెక్కించాలని సెబీ పేర్కొంది. దీని ప్రకారం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఒంటి గంటలోపు సెన్సెక్స్ 10 శాతం అంటే 1,950 పాయింట్లు, నిఫ్టీ 570 పాయింట్లు నష్టపోయినా లేక పెరిగినా ఒక గంటపాటు ట్రేడింగ్‌ను ఆపేయడం జరుగుతుంది. నేడు మార్కెట్లకు సెలవు గాంధీజీ జయంతి సందర్భంగా బుధవారం అన్ని ఫైనాన్షియల్ మార్కెట్లతో పాటు బులియన్, కమోడిటీ మార్కెట్లు పనిచేయవు. బీఎస్ఈ, సెన్సెక్స్, ఫారెక్స్ , కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్లు అక్టోబర్ 2న పనిచేయవు.