సెన్సెక్స్ 96 పాయింట్లు ప్లస్
26,000కు పైన ముగింపు
రెండు రోజుల నష్టాలకు చెక్
చివరి గంటన్నరలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నాయి. తొలుత స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 140 పాయింట్ల వరకూ జారింది. 25,850 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. రోజులో అధిక భాగం నీరసించినప్పటికీ చివర్లో జరిగిన షార్ట్ కవరింగ్ కారణంగా లాభాల్లోకి మళ్లినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ట్రేడింగ్ ముగిసేసరికి 96 పాయింట్ల లాభంతో 26,087 వద్ద నిలిచింది.
వెరసి రెండు రోజుల నష్టాలకు చెక్ పడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 280 పాయింట్లు పడ్డ సంగతి తెలిసిందే. కాగా, నిఫ్టీ కూడా 43 పాయింట్లు పుంజుకుని 7,791 వద్ద ముగిసింది. జూలై డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయని నిపుణులు తెలిపారు.
స్పైస్‌జెట్ షేరు 16% పతనం : కాగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందన్న వార్తల కారణంగా స్పైస్‌జెట్ షేరు బీఎస్‌ఈలో 16% దిగజారింది. రూ. 14 వ ద్ద ముగిసింది.