9 రోజుల ర్యాలీకి బ్రేక్
గత తొమ్మిది రోజులుగా లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు గురువారం తొలిసారి వెనకడుగు వేశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 54 పాయింట్లు క్షీణించి 27,086 వద్ద నిలవగా, 19 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 8,096 వద్ద స్థిరపడింది. ఇటీవల వరుస లాభాలను నమోదు చేస్తున్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు పాల్పడ్డారని నిపుణులు విశ్లేషించారు. గత తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 826 పాయింట్లు జమ చేసుకున్న సంగతి తెలిసిందే.
రియల్టీ బోర్లా: బీఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ ఇండెక్స్ 4.5% పతనమైంది. డీఎల్‌ఎఫ్ దాదాపు 9% దిగజారి రూ. 167 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 2,803 కోట్లు తగ్గి రూ. 29,809 కోట్లకు పరిమితమైంది. డీఎల్‌ఎఫ్‌కు హర్యానాలోని వజీరాబాద్‌లో 350 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 2010లో చేసిన ప్రతిపాదనను పంజాబ్, హర్యానా హైకోర్ట్ తాజాగా కొట్టివేయడంతో షేరు పతనమైంది.
ఈ ప్రాజెక్ట్‌ను విడిగా(ఇండిపెండెంట్) అభివృద్ధి చేయతలపెట్టినందున ఈ ప్రభావం ఇతర ఏ ప్రాజెక్ట్‌లపైనా ఉండదని కంపెనీ పేర్కొంది. కాగా, ఈ భూమిని నెల రోజుల్లోగా అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా వేలం వేయాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. బిడ్డింగ్‌లో డీఎల్‌ఎఫ్‌కూ అవకాశముంటుందని తెలిపింది. ఈ భూమిలో గోల్ఫ్ విల్లాలను నిర్మించాలని డీఎల్‌ఎఫ్ ప్రణాళికలు వేసింది. ఇక ఈ బాట లో యూనిటెక్, ఒబెరాయ్, డీబీ, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్ 6-4% మధ్య నీరసించాయి.
జేపీ 18% డౌన్: మరోపక్క కన్‌స్ట్రక్షన్ దిగ్గజం జేపీ అసోసియేట్స్ షేరు 18% కుప్పకూలింది. రూ. 38 వద్ద ముగిసింది. ప్రమోటర్ సంస్థ జేపీ ఇన్‌ఫ్రా వెంచర్స్ రూ. 62.4 కోట్ల విలువైన 1.45% వాటా(1.34 కోట్ల షేర్లు)ను ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించడం దీనికి కారణమైంది. అయితే సామాజిక కోణంతోనే ప్రమోటర్లు షేర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీలో ప్రమోటర్లకు 29.75% వాటా(72.36 కోట్ల షేర్లు) ఉన్నదని, తాజా అమ్మకంతో ఈ వాటా నామమాత్రంగా తగ్గి 28.3%కు చేరినట్లు తెలిపింది. ప్రమోటర్లకు కంపెనీపట్ల పూర్తి విశ్వాసం ఉన్నదని, ఇన్వెస్టర్లు, వాటాదారులు సైతం యాజమాన్యంపై నమ్మకముంచాలని కోరింది.