రుతుపవన అంచనాల ఎఫెక్ట్
వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టపోయాయి. అయితే గత రెండు రోజులతో పోలిస్తే బుధవారం ట్రేడింగ్‌లో అమ్మకాలు పెరిగాయి. వెరసి సెన్సెక్స్ 208 పాయింట్లు క్షీణించి 22,277 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల కనిష్టంకాగా, మూడు రోజుల్లో 438 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ కూడా 58 పాయింట్లు పతనమై 6,675 వద్ద నిలిచింది. ప్రధానంగా రియల్టీ, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 4-2.5% మధ్య దిగజారాయి.
హోల్‌సేల్, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు పుంజుకోవడంతో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలకు గండిపడిందని, దీంతో వడ్డీ ప్రభావిత రంగాలలో అమ్మకాలు పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ స్థాయిలో రుతుపవనాల ప్రభావం ఉంటుందంటూ తాజాగా వెలువడ్డ అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయని తెలిపారు. ఇక పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, ఎన్నికల అంచనాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారని విశ్లేషించారు. ఇటీవల మార్కెట్లలో వచ్చిన ర్యాలీ దిద్దుబాటుకు కారణమైనట్లు తెలిపారు.
ఐటీ నేలచూపులు
మంగళవారం ఉదయం ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడికాగా, బుధవారం సాయంత్రం టీసీఎస్ ఫలితాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఐటీ దిగ్గజ షేర్లు డీలాపడ్డాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3% స్థాయిలో నష్టపోయాయి. ఇక క్యాపిటల్ గూడ్స్ షేర్లు భెల్, ఎల్‌అండ్‌టీ, సీమెన్స్ సైతం 3% చొప్పున నీరసించాయి. ఈ బాటలో రియల్టీ షేర్లు అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, యూనిటెక్, డీఎల్‌ఎఫ్, డీబీ 6.5-4.5% మధ్య పతనమయ్యాయి. కాగా, సెన్సెక్స్ దిగ్గజాలలో ఐటీసీ, టాటా స్టీల్ 1.5% చొప్పున లాభపడ్డాయి. ఎఫ్‌ఐఐలు వరుసగా రెండో రోజు స్వల్ప స్థాయిలో అమ్మకాలకు కట్టుబడగా, దేశీయ ఫండ్స్ మరోసారి రూ. 348 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.
చిన్న షేర్లలో అమ్మకాలు
సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1%పైగా క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1,654 నష్టపోతే, కేవలం 1,088 బలపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో ఇండియా సిమెంట్స్, జేపీ పవర్, గృహ్ ఫైనాన్స్, నెట్‌వర్క్18, ఐవీఆర్‌సీఎల్, మహారాష్ట్ర సీమ్‌లెస్, జేపీ అసోసియేట్స్, ప్రాజ్, స్టెరిలైట్ టెక్, షిప్పింగ్ కార్పొరేషన్, జెట్ ఎయిర్‌వేస్, డీసీబీ, జేకే లక్ష్మీ సిమెంట్ తదితరాలు 10-6% మధ్య తిరోగమించాయి.