ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. ఐటీ, టెక్నాలజీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 179 పాయింట్లు పెరిగి 72,026 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు బలపడి 21,711 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధంలో స్థిరమైన లాభాలతో ట్రేడయ్యాయి.
ఈ క్రమంలో సెన్సెక్స్ 309 పాయింట్లు బలపడి 72,156 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 21,750 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. అయితే మిడ్ సెషన్‌లో తలెత్తిన అనూహ్య అమ్మకాలతో సూచీలు లాభాలన్నీ కోల్పోయాయి. ట్రేడింగ్ చివర్లో మరోసారి కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా, బ్యాంకింగ్, షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్‌తో బీఎస్‌ఈ స్మాల్, మిడ్ సూచీలు వరుసగా 0.61%, 0.19% చొప్పున రాణించాయి.
► డిసెంబర్ క్వార్టర్ ఫలితాల వెల్లడికి ముందు(గురువారం నుంచి) ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కోఫోర్జ్, టీసీఎస్ షేర్లు 2% పెరిగాయి. ఎల్‌టీఐఎం, ఎంఫసీస్, పర్‌సిస్టెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో షేర్లు ఒక శాతం లాభపడ్డాయి.
► ఎవర్ రెన్యూ ఎనర్జీ లిమిటెడ్ నుంచి 225 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఆర్డర్‌ను దక్కించుకోవడంతో సుజ్లాన్ ఎనర్జీ షేరు 5% లాభపడి రూ.41 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది.
Comments
Please login to add a commentAdd a comment